కాలం మారుతోంది. టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. డిజిటల్ మనుషుల ఆలోచన ధోరణి సైతం మారుతోంది. జీవనశైలిలో సమూల మార్పులు వస్తున్నాయి. చిత్రవిచిత్ర పోకడలు మొలుచుకొస్తున్నాయి. నేడు నిద్ర విడాకులు (స్లీప్ డైవర్స్) ట్రెండ్ నడుస్తోంది. నిద్ర విడాకులు లేదా స్లీప్ డైవర్స్ అనే ఆలోచనలు ఇటీవల బహుళ ప్రచారంలోకి వచ్చింది. నిద్ర విడాకులు అనే పదం ఒక విషాదకర, అసౌకర్య సమస్యగా కనిపిస్తున్నది. నిద్ర విడాకులు అంటే జంట విడిపోవడం కాదు. ఇది జంట ఆరోగ్య ప్రదాయిని అని అర్థం చేసుకోవాలి. మూడింట ఒక వంతు దంపతులు లేదా ప్రేమ భాగస్వాములు వేరువేరు రూమ్‌ల్లో లేదా వేరువేరు బెడ్లపై నిద్రించడం లేదా వేర్వేరు సమయాల్లో పడుకోవడం సాధారణంగా జరుగుతున్నట్లు గమనించారు. జీవిత భాగస్వాములు పలు కారణాలతో వేర్వేరు గదుల్లో పడుకోవడం లేదా ఒకే గదిలోని రెండు వేర్వేరు పడకలపై నిద్రించడాన్ని నిద్ర విడాకులు లేదా స్లీప్ డైవర్స్ అని నిర్వచిస్తున్నారు.
నిద్ర విడాకుల వల్ల కొన్ని జంటలకు ప్రయోజనం జరిగితే మరి కొన్ని జంటలు చివరికి మళ్లీ ఒకే మంచంలో నిద్రించడం జరుగుతుంది. నిద్ర విడాకుల వల్ల ఆయా పరిస్థితులను బట్టి లాభాలు, నష్టాలు కూడా ఉన్నాయి. నిద్ర అంతరాయాలను తగ్గించడానికి నిద్ర విడాకులు ఉపయోగపడతాయి. జంటలో ఒకరికి గురక అలవాటు (స్లీప్ అప్నియా), నిద్రలో మాట్లాడే స్వభావం, నిద్రలేమి, శ్వాస ఇబ్బందులు, వేరు వేరు సమయాల్లో నిద్రపోయే ప్రణాళికలు, తల్లిదండ్రులతో మాట్లాడడం, కాళ్ల కదలికలు, అర్ధరాత్రి వరకు టివి చూడడం లేదా సెల్‌ఫోన్‌ను వాడడం, నిద్రలో వస్తువులు విసరడం, గట్టిగా కౌగిలించుకోవడం, దిండు లేదా దుప్పటిని కౌగిలించుకోవడం, రాత్రి మూత్ర విసర్జనకు 2 లేదా 3 సార్లు లేవడం, భాగస్వామి నిద్రలో అసమానతలు, ఇద్దరిలో ఒకరు లైట్ వేసుకుందామని అనడం, ఇద్దరిలో ఒకరికి నిద్రలో లేచి నడిచే అలవాటు లాంటి కారణాలతో మరొకరు నిద్రకు దూరం కావడం లేదా నిద్రాభంగం కావడం జరుగుతుంది.
నిద్ర విడాకుల వల్ల ప్రయోజనాలు సందర్భాల్లో ఇద్దరు వేర్వేరు గదుల్లో అయినా లేదా ఒకే గదిలో వేర్వేరు పడకలపైన నిద్రిస్తే ఇద్దరికీ నిదురించే అవకాశం కలిగి ఆరోగ్య భాగ్యాలు సమకూరుతాయి. బెడ్ పార్టనర్ వల్ల కలిగే అంతరాయాలను నిద్ర విడాకులతో నివారించడం వల్ల 53 శాతం మందికి నిద్ర నాణ్యత పెరిగినట్లు తేలింది. నిద్ర విడాకులకు కట్టుబడి ఉన్న జంటల్లో కనీసం ఒక గంట వరకు నిద్రించే సమయం పెరిగినట్లు స్పష్టం అవుతున్నది. విడివిడిగా పడుకోవడం వల్ల నిద్ర మెరుగుపడడం, అలసట తగ్గడం ఫలితంగా ఆరోగ్యాలు కూడా కుదుట పడినట్లు తేలింది. నిద్ర విడాకులను పాటించని యెడల నిద్రలేమి సమస్య (Insomnia problem) ఉత్పన్నమై కోపం పెరగడం, జగడాలు పెరగడం, విభేదాలు ముదరడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో తమ భాగస్వామిని కొట్టడం, తన్నడం, ఆకస్మిక హింసాత్మక చర్యలకు పూనుకోవడం జరిగే సందర్భాల్లో నిద్ర విడాకులు మాత్రమే ఉత్తమ మార్గంగా పాటించడం మంచిది.
నిద్ర విడాకుల వల్ల నష్టాలు నిద్ర విడాకులను పాటించడానికి రెండు విడివిడిగా గదులు ఉండాలి కాబట్టి డబుల్ బెడ్ రూం ఇళ్లు లేదా ఒకే గదిలో రెండు మంచాలు అవసరం అవుతూ ఖర్చులు పెరుగుతాయి. నిద్ర విడాకుల ఆలోచనలను పాటించడం వల్ల జంట మధ్య సాన్నిహిత్యం, లైంగిక జీవితంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. నిద్ర విడాకులతో వేర్వేరు గదుల్లో పడుకోవడం వల్ల కొంత మందిలో ఒంటరితనం వల్ల నిద్రకు భంగం లేదా నిద్ర నాణ్యత తగ్గడం కూడా కలుగవచ్చు. ఇలాంటి సందర్భాల్లో తిరిగి ఇద్దరు ఒకే బెడ్‌పై పడుకొని మెరుగైన నిద్రను పోవచ్చు. కొంత మంది ఒంటరిగా పడుకోవడంతో అభద్రతకు, రాత్రిపూట భయానికి లోను కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఆరోగ్యాలు దెబ్బతింటాయి. నిద్ర విడాకుల సమస్యకు విరుగుడు జీవిత భాగస్వామి అలవాట్ల వల్ల మీ నిద్రకు భంగం కలిగితే, మీ భాగస్వామితో నేరుగా చర్చించి నిద్ర విడాకులను పాటించవచ్చు.
గురక వల్ల నిద్ర విడాకులు చేయాల్సి వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి గురక సమస్యకు పరిష్కారం వెతకవచ్చు. వేరు వేరు నిద్ర సమయాలు ఉన్న జంటలు తమ జీవన శైలిని మార్చుకొని ఇద్దరు ఒకే సమయంలో నిద్రకు ఉపక్రమించవచ్చు. జంటలో ఒకరు లైట్ కావాలని అన్నపుడు మరో వ్యక్తి కంటికి ముసుగు ధరించవచ్చు. జంటలో ఒకరికి మెత్తటి పరుపు, మరొకరికి గట్టిగా ఉండే పరుపు కావాలన్నపుడు ఒకే మంచంలో రెండు వేర్వేరు పరుపులను కూడా వాడుకునే స్కాండినేవియన్ శైలిని పాటించవచ్చు. జంటలో ఒక్కరికి తన్నే లేదా కాళ్లు కదిపే అలవాటు ఉన్నట్లు అయితే ఒకే బెడ్‌పై పడుకుంటూ ఇద్దరి మధ్య దిండ్లు కూడా పెట్టుకోవచ్చు. నిద్ర విడాకులు పాటించడం అనే ఆలోచనలు నిరుత్సాహకరంగా అనిపించవచ్చు.
ఇద్దరు ఒకే గదిలో పడుకొని సరైన సమయం నిద్రపోని యెడల దీర్ఘకాలిక అనారోగ్యాలు కలగవచ్చు. కాబట్టి దీనిని నిద్ర మెరుగుపడడం కోసం వాడుకోవడం మంచిది. రోజంతా కలిసి ఉంటూ నిదురించే సమయాల్లో విడాకులు తీసుకోవడం నేర్చుకొండి. మళ్లీ పరిస్థితులు మెరుగుపడితే తిరిగి ఒకే గదిలో ఒకే మంచంలో పడుకోవడం ఎప్పడైనా మొదలు పెట్టవచ్చు. ఒకవేళ ఒకరికి గురక సమస్య ఎక్కువగా ఉంటే మరొకరి నిద్రకు తీవ్ర భంగం కలుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఇద్దరూ చక్కగా చర్చించుకొని నిద్ర విడాకులను పాటించవచ్చు. నిద్ర విడాకులు బంధాలను దూరం చేయడానికి కాదని, బంధాలను ఆరోగ్యంగా కొనసాగించడానికని మరువరాదు.
- మధుసూదన్ రెడ్డి బుర్ర, 9949700037