తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపిక/ఎన్నికపై పార్టీలో మిశ్రమ స్పందన వ్యక్తమౌతోంది. రాష్ట్రాధ్యక్షుడిని ఖరారు చేయడంలో నాయకత్వం అనుస రించిన పంథా, పెట్టుకున్న ప్రాతిపదికపై విమర్శలు, ప్రశంసలు…. రెండూ ఉన్నాయి, ‘తూటా లేని తుపాకీతో యుద్ధానికి సిద్ధమైంద’ని కొందరంటే, ‘గ్రూపుల మాయలో పడకుండా సిద్ధాంత నిబద్ధత చాటింది’ అని మరికొంద రు… ఇలా పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు. కొత్త అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావుకు మాత్రం రాబోయే రోజులు కత్తి మీద సాము! స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక ప్రధాన సవాల్!
బిసిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించి, బ్రాహ్మణ అగ్రవర్ణపు వ్యక్తికి పార్టీ పగ్గాలిచ్చిన పరిస్థితుల్లో… సామాజిక వర్గాల్ని సమన్వయపరిచి, పార్టీని నడిపించడం మరో సవాల్! బిజెపినే అంటిపెట్టుకున్న పాత నాయకులకు – బయట్నించి వచ్చి పార్టీకి దన్నుగా ఉంటున్న ఇతర నాయకుల మధ్య సఖ్యత కూర్చడం కూడా సవాలే! వాటిని ఆయన ఎలా ఎదుర్కొంటారు? అధ్యక్ష స్థానం ఆశించి భంగపోయిన వారి సహకారమెంత? ఆయన్ని అడ్డుపెట్టుకొని ‘రిమోట్ కంట్రోల్’ తో వ్యవహారం నడుపాలనుకుంటున్న వారికి ఏ మేర లొంగుతారు? ఇవన్నీ ఇపుడు ఆసక్తి రేకెత్తించే అంశాలే!
చాన్నాళ్ల నిరీక్షణ తర్వాత బిజెపి రాష్ట్రాధ్యక్షుడి ఎన్నిక జరిగింది. విద్యార్థి దశ నుంచి బిజెపి అనుబంధ విభాగాల్లో పనిచేస్తూ సుదీర్ఘ అనుభవం గడించిన మాజీ ఎంఎల్‌సి ఎన్. రాంచందర్ రావు తాజాగా అధ్యక్షుడయ్యారు. ఆయనది దూసుకుపోయే స్వభావం కాదని, మెతక అని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన తరుణంలో ఇది సరైన నిర్ణయం కాదని పార్టీలో కొందరు అభిప్రాయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సామాజిక సమీకరణాల్ని, రాజకీయ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడంలో బిజెపి కేంద్ర నాయకత్వం ఎప్పుడూ విఫలమవుతోందనేది వారి భావన. మాజీమంత్రి ఈటల రాజేందంర్ కో, కేంద్ర మంత్రి బండి సంజయ్ కో, మహిళా నాయకురాలు డి.కె. అరుణ కో పార్టీ పగ్గాలు ఇచ్చి ఒక ప్రయోగం చేసి ఉండాల్సిందని పార్టీలోని ఒక వర్గం భావిస్తోంది. ఈ వరుసలో ఇతర ఎంపిలు అర్వింద్ (నిజామాబాద్), రఘునందన్ రావు (మెదక్) పేర్లు కూడా వినిపించాయి. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ బలహీనపడి ఉన్న పరిస్థితుల్లో సదరు రాజకీయ శూన్యతలోకి బిజెపి విస్తరించేందుకున్న అవకాశాల్ని పదునుగా వాడుకోవాల్సిందనే వారి వాదన ఇది. వేర్వేరు కారణాల వల్ల ఇతరులెవరినీ ఎంపిక చేయని ఢిల్లీ అధిష్ఠానం చివరకు రాంచందర్ రావు వైపు మొగ్గింది.
