కేరళలోని కొట్టాయంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ భవనం గురువారం కూలింది. దాంతో ఒక మహిళ మృతి చెందగా, ఓ బాలిక సహా ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గాయపడిన 11 ఏళ్ల బాలిక, ఆసుపత్రి ఉద్యోగిని వెంటనే క్యాజువాలిటీ డిపార్ట్‌మెంట్‌లో చేర్చారు. రెండు గంటలపాటు శ్రమించి శిథిలాల నుంచి వెలికి తీసిన మహిళ చనిపోయిందని తర్వాత ప్రకటించారు. ఆమె తలయోలపంబుకు చెందిన బిందుగా గుర్తించారు. ఆసుపత్రిలో తన కూతురికి వైద్యం జరుగుతుండగా ఆమె తోడు(బైస్టాండర్)గా ఉన్నారు. గాయపడిన చిన్నారి వాయ్‌నాడ్‌లోని మీనాంగడికి చెందిన అలీనా విన్సెంట్‌గా గుర్తించారు.
ఆమె 10వ వార్డులో చికిత్స పొందుతున్న తన అవ్వకు తోడుగా ఉండగా దుర్ఘటనకు గురయింది. ఇక ఆసుపత్రిలో పనిచేస్తున్న అమల్ ప్రదీప్ తరలింపు సమయంలో ట్రాలీ కొట్టుకుని గాయపడ్డాడు. కూలిపోయిన భాగం మూడంతస్తుల బ్లాక్‌లోని 14వ వార్డుకు చెందిన బాత్‌రూమ్ కాంప్లెక్స్ అని అధికారులు తెలిపారు. దుర్ఘటన జరిగాక ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్, కార్పొరేషన్ మంత్రి వి.ఎన్.వాసవన్ వెంటనే ఆసుపత్రిని సందర్శించారు. ప్రతిపక్ష యుడిఎఫ్ నాయకులు, ఎంపీ ఫ్రాన్సిస్ జార్జ్, ఎంఎల్‌ఏలు తిరువాంచూర్ రాధాకృష్ణన్, చాందీ ఊమెన్ కూడా సందర్శించారు. కాగా ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ రాజీనామా చేయాలని బిజెపి డిమాండ్ చేసింది.