త్వరలో అందుబాటులోకి 25 ప్రభుత్వ
ఆసుపత్రులు ప్రైవేట్ వైద్యులు ఏడాదిలో
నెలరోజులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని
చేయాలి విదేశాల్లో ఉండే వైద్యులు
తెలంగాణకు వచ్చినప్పుడు నిమ్స్‌లాంటి
ఆసుపత్రుల్లో సేవలు అందించాలి అందుకు
అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలి
బంజారాహిల్స్‌లో ఎఐజి ఆసుపత్రి
ప్రారంభోత్సవంలో సిఎం రేవంత్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : విద్య, వైద్యానికే తమ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్య ఇ స్తోందని, ఆసుపత్రులపై పేదలకున్న అభిప్రాయం మారేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. సామాజిక బాధ్యతగా ఏడాదిలో ఒక్క నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేయాలని రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు డాక్టర్లకు సిఎం పిలుపునిచ్చారు. మీకు ఇష్టం వచ్చిన ప్రభుత్వ ఆ సుపత్రిని ఎంచుకొని నెలరోజుల పాటు పని చేయాలని నిమ్స్, ఉస్మానియాలో పని చేస్తే చాలా అనుభవం వస్తుందని సిఎం రేవంత్ సూచించారు. విదేశాల్లో ఉండే వైద్యులు అ ప్పుడప్పుడు హైదరాబాద్ వస్తున్నారని, వా రు నిమ్స్ లాంటి ఆసుపత్రుల్లో సేవ చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రైవేట్‌కు ధీటుగా ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నామని, త్వరలో 25 ఆస్పత్రులు అందుబాటులోకి వస్తాయని సిఎం తెలిపారు.
నిమ్స్‌లో అదనపు బ్లాక్, ఎల్‌బినగర్, సనత్‌నగర్‌లో ఆసుపత్రులు నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారాహిల్స్‌లో ఏఐజీ ఆసుపత్రిని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ రాబోయే వందేళ్లలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలన్న దానిపై ‘తెలంగాణ రైజింగ్ -2024’ అనే విజన్ డాక్యుమెంట్ ను తయారు చేస్తోందని, ఇందులో హెల్త్ టూరిజంకు ప్రాధాన్యత ఉండబోతుందని సిఎం రేవంత్ చెప్పారు. వైద్య రంగం అభివృద్ధికి రూ.11,500 కోట్లు, రూ.21,500 కోట్లు విద్యా రంగం అభివృద్ధికి కేటాయించామని సిఎం రేవంత్ చెప్పారు.
హెల్త్ టూరిజంపై ఫోకస్
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం, ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా ఉండేలా హెల్త్ డిపార్ట్‌మెంట్ ను, హెల్త్ టూరిజంను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సిఎం చెప్పారు. అందులో భాగంగానే క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడును తెలంగాణ స్టేట్ క్యాన్సర్ అడ్వైయిజర్‌గా నియమించుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. మహిళలే ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారని అందువల్ల వ్యాధి బారిన పడిన తర్వాత ఖర్చు చేసే కంటే వ్యాధి బారిన పడకముందే తీసుకోవాల్సిన చర్యలపై రీసెర్చ్ అవసరం ఉందన్నారు. ప్రస్తుత రోజుల్లో వైద్య ఖర్చులు భారంగా మారాయని అందుకే తాము అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చులను రూ. 10 లక్షలకు పెంచామన్నారు. ఈ 18 నెలల కాలంలో సిఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.1,400 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన చెప్పారు.
మహిళా సంఘాల సభ్యులకు హెల్త్ ప్రొఫైల్స్
రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంలో తాము ఉన్నామని సిఎం చెప్పారు. వారికి వ్యక్తిగతంగా యూనిక్ ఐడీతో గుర్తింపు కార్డు ఇచ్చి వారి హెల్త్ ప్రొఫైల్ కార్డు రూపొందిస్తున్నామని ఈ కార్డులో వారి కుటుంబ సభ్యులందరి హెల్త్ ప్రొఫైల్ నిక్షిప్తం చేస్తామని సిఎం చెప్పారు. గతంలో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ ఉండేదని, అది పోయి స్పెషలిస్టు వ్యవస్థ వచ్చిందని, దీంతో రోగులకు వైద్యులకు మధ్య కేవలం లావాదేవీల వ్యవస్థగా మారిందని సిఎం రేవంత్ పేర్కొన్నారు. దీనిని బ్రేక్ చేయాలని, హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. సిఐఐ గణాంకాల ప్రకారం సంవత్సరంలో 2 లక్షల 20 వేల మంది విదేశాల నుంచి రోగులు వచ్చి హైదరాబాద్ లో వైద్యం చేయించుకుంటున్నారని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఇంకా రావాలని రోగులు ఆసక్తి చూపుతున్నా హైదరాబాద్‌కు నేరుగా ఫ్లైట్ కనెక్టివిటి లేకపోవడం ఇబ్బందిగా మారిందన్నారు. ఈ పరిస్థితిపై కేంద్రంతో తాను మాట్లాడి భవిష్యత్‌లో కనెక్టివిటీ పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. జనని మిత్ర యాప్ పేద రోగులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. మిస్ వరల్డ్ పోటీల ద్వారా మన నగరం గొప్పతనం చాటిచెప్పామని సిఎం రేవంత్ పేర్కొన్నారు.
డా.నాగేశ్వర్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలి
ప్రజలకు రెండో అతిపెద్ద ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చినందుకు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని అభినందించారు. తెలంగాణ, హైదరాబాద్‌కు నాగేశ్వర్ రెడ్డి గొప్ప పేరు తీసుకొచ్చారని, ఆయన సేవలను గుర్తించి కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ ఇచ్చిందని నాగేశ్వర్ రెడ్డి భారతరత్నకు అర్హుడని ఆయన అన్నారు. ఆయనకు భారతరత్న వచ్చేలా తెలంగాణ నుంచి తన వంతు ప్రయత్నం చేస్తానని సిఎం రేవంత్ తెలిపారు. 66 దేశాల నుంచి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్సకు రావడం మనకు గర్వకారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు