మన తెలంగాణ/కోహెడ: హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ, అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాలను తిరిగి కరీంనగర్ జిల్లాలో ఇంకెప్పుడు కలుపుతారని బిజెపి కౌన్సిల్ సభ్యుడు ఖమ్మం వెంకటేశం ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని పూసల సంక్షేమ భవన్‌లో బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జనగణన, కుల గణనతో పాటే, అసెంబ్లీ, పార్లమెంట్ నియోజవకర్గాల పునర్విభజన చేపట్టేంందుకు సిద్దమయ్యిందన్నారు. భౌగోళిక పునర్విభజన నేపథ్యంలో రాష్ట్రాలలోని జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు పంపించాలని కేంద్రం కోరినట్లు తెలిపారు. ఈ తరుణంలో కేంద్రానికి నివేదికలు పంపక ముందే హుస్నాబాద్ నియోజకవర్గంలోని మూడు మండలాలు కోహెడ, అక్కన్నపేట, హుస్నాబాద్‌లను కరీంనగర్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కరీంనగర్ జిల్లాలో కలుపుతానని హామీ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ నేటి వరకు మూడు మండలాలను కరీంనగర్ జిల్లాలో కలిపేందుకు చొరవ తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు.
మంత్రి పొన్నం తలచుకుంటే రాత్రికి రాత్రే కరీంనగర్ కలిపే జీవో వెలువడుతుందని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లాలో ఈ మూడు మండలాల ప్రజలు పడుతున్న బాధలు అన్ని ఇన్నీ కావని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు మండలాలలను కరీంనగర్ జిల్లాలో కలిపేవిధంగా మంత్రి పొన్నం చొరవ తీసుకోకుంటే, వారంలో రోజుల్లో బిజెపి ఆద్వర్యంలో ప్రజా సంఘాలను కలుపుకొని “కరీంనగర్” జిల్లా కోసం ఉద్యమం చేయనున్నట్లు హెచ్చరించారు. ఈ సమావేశంలో బిజెపి మండల అధ్యక్షుడు జాలిగం రమేష్, నాయకులు పిల్లి నర్సయ్య గౌడ్, మ్యాకల చంద్రశేఖర్ రెడ్డి, గుగ్గిళ్ల శ్రీనివాస్, బండ జగన్ యాదవ్, బొమ్మగాని శివకుమార్ గౌడ్, రామంచ రాంచంద్రారెడ్డి, పేర్యాల సాగర్‌రావు, ఎడమల రాజు రెడ్డి, చిగురు సంజీవ రెడ్డి, జాలిగం అనిల్, ఉల్లెంగుల సాయికిషోర్, ఎడ్ల వెంకటేష్, రవి తదితరులున్నారు.