మన తెలంగాణ/నల్లగొండ రూరల్: ఈ నెల 14న సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెల్ల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రా రంభించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండల కేం ద్రంలో ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. నల్లగొండ కలెక్టరేట్ ప్రాంగణంలో బుధవారం జరిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడు తూ..అర్హులైన లబ్ధిదారుల ధరఖాస్తులన్నింటినీ ఈ నెల 13 వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అర్హులందరికీ తెల్లరేషన్ కార్డుల మంజూరు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తోందని అన్నారు. ఎటువంటి వివక్ష లేకుండా అర్హులైన పేదలకు తెల్లరేషన్ కార్డుల మంజూరు ఉంటుందని భరోసా ఇచ్చారు. 2014లో తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి 89.73 లక్షల తెల్లరేషన్ కార్డులు ఉండగా పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో కేవలం 49 వేల తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేశారని అదీ కూడా ఉప ఎన్నికలు వచ్చినప్పుడు లబ్ధి పొందేందుకు మాత్రమే చేశారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం లక్షలాది మంది అర్హులైన నిరుపేదలకు కొత్త తెల్లరేషన్ కార్డులు మంజూరు చేయలేక పోయిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి వేసిన చారిత్రకపు అడుగు తెల్ల రేషన్ కార్డుల మంజూరు అని అభివర్ణించారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. రాష్ట్ర జనాభాలో 3.10 కోట్ల మందికి అంటే 84 శాతానికి సన్న బియ్యం చేరుతున్నాయని అన్నారు.సాలీనా సన్నబియ్యంపై తమ ప్రభుత్వం రూ.13 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. భూసేకరణ అంశంలో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలని హితవు పలికారు. ఎస్‌ఎల్‌బిసి పనులను పునః ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపిలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్, శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జైదీర్ రెడ్డి, బాలు నాయక్, వేముల వీరేశం, శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం, ఆయా జిల్లా కలెక్టర్లు ఇలా త్రిపాఠి, నందలాల్ తేజస్ పవర్, మంత్రిప్రగడ హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.