నవ మాసాలు మోసి… వ్యయ ప్రయాసాలకోర్చి … పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి ఆ పసి కందును అమ్మకానికి పెట్టింది. పురిటి నొప్పుల బాధ తగ్గక ముందే ఆ పసి కందును తన పొత్తిళ్లు దూరం చేసింది. కానీ బేరం బెడిసి కొట్టడంతో కన్న తల్లి ఎదురు తిరిగింది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సాక్షిగా సాగిన పసికందు అమ్మకం గుట్టును రట్టు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కొద్ది గంటల వ్యవధిలో కథకు సుఖాంతం ఇచ్చారు. మొత్తం ఈ వ్యవహారంలో ప్రియుడు కీలక పాత్ర పోషించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిజామాబాద్ నగరంలోని నాగారం మూడువందల క్వార్టర్స్‌లో ఉండే ఓ మహిళ డెలివరీ కోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరింది. మూడు రోజుల క్రితం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లడానికి కొద్ది గంటల ముందే నవ మాసాలు మోసిన తల్లి ప్రియుడి ఒత్తిడితో కర్కషంగా మారింది.
అమ్మతనం ఆత్మీయత అంటే ఏమిటో తెలియని ఆ పసికందును అమ్మడానికి సిద్ధ్దమైంది. హైమదీబజార్‌కు చెందిన ఓ ముఠాతో రెండు లక్షల రూపాయలకు విక్రయించడానికి ఒప్పందం చేసుకుంది. ఆమె ప్రియుడు నజీర్ మధ్యవర్తిత్వతం వహించాడు. పూలాంగ్‌కు చెందిన భార్యభర్తలు పసికందును కొనుగోలు చేశారు. అయితే రెండు లక్షలు ఇస్తామని నమ్మబలికిన ముఠా లక్ష రూపాయలు ఇచ్చి చేతులేత్తేసింది. దీంతో ఆ తల్లి ఎదురు తిరిగి జనరల్ ఆస్పత్రిలో సాగిన పసికందు అమ్మకం గుట్టును రట్టు చేసింది. నేరుగా సమీపంలోని ఒకటవ టౌన్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. జరిగిన తతంగాన్ని చెప్పి తన బిడ్డను తిరిగి ఇప్పించాల్సిందిగా కన్నీరుమున్నీరుగా విలపించింది. దీంతో హుటాహుటిన దిగిన పోలీసులు హైమదీబజార్‌కు చెందిన ముఠాతో పాటు పసికందును కొనుగోలు చేసిన వారిని సైతం అదుపులోకి తీసుకుంది. కొద్ది గంటలోపే కన్న తల్లి ఒడికి చేర్చారు.