బోధపడని పార్టీ వ్యూహం
రాష్ట్రాల్లో పార్టీని నడిపే నాయకత్వం విషయంలో యుద్ధ సమయం, శాంతి సమయం అని రెండు పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకోవడం బిజెపి పెద్దలకు అలవాటు. మరి, తెలంగాణలో ప్రస్తుత సమయాన్ని వారేమైనా ‘శాంతి సమయం’గా పరిగణించారా? యుద్ధ సమయానికి ఇంకో అధ్యక్షుడెవరైనా వస్తారా? ఇటువంటి సందేహాలు కూడా పార్టీ శ్రేణుల్లో ఉన్నాయి. దూకుడు స్వభావం ఉన్నవారికి పగ్గాలిస్తే, రేపు ఎన్నికలప్పుడు బిఆర్‌ఎస్ వంటి కాంగ్రెసేతర ప్రాంతీయశక్తితో చేతులు కలపాల్సిన పరిస్థితే వస్తే ఇబ్బందనే ముందుచూపుతోనే అధినాయకత్వం ఇలా వ్యవహరించిందా?ఇవన్నీ ప్రశ్నలే ప్రస్తుతానికి. యోగ్యత, ఖర్చు భరించడం, విజయావకాశాలు వంటివి పరిశీలించి టిక్కెట్లివ్వడం, పార్టీ అధికారంలోకి వస్తే పదవులివ్వటం తప్ప సంస్థాగత హోదాలు, నాయకత్వ పగ్గాలు బయటి నుంచి వచ్చిన వారికి ఇవ్వకపోవడమే మంచిదని బలంగా భావించే వర్గమొకటి బిజెపిలో ఉంది. అధినాయకత్వం అలానే భావించి తాజా నిర్ణయం తీసుకొని ఉంటుందని వారు అన్వయించి చెబుతున్నారు.ఇది నిజానికి పార్టీ పాతతరం నాయకుల వాదన. ఒక దశలో ఈటల రాజేందర్ పై అధినాయకత్వానికి గురి కుదిరినా అధ్యక్షపీఠం ఇవ్వకపోవడం ఇలాంటి ఊహలకు ఆస్కారమిస్తోంది. పార్టీలో ‘చేరికల కమిటీ’ ఏర్పరచి, ఆ బాధ్యత అప్పగించినా ఈటల వల్ల పార్టీకి పెద్దగా ఉపయోగమేమీ జరుగలేదనే భావన అధిష్ఠానానికి ఉందంటున్నారు. గజ్వేల్లోనే కాకుండా హుజూరాబాద్‌లోనూ ఓడిపోవడం, బిజెపి సంస్థాగత నిబంధనావళిలోని షరతులు ప్రతికూలంగా ఉండటం ఆయనకు కలిసిరాని అంశాలు. ‘ఏమైతేనేం మంచి నిర్ణయమే జరిగింది, పార్టీలోనే పుట్టి-పెరిగి, పార్టీకోసం అవిశ్రాంతంగా పనిచేసే వారికి నాయకత్వ పగ్గాలు ఇవ్వటమే సరైంది’ అని వాదించే వారున్నారు.
ఎం -త్రీ ని ఎలా ఏకం చేస్తారో?
తమను గెలిపిస్తే బిసి వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని పార్టీ నాయకత్వం పోయినసారి ఎన్నికల ముందే ప్రకటించింది. ఆ రాజకీయ అగ్గి పార్టీలో క్రమంగా రాజుకుంది. అది అప్పటి ఎన్నికల్లో పెద్ద ప్రభావం చూపకపోయినా, రానురాను బిజెపి బిసి వర్గాల్లో ఆకాంక్షలు, అంచనాలు పెరగటానికి కారణమయింది. ‘నిజంగానే బిసి ని ముఖ్యమంత్రిని చేస్తే మా అవకాశాలెంత?’ అనే లెక్కలు పార్టీ సీనియర్లలో అప్పట్లోనే మొదలయ్యాయి. పార్టీ బిసిల్లో మున్నూరుకాపు, ముదిరాజ్ సామాజికవర్గాల నాయకుల్లో, ముఖ్యంగా యువతలో దూకుడు పెరిగింది. అదే క్రమంలో ఆయా వర్గాలకే చెందిన ముఖ్య నేతలు కేంద్రమంత్రి బండి సంజయ్, అర్వింద్ లతోపాటు బిఆర్‌ఎస్ నుంచి బిజెపిలోకి మారిన ఈటల రాజేందర్ లలో క్రియాశీలత పెరిగినట్టు పార్టీలో కొందరు విశ్లేషిస్తారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి అధ్యక్ష బాధ్యతలు, బ్రాహ్మణ సామాజిక వర్గానికి మారటాన్ని ‘బిసి’లకు జరిగిన మోసంగా కొందరు ప్రచారం ప్రారంభించారు.
పార్టీ అధ్యక్షుడే సిఎం కావాలని ఏముంది? పార్టీకి రేపు ప్రజలు పట్టం కట్టి, ప్రభుత్వం ఏర్పరిచే పరిస్థితే వస్తే, అధ్యక్షుడు ఒసి ఉండి, ముఖ్యమంత్రి బిసి ఉండకూడదని ఎక్కడుంది? అని ప్రశ్నించే వారూ ఉన్నారు, రాష్ట్రాధ్యక్షుడిగా రాంచందర్ ఎన్నికవడానికి చాలా ముందుగానే ‘ఎం- త్రీ’ ఫార్ములాను పార్టీ నాయకత్వం ముందుకు తెచ్చింది. సామాజిక సమీకరణాల్లో భాగంగా ‘మున్నూరు కాపు, ముదిరాజ్, మాదిగ’ వర్గాలను మచ్చిక చేసుకొని, పార్టీ ఒడిలోకి తెచ్చుకుంటే, వారు బహుళ సంఖ్యాకులైనందున బలపడతామనేది వ్యూహకర్తల ఆలోచన. ఎంఆర్‌పిఎస్ నేత మందకృష్ణ మాదిగను పక్కన కూర్చోబెట్టుకొని, పార్టీ అగ్రనేత అయిన దేశ ప్రధాని మోడీ స్వయంగా ఎస్‌సి వర్గీకరణకు నిర్దిష్టంగా హామీ ఇవ్వటం, తదనంతర పరిణామాల్లో సుప్రీంకోర్టు సానుకూల తీర్పు, కేంద్ర విధానం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం తెచ్చి వర్గీకరణ చేయడం… వంటివి చకచకా జరిగిపోయాయి. మందకృష్ణకు ‘పద్మశ్రీ’ పురస్కారమూ లభించింది. ఇప్పుడీ వివిధ సామాజిక వర్గాలను సమన్వయం చేసి, పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చాల్సిన బాధ్యత కొత్త అధ్యక్షుడి భుజాల మీదుంది.
