గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ద్రోణీ కారణంగా హైదరాబాద్‌లో మరో మూడు రోజుల పాటు చిరు జల్లులు నుండి ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ( ఐఎండీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నగరంలో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం రోజంతా వర్షం కురుస్తూనే ఉన్నది. గ్రేటర్‌లో నిత్యం రద్దీగా ఉండే పలు ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మంగళవారం సాయంత్రం నుంచి అర్థరాత్రి పన్నెండు గంటల వరకు గరిష్టంగా జూబ్లీహిల్స్‌లో 4 సెం.మీ.ల వర్షపాతం నమోదు కాగా, మెహిదీపట్నం,
లంగర్ హౌజ్ ప్రాంతాల్లో రెండు సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గత మంగళవారం అర్థరాత్రి నుంచి సికిందరాబాద్ మారెడ్ పల్లిలో 0.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రేపు (గురువారం) సాయంత్రం భారీవర్షం కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రతిరోజుల లక్షలాది వాహానాలు రాకపోకలు సాగించే లక్డీకాపూల్ మెయిన్ రోడ్డులో ఉ.8గం.ల నుంచే ట్రాఫిక్ సమస్య తలెత్తింది. పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
బారులు తీరిన వాహనాలు..
ఖైరతాబాద్ జంక్షన్ నుంచి సోమాజీగూడ, పంజాగుట్ట, అమీర్ పేట వెళ్లాల్సిన వాహానాలు కిలోమీటర్ వరకు క్యూ కట్టాయి. ఉద్యోగాలకు వెళ్ళే వేళలో ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల బుధవారం ఉదయం కూడా వర్షపు నీరు రోడ్లపై నిలిచి ఉండటంతో వాహానాలు నెమ్మదిగా కదిలాయి. ఫలితంగా కార్యాలయాలకు వెళ్ళే ఉద్యోగులు, వ్యాపార సంస్థలకు వెళ్ళే వారు తమ గమ్యస్తానాలని చేరుకునేందుకు సుమారు గంటకుపైగా సమయం తీసుకోవడంతో కార్యాలయాలకు చాలా ఆలస్యంగా వెళ్ళినట్టు పలువురు వెల్లడిస్తున్నారు. అయితే, కేవలం హెల్మెట్ లేనివారి, రోడ్డు నియమాలను అతిక్రమిస్తున్న వాహనదారులను ఫోటో తీసే ట్రాఫిక్ పోలీసులు ఆఫీసు టైమ్‌లో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారినా, ఎక్కడా కూడా పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే విధులు నిర్వర్తించాల్సిన దాఖలాలేవనేది వాహనదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రోడ్లలోని వాటర్ లాగింగ్ పాయింట్లలో నీరు నిలిచి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తుంది.
ఇబ్బందుల్లో వీధి వ్యాపారులు..
రోడ్లపైన ఉండి చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారు ఈ వర్షంతో ఇబ్బందులకు గురయ్యారు. ఓవైపు రోడ్లపై ట్రాఫిక్ జామ్ కావడంతో పాదచారులు ఫుట్‌పాత్‌పైనే నడుస్తూ ఉండటంతో వీధి వ్యాపారులు తమతమ దుకాణాలను ఏర్పాటు చేసుకోవడం కష్టంగా మారింది. దీంతో దుకాణాలు ఏర్పాటు చేసుకుంటే వర్షం ఓవైపు.. పాదచారులు, ట్రాఫిక్ సమస్య మరోవైపు ఉండటంతో చిరు వ్యాపారులు తమతమ దుకాణాలను తెరువకుండానే వెనుదిరుగుతూ.. కొంత కలవరానికి లోనయ్యారు.