ప్రజలు, రాష్ట్ర హక్కులు, రాష్ట్ర ప్రయోజనాలే కేంద్రంగా బిఆర్‌ఎస్ పార్టీ పనిచేస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలే కేంద్రంగా పనిచేస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు విమర్శించారు . కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ లో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హైదరాబాద్ లో ఇచ్చినట్లు లేదని, అమరావతిలో ఇచ్చినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఆ ప్రజంటేషన్ ను చూసినవారికి ఏపీ తయారు చేసిందన్న అనుమానం కలుగక మానదన్నారు. బనకచర్లను ఏపీ సీఎం ఏ రకంగా ముందుకు తీసుకువెళ్తున్నారో, ఎలాంటి వ్యాఖ్యలు చేశారో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో చూపించలేదని ఆరోపించారు. బనకచర్ల కట్టే చంద్రబాబు రేవంత్ కు దేవుడిగా కనిపిస్తున్నారని, బనకచర్లను ఆపాలని ప్రయత్నిస్తున్న బీఆర్‌ఎస్ చచ్చిన పాములా కనిపిస్తుందన్నారు.
బీఆర్‌ఎస్ చచ్చిన పాములా కనిపిస్తే ఎందుకు నిద్రలో కూడా కలవరిస్తున్నారని ప్రశ్నించారు. పదకొండేళ్లుగా కేంద్రంలో అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ చచ్చినపాము అయిందా? అని నిలదీశారు. బాబు కోసం, బనకచర్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి బ్యాగ్‌మ్యాన్ గా మారిపోయారన్నారు. టెక్నికల్ గా ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా ఆయన మనసంతా అక్కడే ఉందన్న విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందన్నారు. 2024లో ప్రజా భవన్ వేదికగా రేవంత్ రెడ్డి, బెజవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరి బనకచర్లకు పచ్చజెండా ఊపారని ఆరోపించారు. 2024 నవంబర్ 15న సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు బనకచర్ల ప్రాజెక్టుకు నిధులు కావాలని లేఖ రాశారన్నారు. ఆ తర్వాత డిసెంబర్ లోనూ నిధుల కోసం లేఖ రాశారని చెప్పారు. ఇలా బనకచర్లపై రాసిన లేఖలన్నీ బయటికి వచ్చాయని, అన్నీ తెలిసి రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారన్నారు. ఈ విషయాన్ని ఈ ఏడాది జనవరి 24న తానే ప్రెస్ మీట్ లో వెల్లడించానని, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందు రోజు తేదీతో కేంద్రానికి లేఖ రాశారని దుయ్యబట్టారు.
నేడు టీఓఆర్ తాత్కాలికంగా ఆగిందన్నా అది బిఆర్‌ఎస్ పోరాట ఫలితమేనన్నారు. అపెక్స్ కమిటీ మీటింగ్ లో ఎక్కడా బనకచర్ల టాపిక్ రాలేదన్నారు. సముద్రంలో 3 వేల టీఎంసీలు కలుస్తున్నాయని, రెండు రాష్ట్రాలకు నీటి ఇబ్బంది ఉందని, ఇరు రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకుందామని మాత్రమే చెప్పారని, ఇందులో బనకచర్ల ముచ్చటే లేదని తెలిపారు. ఏపీకి నీళ్లు రాసినట్లు కూడా ఆ మీటింగ్ లో ఎక్కడా లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి బేసిన్ల గురించి ఏమీ తెలీదని, అహంకారంతో మాట్లాడితే అధఃపాతాళానికి తొక్కుతారన్నారు. 2016లో బనకచర్లను బీఆర్‌ఎసే రాసిచ్చిందని రేవంత్ ఆరోపిస్తున్న దానిలో నిజం లేదని, ఆనాడు నదీ జలాలను ఎలా వాడుకోవాలన్న దానిపైనే చర్చలు జరిగాయే తప్ప, ప్రాజెక్టు ప్రస్తావనే రాలేదన్నారు. తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్ రేవంత్ రెడ్డి అయితే దానికి విరుగుడు బిఆర్‌ఎస్ అని పేర్కొన్నారు.