మనతెలంగాణ/నాంపల్లి : మండలంలోని స్వాములవారి లింగోటం గ్రామ పంచాయితీలో ఇండ్లు లేని నిరుపేదలకు మంజూరైన ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు ఆ గ్రామ తాజా మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు నేతృత్వంలో ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు ముగ్గులు పోసి, పసుపు కుంకుమలు, కొబ్బరికాయలతో లబ్ధిదారులతో కలసి గ్రామస్థులు భూమి పూజ నిర్వహించారు. బుధవారం జరిగిన భూమి పూజ కార్యక్రమం సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించడానికి ప్రయత్నించినప్పటికీ స్వాములవారి లింగోటం గ్రామానికి 22 మందికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని, అర్హులైన వారి జాబితా తయారు చేసి పంపించాలని కోరడం జరిగిందని, ఇళ్లు మంజూరు కాని వారు ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దని, ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని ఎమ్మెల్యే చెప్పినట్లు గ్రామస్థులకు తెలిపారు.
గత పది సంవత్సరాల కాలంలో అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం నియోజకవర్గంలో ఏ ఒక్కరికి పక్కా గృహ నిర్మాణం చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మునుగోడు నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ పక్కా గృహాలు మంజూరు అయ్యాయని, అధికారులందరికి పట్టా సర్టిఫికేట్లు జారీ చేయడం జరిగిందని, స్థానిక సంస్థల ఎన్నికల ముందే ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని, ప్రతి సోమవార లబ్ధిదారులకు బిల్లుఉ చెల్లిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఇందిరమ్మ గృహ లబ్ధిదారులతో పాటు గ్రామ పెద్దలు, పంచాయితీ కార్యదర్శి వినయ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలిచి పక్కా గృహాలు మంజూరు చేసిందని, అన్ని పార్టీల వారికి ఇందిరమ్మ గృహాలు మంజూరు అయ్యాయని, మంజూరు చేయించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, మండల కాంగ్రెస్ పార్టీ నేతలకు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇందిరమ్మ గృహ లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.