స్వతంత్రంగా వ్యవహరిస్తారా?
పార్టీని దూకుడుగా నడిపి, వీలయినంత తొందరగా బిజెపి ని అధికారంలోకి తేవాలని, పదవులు హోదాలు అనుభవించాలని కలలుకంటున్న వారి ఆశలపై తాజా ఎన్నిక ప్రక్రియ నీళ్లుచల్లినట్టయింది. ఇది వారికి మింగుడు పడటం లేదు. ఈ ఎంపిక/ ఎన్నికతో పార్టీ మెత్తబడి, ఎదుగుదల క్షీణిస్తుందనేది వారి అభిప్రాయం. వారి అభీష్టం మేరకే ఈ ప్రక్రియను ఇలా నడిపించిన ఢిల్లీ అధిష్ఠానం మనసెరగని ఎంఎల్‌ఎ రాజాసింగ్ వంటి వారు పార్టీకి రాజీనామాకు తలపడ్డా, అది అంతగా ప్రభావం చూపే అంశంగా కనబడదు. మొదట్నించీ పార్టీలోనే ఉండి, పార్టీలోనే ఎదిగి, ప్రస్తుతం ఉన్నత స్థానాలకు ఎగబాకిన కొందరు నాయకులకు ఈ ప్రక్రియపట్ల కోపం లేదు. పైగా, కొత్త అధ్యక్షుడిని అడ్డుపెట్టుకొని ‘రిమోట్ కంట్రోల్’ ప్రక్రియ ద్వారా పార్టీని, కీలక వ్యవహారాలను నడిపించుకోవచ్చని కొందరు నాయకులు తలపోస్తున్నారు.
అందులోనూ పార్టీలోని తమ ప్రత్యర్థులపై ప్రతాపం చూపడానికి దీన్నొక వేదికగా వాడుకోవాలన్నదీ వారి ఆలోచన! ఆ పరిస్థితిని కొత్త అధ్యక్షుడు ఎంత వరకు అనుమతిస్తారు? ఆ అవకాశం ఇవ్వకుండా, తానే స్వతంత్రంగా వ్యవహరించాలనుకుంటున్నారా? నాలుగు రోజుల నడత, నడకను బట్టి తేటతెల్లమవుతుంది. ఇతరుల ‘రిమోట్’గా మారితే మళ్లీ గ్రూప్‌ల ఆధిపత్య పోరాటాలు, ఐక్యతకు భంగం తప్పకపోవచ్చు. అప్పుడు పార్టీని ఏకతాటిపై నడపడం, ఎన్నికల్లో సత్ఫలితాలు సాధించడం కష్టమవుతుంది. రాష్ట్రాధ్యక్షుడు స్వేచ్ఛగా, స్వతంత్రంగా పనిచేసుకునే వెసులుబాటుకు పార్టీ కేంద్ర నాయకత్వం చొరవ తీసుకోవాలి. ఇద్దరు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు తోడు సీనియర్ నాయకుడు డా. లక్ష్మణ్ పార్లమెంటరీ బోర్డు, బిసి మోర్చా అధ్యక్షత వంటి ఉన్నత పదవుల్లో ఉన్నారు. సీనియర్ నాయకురాలు డి.కె. అరుణ అఖిల భారత ఉపాధ్యక్షురాలు. పొంగులేటి సుధాకర్ రెడ్డి రెండు రాష్ట్రాల ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు. ఈటల రాజేందర్, డి. అర్వింద్ లకు కూడా కేంద్ర స్థాయి పార్టీ పదవి, హోదా ఏదైనా ఇవ్వడం ద్వారా వారిని అనునయించవచ్చు.
అటు అధిష్ఠానం విశ్వాసాన్ని, ఇటు పార్టీ శ్రేణుల మద్దతు పొందడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక ఎన్నికల్లో పార్టీని సమర్థంగా నడిపించడం సవాలే కాకుండా కొత్త అధ్యక్షుడికి ఒక అవకాశం. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో, హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో బిజెపి సాధించిన సానుకూల ఫలితాలకు స్థానికాంశాలే కారణమయినా…. గెలుపు ఘనత నాటి అధ్యక్షుడు బండి సంజయ్ ఖాతాలోనే పడింది. రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టినందుకు, 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రతికూలతకు, 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల సానుకూలతకు…. రెంటికీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బాధ్యత వహించాల్సి వచ్చింది. పాత్ర ప్రమేయాలతో నిమిత్తం లేకుండా, వివిధ పరిణామాల్లో పార్టీ పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నాయి? అన్నదే కీలకమవుతుంది.
దిలీప్‌రెడ్డి
సమకాలీనం
(రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ)