హైదరాబాద్: శ్రీ గంధం చెక్కలను (Indian Sandalwood) అక్రమ రవాణా చేస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్‌వొటి, చేవెళ్ల పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని బస్తేపూర్‌లో సోదాలు నిర్వహించిన పోలీసులు వెయ్యి కిలోల శ్రీగంధం చెక్కలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. చెక్కలను తరలిస్తున్న డిసిఎంను సీజ్ చేశారు.
మహారాష్ట్ర నుంచి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగర్‌గూడలోని ఓ పర్‌ఫ్యూమ్ ఫ్యాక్టరీకి ఈ చెక్కలను (Indian Sandalwood) తరలిస్తున్నారు. ‘పుష్ప’ సినిమా తరహాలో డిసిఎంలో చెక్కలను దాచారు. వీటి విలువ రూ.30 లక్షలు ఉంటుందని చేవెళ్ల ఎసిపి కిషన్ తెలిపారు. డిసిఎం డ్రైవర్ అబ్దుల్ అజీజ్, సూపర్‌వైజర్ సోహెబ్, రైతు విజయ్ హనుమంతును పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్యాక్టరీ యజమాని అబ్దుల్ కుర్వి, మేనేజర్ సిద్ధిఖ్ పరారీలో ఉన్నారు. పట్టుకున్న ముగ్గురిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు.. పరారీలో ఉన్నా వాళ్ల కోసం గాలిస్తున్నారు.