సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలిన ప్రమాదంలో 1- జులై, -2025 మధ్యాహ్నం వరకు 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు, మరి కొందరికి శరీరం కాలి తీవ్రగాయాల పాలైనట్లు అధికారు వెల్లడించారు. అనేక మంది కార్మికులు శిధిలాల కిందే ఉన్నారు. మృతుల సంఖ్య 55కు చేరుకుంటుందని అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. పేలుడు సంభవించిన చోట 90 మంది ఉంటే, ఆ సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం 150 మంది కార్మికులు ఉన్నారు. ఫ్యాక్టరీ రియాక్టర్ పేలుడు తీవ్రతకు మూడంతస్తుల భవనాలు కుప్పకులాయి. ఆ పేలుడికి వంద మీటర్ల దూరంలో కార్మికులు ఎగిరిపడ్డారు. ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. సిగాచి ఇండస్ట్రీస్ యాజమాన్యపు నిర్లక్ష్యం ఫలితమే ఈ ఘోరమైన ప్రమాదానికి కారణం. కాలంచెల్లిన పరికరాలు వినియోగించటం, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి శుభ్రం చేయాల్సి ఉండగా, అలా చేయకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాలు ధ్వజమెత్తాయి.
రియాక్టర్‌ను శుభ్రం చేయటానికి, కొత్తపరికరాలు కొనుగోలు చేయటానికి డబ్బులు ఖర్చుచేయటం వల్ల తమ లాభాలు తగ్గుతాయని యాజమాన్యం భావించింది. అందుకే కార్మికుల ప్రాణాలకు విలువ ఇవ్వలేదు. రసాయనిక పరిశ్రమల్లో రియాక్టర్లే ప్రధానం. ఎలాంటి రసాయన పదార్ధాన్ని అయినా ఇందులో ప్రాసెస్ చేయాల్సిందే. అంతటి ప్రాధాన్యత గల రియాక్టర్ వెడల యాజమాన్యం నిర్లక్ష్యం (Negligence ownership) వహించడం క్షమించరాని నేరం. యాజమాన్యపు నిర్లక్షానికి 40 మందికి పైగా కార్మికుల, ఉద్యోగుల ప్రాణాలను తీసుకుంది. చనిపోయిన వారిలో ఇతర రాష్ట్రాల కార్మికులే ఎక్కువగా ఉన్నారు. 2023 సంవత్సరంలో కూడా ఈ సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడులో ముగ్గురు కార్మికులు మరణించారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఫ్యాక్టరీలో కాలంచెల్లిన పరికరాల స్థానంలో కొత్త పరికరాలు ఏర్పాటు చేయాలని, రియాక్టర్‌ను శుభ్రం చేయాలని కార్మికులు కోరినా యాజమాన్యానికి పట్టలేదు. పట్టించుకునే ఉంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు.
ఈ సిగాచి పరిశ్రమను 11- జనవరి, -1989లో ‘సిగాచి క్లోరో- కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ గా స్థాపించబడింది. 2012లో ఈ పేరును ‘సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ గా పేరు మార్చారు. ఈ పరిశ్రమలో మైక్రో క్రిష్ణలైన్ సెల్యులోజ్ (ఎంసిసి) తయారు చేస్తారు (ఇది శుద్ధి చేసిన కలప గుజ్జు నుండి తయారయ్యే ఒక తెల్లటిఫౌడర్) దీన్ని ఆహార పదార్థాలు, మందులు, సౌందర్య సాధనాలు, ఇతర పరిశ్రమల్లో వినియోగిస్తారు. 1996 సిగాచి పరిశ్రమ ఎగుమతులను ప్రారంభించింది. నేడు అతిపెద్ద తయారీ సంస్థగా ఉంది. ఇది భారతీయ పరిశ్రమగా ఉన్నా అనేక దేశాల్లో అనుబంధ సంస్థలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా, జర్మనీ, బ్రెజిల్ దేశాల్లోని అనుబంధ సంస్థల ద్వారా పని చేస్తుంది. ప్రతి సంవత్సరం వేల కోట్ల వ్యాపారంతో పెద్ద ఎత్తున లాభాలు గడించింది. దీని ప్రధాన కార్యాలయం మాత్రం గుజరాత్‌లో ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో దేశంలో పరిశ్రమ యజమానులకు అనేక మినహాయింపులు, రాయితీలు పాలకులు ఇస్తున్నారు.
