గోల్కొండ కోటపై కాషాయ
జెండాను ఎగురవేస్తాం
స్థానిక ఎన్నికల్లో సత్తా
చాటుదాం రాష్ట్ర బిజెపి
అధ్యక్షుడిగా బాధ్యతలు
స్వీకరించిన అనంతరం
రాంచందర్‌రావు అలిగిన
ధర్మపురి అరవింద్..
కార్యక్రమానికి గైర్హాజరు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ ని అధికారంలోకి తీసుకురావడమే కాకుండా గో ల్కొండ కోటపై కాషాయ జెండాను ఎగరేయడమే మన ఏకైక లక్ష్యమని ఆ పార్టీ నూతన అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు స్పష్టం చేశారు. పార్టీ కోసం ఐక్యంగా పని చేసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. బిజెపి అనేది క్యాడర్ బేస్డ్ పార్టీ, మాస్ బేస్డ్ పార్టీ, ఐడియాలాజికల్ బేస్ పార్టీ అని స్పష్టం చేశారు. పంచాయత్ నుంచి పార్లమెంట్ వరకు బిజెపి జెండా ఎగరాలని కోరారు. రాష్ట్ర బిజెపి రథసారథిగా ఏకగ్రీవం గా ఎన్నికైనట్లు పార్టీ కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కేంద్రమంత్రి శోభాకరండ్లాజే ప్రకటిం చి నియామక పత్రాన్ని అందజేశారు. రంగారెడ్డి జిల్లాలోని మన్నెగూడలోన ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం జరిగిన అధ్యక్ష ఎన్నిక కార్యక్రమానికి కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సం జయ్, ఎంపిలు
డికె అరుణ, ఈటల రాజేందర్, లక్ష్మణ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. అధ్యక్ష పదవికి రామచంద్రరావు నామినేషన్ ఒకటే రావడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి ప్రస్తుత అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేతుల మీదుగా శోభాకరండ్లాజే అందజేశారు. అనంతరం కిషన్‌రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రామచంద్రరావుకు పార్టీ నుంచి జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తొలిసారిగా కార్యకర్తలను ఉద్దేశించి రామచంద్రరావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలవడం ద్వారా వచ్చే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వద్దామని అన్నారు. తెలంగాణ ప్రజలు బిజెపి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, ఇందుకు అనుగుణంగానే కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరు కష్టించి పని చేయాలని పిలుపునిచ్చారు.
నేను క్రిమినల్ లాయర్‌ని ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే న్యాయపరంగా చర్యలు తప్పవు
తనను సౌమ్యుడిగా భావించవద్దని, విద్యార్థి ఉద్యమాల నుంచి నేటి వరకు పోరాట పటిమతో ముందుకెళ్లానని, 14 సార్లు అరెస్టు అయి జైలుకు వెళ్లి వచ్చానని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటంలో తాను ఎప్పుడూ ముందే ఉంటానని ఆయన హెచ్చరించారు. ఎంతోమంది కార్యకర్తలు, నేతల త్యాగాలతో బిజెపి ఈ స్థాయిలో ఉందని అన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ తదితరులు నాయకత్వంలో వారి సహకారంతో ముందుకెళ్తామని పేర్కొన్నారు. 14 కోట్ల సభ్యత్వాలతో ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బిజెపి కొనసాగుతోందని, అలాంటి రాజకీయ పార్టీ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టడం గర్వంగా భావిస్తున్నానని అన్నారు.
కొత్త పాత అంటూ కొందరు మాట్లాడుతున్నారని, అయితే కొత్తా పాతా అనే తేడా ఏమీ లేదని, పాత నీటిలో కొత్త నీరు కలిస్తేనే బాగుంటుందని చెబుతూ ఎవరైనా భాజపాలో చేరినప్పటి నుంచే పార్టీ అనే కుటుంబంలో సభ్యులవుతారని పేర్కొన్నారు. యువత, మహిళలు భాజపాలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య, వికసిత్ తెలంగాణకు బిజెపి అధికారంలోకి రావాలని ప్రజలు పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. కాగా అధికార కాంగ్రెస్ పార్టీపై రామచంద్రరావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ పేక్ న్యూస్ యూనివర్సిటీ నడుపుతోందని ఆరోపించారు. భాజపా నేతలను సొంత సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. అటువంటి వారిని క్షమించేది లేదని తాను క్రిమినల్ లాయర్‌నని చెబుతూ అటువంటి వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలను మనం సమర్థంగా తిప్పికొట్టాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. రామచంద్రరావును కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపిలు డికె అరుణ, ఈటల రాజేందర్, లక్ష్మణ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు ఘనంగా సత్కరించారు.
హాజరు కాని ధర్మపురి అర్వింద్
కాగా ఈ కార్యక్రమానికి నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ హాజరు కాలేదు. ఆయన వ్యక్తిగత పనుల ఒత్తిడి కారణగా హాజరు కావడం లేదని సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే బిజెపి అధ్యక్ష స్థానానికి పోటీపడిన వారిలో ధర్మపురి అర్వింద్ ఒకరు. ఆయనకు ఈ పదవి దక్కలేదనే ఆవేదనతో అలిగి కొత్త అధ్యక్ష ఎన్నిక కార్యక్రమానికి హాజరు కాలేదని ప్రచారం జరుగుతోంది. మరో ఎంపి రఘునందన్‌రావు కూడా బిజెపి అధ్యక్ష పదవిని ఆశించారు. అయితే ఆయన మోకాలికి చికిత్స చేయించుకుని హాస్పిటల్‌లో ఉన్న కారణంగా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.
కర్ణాటక, తెలంగాణలో ఏటీఎం సర్కార్లు: శోభాకరండ్లాజే
కర్ణాటక, తెలంగాణలో ఏటీఎం సర్కార్లు పని చేస్తున్నాయని పార్టీ కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కేంద్రమంత్రి శోభాకరండ్లాజే విమర్శించారు. తెలంగాణ అధ్యక్ష పదవి ఎన్నిక ఏకగ్రీవం కావడం సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర కాలంలోనే అవినీతి, అసమర్థత ప్రభుత్వంగా విమర్శలు మూటగట్టుకుందని పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పుడు అంతా బాజపా వైపు చూస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వఅందిస్తున్న సంక్షేమ పథకాలను అట్టడుగు స్థాయి వరకు ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని పార్టీ నేతలకు సూచించారు.
కార్యకర్తలే పార్టీకి నిజమైన నాయకులు: కిషన్‌రెడ్డి
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు ఉన్నా అసలు సిసలైన కార్యకర్తలే నాయకులని కేంద్ర మంత్రి, బిజెపి మాజీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అధ్యక్ష స్థానంలో ఎవరు ఉన్నా మనందరం ఐక్యంగా పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో పదేళ్లు పాలన చేసిన బిఆర్‌ఎస్, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండు అవినీతి పార్టీలేనని ప్రకటించారు. అప్పులు లెక్కలేనంత చేసి మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రాన్ని బిఆర్‌ఎస్ అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నోటికొచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. కొత్త అధ్యక్షుడు రామచందర్రావు నాయకత్వంలో అందరూ కలిసి పనిచేయాలని బాజపా అధికారంలోకి రావడమే లక్ష్యమని అన్నారు.
రామచంద్రరావు ఓ మిస్సైల్: బండి సంజయ్
బిజెపి రాష్ట్ర కొత్త రథసారథి రామచంద్రరావు ఓ మిస్సైల్ వంటి వాడని కేంద్ర మంత్రి బండి సంజయ్ కొనియాడారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా, ఏబీవీపీ నాయకుడిగా, బీజేపీలో కిందిస్థాయి నుండి అనేక బాధ్యతలు నిర్వర్తించిన నాయకుడు రామచంద్రరావు కష్టపడి కమిట్‌మెంట్ తో పనిచేసే నాయకుడని అన్నారు. సోషల్ మీడియాలో కావాలనే రామచంద్రరావుపై ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో మోడీ సహా మా అందరిపైనా ఇలాగే ట్రోల్ చేశారని, అటువంటి వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు. కాషాయ జెండా కోసం త్యాగాలు చేసిన నాయకులు ఎంత మంది ఉన్నారో చెప్పాలన్న బండి సంజయ్ నక్సలైట్లు పోస్టర్లు వేస్తే భయపడి పారిపోతున్న ఆ రోజుల్లో ఎదురొడ్డి పోరాడిన నాయకుడు రామచంద్రరావు అని గుర్తు చేసుకున్నారు. విద్యార్ధి దశలోనే కాషాయ జెండాను రెపరెపలాడించి అధికారం కోసం పోరాడిన నాయకుడని అన్నారు. ఆయన అధ్యక్ష పదవికి ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు.