ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న భారత జట్టు తొలి టెస్ట్‌లో ఓటమిని చవిచూసింది. బుధవారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ (Shubman Gill) క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. ఈ సిరీస్‌లో వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కోసం స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతాడు అని ముందు నుంచి వార్తలు వస్తున్నాయి. దీంతో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడిన బుమ్రా రెండో టెస్ట్ నుంచి విశ్రాంతి తీసుకుంటారని అంతా భావించారు.
కానీ, రెండో టెస్ట్ మ్యాచ్‌కి బుమ్రా అందుబాటులో ఉంటాడు అని గిల్ (Shubman Gill) వెల్లడించాడు. కానీ, అతడిని ఆడిచే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నాడు. బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ గురించి ఆలోచిస్తున్నామని గిల్ స్పష్టం చేశాడు. సరైన కూర్పుతో తుది జట్టును ఎంపిక చేస్తామన్న గిల్.. అప్పుడే బుమ్రా గురించి నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. కనీసం మూడు మ్యాచ్‌లకు బుమ్రా అందుబాటులో ఉంటాడు అని.. అతను లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందన్న గిల్.. అధిక పని భారం పెట్టడం కూడా మంచిది కాదని వెల్లడించాడు. 20 వికెట్లు పడగొట్టడంతో పాటు భారీగా పరుగు రాబట్టే జట్టు కోసం ప్రయత్నిస్తున్నాం. పిచ్‌ను పరిశీలించిన తర్వాత స్పిన్నర్ల విషయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు.