హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం హెల్త్ టూరిజం హబ్‌గా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 66 దేశాల నుంచి వచ్చే రోగులకు వైద్య సేవలందించే స్థాయికి ఎఐజి చేరుకుందని ప్రశంసించారు. ఎఐజి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో సత్కారించాలని డిమాండ్ చేశారు. అ తెలంగాణ ముఖ్యమంత్రి తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. బుధవారం బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఎఐజి ఆస్పత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎఐజి ఆస్పత్రి సేవలు ఇంకా విస్తరించాలని, హెల్త్ టూరిజంలో ప్రభుత్వానికి నాగేశ్వర్ రెడ్డి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
దేశంలో తయారయ్యే బల్క్ డ్రగ్‌లో 35 శాతం హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతుందని రేవంత్ వెల్లడించారు. ఐడిపిఎల్ మాజీ ఉద్యోగుల కృషితోనే ఫార్మారంగం అభివృద్ధి చెందిందని ప్రశంసించారు. క్యాన్సర్ చికిత్సలో నోరి దత్తాత్రేయ సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని, క్యాన్సర్ వల్ల మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతుండడంతో వారి ఆరోగ్య వివరాలు నమోదు చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. సామాజిక బాధ్యతగా ఏడాదిలో ఒక్క నెల రోజులు ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్యులు పని చేయాలని కోరారు. జనని మిత్ర యాప్ పేద రోగులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నిమ్స్‌లో అదనపు బ్లాక్, ఎల్‌బి నగర్, సనత్‌నగర్‌లో ఆస్పత్రులు నిర్మిస్తున్నాని సిఎం తెలియజేశారు. మిస్ వరల్డ్ వనితలను ఎఐజి ఆస్పత్రి సందర్శించాలని తాను సూచించానని పేర్కొన్నారు.