ఫలితంగా ఎప్పటికప్పుడు తనిఖీ చేసి, లోపాలను గుర్తించి వాటిని సరిచేయించే ప్రభుత్వ పర్యవేక్షణ వ్యవస్థ నిర్వీర్యమైంది. కార్మిక భద్రతా ప్రమాణాలు పాటించటానికి, ప్రమాద సమయంలో కార్మికులు చనిపోకుండా బయటపడే పరికరాలు సరఫరా చేయటానికి యాజమాన్యాలు ముందుకు రావటంలేదు. చట్టపరంగా పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. భద్రత అనేది అధిక ఖర్చుగా యాజమాన్యాలు భావిస్తున్నాయి. అలా చేస్తే తమ లాభాలు తగ్గిపోతున్నట్లు చూస్తున్నారు. లాభాలే ప్రధానంగా భావిస్తూ కార్మికుల ప్రాణాలకు విలువ ఇవ్వటం లేదు. పరిశ్రమ యజమానుల దోపిడీ విధానాలు, భద్రతవెడల నిర్లక్ష్యం వల్ల తెలుగు రాష్ట్రాల్లోని పరిశ్రమల్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. తెలంగాణలో రాష్ట్రలో పారిశ్రామిక కేంద్రాలైన హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రతి ఏటా పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రెండు రోజులకు ఒక ప్రమాదం జరుగుతుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నేషనల్ క్త్రెమ్ రికార్డ్ ప్రకారం గత ఐదు సంవత్సరాల్లో 600 వందలకు పైగా పారిశ్రామిక ప్రమాదాలు జరగగా 1,116 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది. గత పది సంవత్సరాల్లో ఫార్మా యూనిట్లలో 102 భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. రియాక్టర్ల నిర్వహణలో నిర్లక్ష్యం అందుకు కారణాలుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోన ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గత ఐదు సంవత్సరాల్లో 119 పారిశ్రామిక ప్రమాదాలు జరిగి 120 మంది కార్మికులు చనిపోగా, 68 మంది గాయపడ్డారు. 2020 మే లో దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జి పాలిమర్స్‌లో జరిగిన ప్రమాదంలో 15మంది కార్మికులు చనిపోయారు. ఇంకా హెచ్‌పిసి ఎల్‌లో 12 మంది, విశాఖ ఆక్సిజన్ స్టీల్ ప్లాంట్లో 12 మంది కార్మికులు చనిపోయారు.
అనకాపల్లి జిల్లాలో 2019 -2024 వరకు 40 పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో 55మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 2022 సంవత్సరంలో 24 కంపెనీల్లో జరిగిన ప్రమాదాల్లో 20 మంది చనిపోయారు. పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో ఘోరమైన ప్రమాదం జరిగి మూడు రోజులైనా, దాని యాజమాన్యం పరిశ్రమ దగ్గరకు రాలేదంటే, ప్రమాదం వెడల దాని నిర్లక్ష్యం, కార్మికుల ప్రాణాలకు విలువ ఇవ్వకపోవటం తెలియచేస్తున్నది. రియాక్టర్ పేలి అనేక మంది కార్మికులు చనిపోవటానికి కారణమైన సిగాచి పరిశ్రమ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, చనిపోయిన ఒక్కో కార్మిక కుటుంబానికి యాజమాన్యం నుండి రూ. 10 కోట్లు పరిహారం ఇప్పించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య అందించాలని, కొత్త పరికరాల ఏర్పాటు, రియాక్టర్ శుభ్రం చేయటం వెంటనే జరగాలని కార్మికులు, ప్రజలు డిమాండ్ చేయాలి.
- బొల్లిముంత సాంబశివరావు, 98859 83526