హైదరాబాద్: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు (Sigachi Blast) సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రమాదం గురించి సిగాచి కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ పలు విషయాలను వెల్లడించారు. ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందారని, 33 మందికి గాయాలైనట్టు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారంతో పాటు అన్ని రకాల బీమా క్లెయిమ్‌లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
ఈ ప్రమాదంలో (Sigachi Blast) గాయపడ్డ వారికి పూర్తి వైద్యసాయం అందిస్తామని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని వివేక్‌కుమార్ స్పష్టం చేశారు. ఇక పరిశ్రమ ప్రమాదంపై స్టాక్‌మార్కెట్‌కు సిగాచి లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు. 3 నెలల పాటు కంపెనీ కార్యకలాపాలు మూసివేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని.. ప్రమాదంపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ దర్యాప్తు నివేదిక కోసం వేచి చూస్తున్నామని వివేక్‌కుమార్ అన్నారు.