పుస్తకాల బరువులు పెరుగుతున్నాయి. బట్టీచదువులతో జ్ఞానం విద్యార్థుల మస్తకాలను తాకడంలేదు. నేటి విద్యావ్యవస్థలో చోటుచేసుకుంటున్న హంగులు, ఆర్భాటాలు, ప్రచారాలు ‘విగ్రహం పుష్టి- నైవేద్యం నష్టి’ అనే సామెతను తలపిస్తున్నది. పిల్లల చదువులవలన తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోయశక్యం గాని విధంగా తయారైంది. చిన్న వయసు చదువుల పేరుతో నీరుగారిపోతున్నది. వ్యాపారంగా మారిన చదువుల వలన బాల్యం మొద్దుబారిపోతున్నది. నేటి చదువులు పుస్తకాలు మోయడానికి, బట్టీ పట్టి, ర్యాంకులు సాధించడానికే పరిమితం కావడం వలన ప్రతిభకు నిర్వచనం మారిపోయింది. ప్రపంచం విజ్ఞాన రంగంలో ఎంతో ముందుకు దూసుకుపోతున్నది. ఇతర గ్రహాలపై అన్వేషణ కొనసాగుతున్నది. భారతదేశం కూడా సూర్యచంద్రాదులపై పరిశోధనలు చేస్తున్నది.
అంతరిక్షంలోను, అణు, సాంకేతిక రంగాల్లోను దేశం ముందుకు దూసుకుపోతుంటే, ఇంకా మన విద్యా వ్యవస్థలో పరిశోధనాత్మకతకు, సాంకేతికతకు తావివ్వకుండా కంఠస్థంతో విద్యార్థులు కాలం నెట్టుకురావడం దేనికి సంకేతం? కృత్రిమ మేధస్సు ఉర్రూతలూగిస్తూ ఉరకలేస్తుంటే, సాంఘిక మాధ్యమాలు వీక్షకులకు ఊపిరి సలపనీయడం లేదు. అంతరిక్షంలో అద్భుతాలు జరుగుతున్నాయి. స్పేస్‌వాక్ చేసి అంతరిక్షయానంలో ఎదురైన ఆటంకాలను అవలీలగా జయించి విజేతగా భూమికి అడుగిడిన సునీతా విలియమ్స్ సాహసాన్ని చూశాం. అంతరిక్షంలోకి అడుగిడిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకు శుభాసీస్సులందించాం. విజ్ఞానం ఇంతగా వికసించి, గ్రహాంతరయానానికి దారులు వెదుకుతుంటే, ఇంకా మనం విద్యావ్యవస్థను మారుతున్న కాలానికి అనుగుణంగా (keeping times) మార్పులు చేసుకోలేక ఇబ్బందులుపడుతున్నాం. బట్టీ చదువులకు స్వస్తి చెప్పలేకపోతున్నాం.
ఇంకా మార్కులు, ర్యాంకులంటూ మూస పద్ధతిలోనే పయనిస్తున్నాం.బండెడు పుస్తకాలను విద్యార్థులకు అంటగట్టి, ఫీజుల పేరుతో మోయలేని ఆర్థిక భారాన్ని తల్లిదండ్రులనెత్తిన పెట్టడం భావ్యమా? మారుతున్న కాలానికి అనుగుణంగా చదువుల్లో గుణాత్మకమైన మార్పురావాలి. విద్యార్థుల భవిష్యత్తుకోసం ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించాలి.విద్యాబోధనలో సులభమైన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. వాటిని అందుకుని నాణ్యతా ప్రమాణాలగల విద్యను భావితరాలకు అందించాలి.విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య గల సంబంధం కేవలం తరగతి గదులకే పరిమితమయ్యే గురుశిష్యల సంబంధం మాత్రమే కారాదు. విజ్ఞానాన్ని ప్రపంచం నలుచెరగులా వ్యాపింప చేసి, అభివృద్ధికి ఆలంబనగా ఉండాలి. ఉపాధ్యాయులు నవప్రపంచ నిర్మాతలు. విద్యార్థులకు మార్గ నిర్దేశకులు. విశ్వానికి వెలుగురేఖలు ఉపాధ్యాయులు. అజ్ఞానమనే అంధకారంనుండి విజ్ఞానమనే వెలుగువైపు పయనింప చేసే శక్తి కేవలం ఉపాధ్యాయులకే సాధ్యం.
