ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో జైలులో ఉన్న మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ మరోసారి రాజకీయ భావోద్వేగాలను రేకెత్తించారు. బానిసత్వాన్ని అంగీకరించడం కంటే చీకటి జైలు గదిలో జీవించడానికి ఇష్టపడతానని ఖాన్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని తన మద్దతుదారులకు జైలు నుంచే పిలపునిచ్చాడు. జూలై 6న ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ 7వ శతాబ్దపు బలిదానాన్ని స్మరించుకునేందుకు మొహర్రంలో 10వ రోజు సంతాప దినం అయిన అషురా తర్వాత దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి నిరసనలు ప్రారంభించాలని ఖాన్ కోరారు.
ఈ మేరకు బుధవారం సోషల్ మీడియా ద్వారా తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ.. షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత సర్కార్.. ప్రజాస్వామ్య స్వేచ్ఛలను అడ్డుకుంటుందని, రాజకీయ అసమ్మతిని అణచివేస్తుందని ఆయన ఆరోపించారు. “మొత్తం దేశానికి, ముఖ్యంగా పిటిఐ కార్మికులకు, మద్దతుదారులకు, అషురా తర్వాత ఈ నిరంకుశ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలని నేను వారిని కోరుతున్నాను. ఈ బానిసత్వాన్ని అంగీకరించడం కంటే చీకటి జైలు గదిలో నివసించడమే నాకు ఇష్టం” అని ఖాన్ పేర్కొన్నాడు. దాదాపు రెండు సంవత్సరాలుగా పలు కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉంటున్నాడు.