న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) బిగ్ షాకిచ్చింది. కోర్టు ధిక్కార కేసులో షేక్ హసీనాకు బుధవారం ఐసిటి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఢాకా ట్రిబ్యూన్ నివేదికల ప్రకారం, చైర్మన్ జస్టిస్ ఎండీ గోలం మోర్టుజా మోజుందర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. దాదాపు ఏడాది క్రితం బంగ్లాదేశ్ నుండి పారిపోయి ఇండియాలో తలదాచుకుంటున్న హసీనాను దోషిగా నిర్ధారించింది. హసీనాతో పాటు, గైబంధలోని గోబిందగంజ్‌కు చెందిన షకీల్ అకాండ్ బుల్బుల్‌కు కూడా ఇదే కేసులో రెండు నెలల జైలు శిక్ష విధించబడింది.
2024 జూన్, జూలై, ఆగస్టులో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలపై క్రూరంగా అణచివేసిన ఘటనలో హసీనా పాత్ర ఉందని, ఆమెపై ఐసిటి మానవత్వానికి వ్యతిరేకంగా నేరాల అభియోగం మోపింది. చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజుల్ ఇస్లాం, అతని బృందం.. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన సామూహిక నిరసనలపై జరిగిన దాడి వెనుక హసీనా ప్రధాన ప్రేరేపకురాలిగా ఆరోపించారు. కాగా, గతేడాది జూలై 15, ఆగస్టు 15 మధ్య హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లరిమూకలు దాడులకు పాల్పడ్డారు. ప్రధాని హసీనా నివాసంపై కూడా నిరసనకారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులకు ముందే ఆమె ప్రత్యేక విమానంలో బంగ్లాదేశ్ నుంచి పారిపోయి ఇండియాకు వచ్చింది. ఆ సమయంలో బంగ్లాదేశ్ లో పెద్ద ఎత్తున హింసకాండ జరిగింది. అల్లరిమూకల దాడుల్లో దాదాపు 1400 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.