ప్రపంచ ప్రగతి సాధన ఉత్తమ విద్య ద్వారా మాత్రమే సాధ్యం. ఉత్తమ నాణ్యతా ప్రమాణాలను నెలకొల్పి, విద్యార్థుల్లో నైపుణ్యానికి ఉపాధ్యాయులు, విద్యావంతులు కృషి చేయాలి. కంఠస్థం చేయడం వలన కంఠశోష తప్ప ప్రయోజనం శూన్యం. దురదృష్టవశాత్తూ ఈనాటికీ ప్రపంచంలో చాలా మందికి విద్యావకాశాలు గగనకుసుమంలా మారాయి. కొన్నిదేశాల్లో స్త్రీలకు చదువుకునే స్వేచ్ఛ లేదు. మరికొన్ని దేశాల్లో కుటుంబాల ఆర్థిక స్తోమత సరిగా లేక, చదువుకునే అవకాశాలు మృగ్యమైపోతున్నాయి. బాలకార్మికులుగా, వీధిబాలల్లా మిగిలిపోతున్నారు. ఒకవైపు ఇలాంటి పరిస్థితులు తాండవిస్తుంటే మరొకవైపు నాణ్యత లేని విద్యవలన ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతున్నాయి. నైపుణ్యం లోపించిన చదువులవలన ప్రపంచ ప్రగతి సాధ్యం కాదు. ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకంఉపాధ్యాయులు అంకితభావంతో కృషిచేసి, విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలి. విద్య ప్రాధాన్యతను పెంచే విధంగా సంస్కరణలు రావాలి.
నిజమైన విద్యకోసం పాటుపడాలి. సాంకేతిక రంగాన్ని చెడిపోవడానికే వినియోగించుకునే ధోరణిలో మార్పురావాలి. వాస్తవ ప్రపంచానికి దూరంగా, రంగుల లోకంలో విహరిస్తూ పెనుభారంగా తయారైన యువత చాలా ప్రమాదకరం. ఊహల్లో తేలియాడే ప్రపంచానికై ఉర్రూతలూగుతున్న యువతను సంస్కరించాలి. తల్లిదండ్రుల దృక్పథంలో కూడా మార్పు రావాలి. తల్లిదండ్రులు ఒక స్థాయి వరకు తమ పిల్లలను తమ వద్దే పెరిగేటట్టు చూడాలి. బాహ్య ప్రపంచంలోని అనైతిక ధోరణులవలన కలిగే పర్యవసానాల గురించి తెలియచెప్పాలి. ఉపాధ్యాయులు కూడా తమ వృత్తి పట్ల అంకితభావం ప్రదర్శించాలి. భావితరాలను మేధాశక్తి సుసంపన్నులు తయారు చేయడంలో వారిపట్ల గురుతరమైన బాధ్యత ఉంది. ఉపాధ్యాయుల ఆలోచనల్లోనే నిజమైన దేశనిర్మాణం ఆధారపడి ఉంది. విద్య అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధం. విద్య ద్వారా సాధించలేనిదంటూ ఏదీ లేదు. అలాంటి నాణ్యమైన విద్య దేశంలో ప్రతీ ఒక్కరికీ అందాలి.
సక్రమమైన విద్యవలన విద్యావంతులు విభిన్నరంగాల్లో తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించి దేశాభివృద్ధిని శిఖరాగ్ర భాగంలో నిలబెట్టగలరు. ప్రపంచగతిని మార్చగలరు. మనిషి మానసిక ఎదుగుదలకు, వ్యక్తిత్వ వికాసానికి విద్య అవసరం. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రావాలి. విద్యార్థులను అన్నిరంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దాలి. అప్పుడే మనం ఆశించిన నిజమైన దేశాభివృద్ధి, ప్రపంచాభివృద్ధి సాధ్యపడుతుంది. విద్యార్థులంతా చక్కని విద్యాసాధనతో విలువలతో కూడిన నవప్రపంచాన్ని సృష్టించాలి. వర్తమాన సమాజం తప్పుటడుగులేస్తున్నది. తప్పటడుగుల దశలో పిల్లలను సరిదిద్దకపోవడమే ఇందుకు కారణం. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా రాణించాలంటే వారిలో విలువలను పెంపొందించాలి. ‘సంపాదన కోసమే చదువు’ అనే భ్రమను తొలగించాలి. ఆహ్లాదకరమైన కుటుంబ వాతావరణంలో పిల్లలు పెరగాలి. కుటుంబ వాతావరణం సరిగా లేకపోతే బాలల భవితవ్యం ఆగమ్యగోచరమవుతుందన్న సత్యం గ్రహించాలి.
- సుంకవల్లి సత్తిరాజు
9704903463