సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు…
వినాయక చవితి, దసరా, దీపావళి పండుగ సమయాల్లో రానున్న ఓట్ల పండుగ..?
పండగ సమయాల్లో ఎన్నికలంటే పోటీదారుల్లో ఆందోళన
అన్నీ కలిసి వస్తే మరో మూడు నెలల్లో స్థానిక ఎన్నికలు
కాంగ్రెస్ పార్టీకి కత్తిమీద సాములాగా మారనున్న ఎన్నికలు
మనతెలంగాణ/కోదాడ రూరల్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఓటర్లకు డబుల్ ధమాకా కలిగేలా చేయనున్నాయి. సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో మళ్లీ గ్రామీణ ప్రాంతాలు ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. రానున్న దసరా, దీపావళి పండుగల సమయంలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది. దీనితో ఓటర్లకు వినాయక చవితి, దసరా, దీపావళి పండుగల ఖర్చులన్నీ ఎన్నికల్లో ఓట్ల రూపంలో రాబట్టుకునే అవకాశం ఏర్పడనున్నది. ఈ పరిస్థితులు ఎన్నికలు ఖర్చులు భరించలేని అభ్యర్ధులకు ప్రాణ సంకటంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు కత్తిమీద సాములాగా మారనున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో మెజార్టీ స్థానిక సంస్థలలో గెలువాల్సిన అవసరం ఏర్పడింది. కాంగ్రెస్ రాష్ట్ర ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లు కాంగ్రెస్ నేతలు ఈ కార్యకర్తలకు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. గతంలో మెజార్టీ స్థానాలను అప్పటి బిఆర్‌ఎస్ పార్టీ గెలుచుకుని తమ పట్టును నిలుపుకున్నది.
ఎక్కువ స్థానాలు తమ ఖాతాలో వేసుకునేందుకు…..
ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం మార్పిడి జరిగినందున ఎక్కువ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్‌కు ఏర్పడింది. సమయానికి ఎన్నికలు నిర్వహించలేదని, మాజీ సర్పంచ్‌లను ఇంఛార్జ్‌లుగా పెట్టాలని కొందు బిసి సంఘాల నేతలు హైకోర్టులో కేసులు వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల పై హైకోర్టు ఇటు ప్రభుత్వాన్ని, అటు ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించడంతో ప్రభుత్వుం నెలరోజుల సమయాన్ని అడిగింది. రిజర్వేషన్లను కొలిక్కి తెస్తామని అభ్యర్ధించింది. ప్రభుత్వ నిర్ణయం తర్వాత ఎన్నికలు నిర్వహించడానికి రెండు నెలల సమయం పడుతుందని ఎన్నికల కమిషన్ హైకోర్టుకు వివరించింది. దీనితో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించడానికి మూడు నెలల సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు నెలల సమయంలోనే దసరా, దీపావళి పండుగలు వస్తున్నాయి. ఈ సమయాల్లో ఎన్నికలు జరపడం అంటే పోటీదారులు ఓటర్లకు పండుగల ఖర్చులు మొత్తం భరించాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయి. అందుకే ఓటర్లు దసరా, దీపావళి డబుల్ ధమాకాను అందుకోనున్నట్లుగా తెలుస్తుంది.
ముగ్గురు పిల్లల నిబంధన పై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం…
ఆశావాహులకు అడ్డంకిగా ముగ్గురు పిల్లల నిబంధన స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తులు రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆ నిబంధనను అలాగే అమలు చేస్తూ వచ్చారు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ప్రభుత్వం ముగ్గురు పిల్లల నిబంధనను ఎత్తివేశారు. ఎంత మంది పిల్లలు ఉన్నా పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. తెలంగాణలో మాత్రంలో ఆ నిబంధనలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో గ్రామాలలో ప్రజలకు సేవ చేస్తూ ఉన్న కొందరికి ఈ నిబంధన అడ్డంకిగా మారిందని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జనాభా నియంత్రణ కోసం అప్పట్లో ఈ నిబంధనలను, ప్రభుత్వాలు తీసుకువచ్చాయి. కానీ నేడు జనాభాను నియంత్రించాల్సిన అవసరం లేదని ప్రభుత్వాలే అభిప్రాయపడుతున్నాయి. అందుకే తెలంగాణలోనూ ఈ నిబంధనలను తొలగించాలని, అందరికీ పోటీ చేసే అవకాశాలు కల్పించాలని రాజకీయ పార్టీల నాయకులు ప్రజలు కోరుతున్నారు.