ఎంతో గొప్ప వ్యక్తిత్వం.. ఎన్నో పదవులు.. ఉత్తమ విలువలతో.. ఆ పదవులకే వన్నెతెచ్చిన రాజకీయ దురంధరుడు రోశయ్య. తెలుగు రాజకీయాల్లో అందరివాడు ఆయన. ఆయనో రాజకీయ శిఖరం. రాజకీయాల్లో ఆయన చూడని ఎత్తులు లేవు, పైఎత్తులు లేవు. రాజకీయాల్లో ఆయనను మించిన వ్యూహ చతురత కలిగిన నాయకుడు మరొకరు లేరు. ఆయన రాజకీయం చేస్తే కర్రా విరగదు పాము చావదు. ఆయన రాజకీయం చేస్తే విపక్షాలు కూడా ఆయనను గట్టిగా విమర్శలు చేయలేవు. ఆయన మాటలు ఓ రకంగా తూటాలు… కానీ అవి ఎవరినీ గాయం చేయవు. ఆయన ఒక్క మాట మాట్లాడితే దాని వెనుక ఎంతో పెద్ద అర్ధం ఉంటే గాని మాట్లాడరు. అనవసర ప్రసంగాలు ఆయన నుంచి రావు. ఉమ్మడి ఎపిలో కాంగ్రెస్ నుంచి ఎవరు సిఎం అయినా సరే ఆయన కేబినెట్‌లో ఉండాల్సిందే. ప్రజల్లో మాస్ ఇమేజ్ లేకపోయినా సరే ఆయనకు ప్రభుత్వంలో మాత్రం సిఎం తర్వాత సిఎంగా ప్రాధాన్యత ఉండేది అందుకే.
ప్రత్యర్ధులపై చమత్కారాలతో ఇరుకునపెట్టే నైపుణ్యం ఆయన సొంతం. వైఎస్ సిఎంగా ఉండగా ఓ సందర్భంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అసెంబ్లీలో రోశయ్యను (Rosaiah Assembly) ఉద్దేశించి మీకు ఈ మధ్య తెలివితేటలు ఎక్కువ అయ్యాయి అని వ్యాఖ్యానించారు. దానికి రోశయ్య ప్రతి స్పందిస్తూ నాకే తెలివితేటలు ఉంటే చెన్నారెడ్డిని, నేదురుమల్లి జనార్దన రెడ్డిని, అంజయ్యను, వీరితోపాటు తనను నమ్మిన వైఎస్‌ను ఎప్పుడో ఏమార్చి సిఎం అయ్యేవాడినంటూ సెటైర్ వేశారు. చంద్రబాబు ఎన్‌టిఆర్‌ను దింపేసిన వైనాన్ని అలా అసెంబ్లీలోకి పరోక్షంగా తీసుకు వచ్చారన్నమాట. అంత పరుషంగా ఉండదు.. అలా అని ఎదుటివారు తేలిగ్గా తీసుకోలేని విమర్శలు. ఆయన మాటల చాతుర్యం గురించి చెప్పుకోవాలంటే ప్రతి సందర్భం.. ఓ సాక్ష్యమే అవుతుంది. ఆయన మాస్ లీడర్ కాదు. పరోక్షంగా ఎన్నికయిందే ఎక్కువ.
సందర్భోచితంగా చక్కటి భాషలో చురకలంటించేవారు రోశయ్య. 22 ఏళ్ళ క్రితం రోశయ్య తన ప్రత్యర్ధి చంద్రబాబు నాయుడు పాలన గురించి చెప్పిన మాటలు ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ ముఖ్యమంత్రికి దక్కని గౌరవం రోశయ్యకు దక్కింది. అజాత శత్రువుగా పేరొందిన రోశయ్యకు తెలంగాణ రాష్ట్రంలో అరుదైన గౌరవం లభించడం హర్షణీయం. ఉమ్మడి ఎపిలో 16 సార్లు ఆర్థిక మంత్రిగా, ప్రజాపద్దుల శిల్పిగా, శాసన సభలో ప్రతిపక్షం పాలిట వికటకవిగా, సర్కార్‌కు గొంతు పెగలని ప్రశ్నలు సంధించే రాజకీయ దురంధరుడుగా, శాంతి ప్రవచనాలతో మృదు స్వభావిగా, మాటల తూటాల జడివానతో, మహోగ్ర పదాల రుధిర ధారతో, ప్రత్యర్థి రాజకీయ నేతల గుండెల్లో జల్లు సృష్టించే కొణిజేటి రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిఎం పాత్రలోనూ ఈ పల్నాడు బిడ్డ ఎక్కడా తగ్గలేదు.
అందుకే.. అరుదైన గౌరవంతో తెలంగాణ ప్రభుత్వం కొణిజేటి రోశయ్యను నేటి తరాలకు యాది చేస్తోంది. ఆయన జయంతి వేడుకలను తెలంగాణలో అధికారికంగా నిర్వహించాలని, ఆయన విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం అపర చాణక్యుడి పట్ల తమకున్న కృతజ్ఞత భావాన్ని చాటి చెప్పింది.సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా పని చేసిన ఏ ఒక్కరికీ రోశయ్యకు లభించిన గౌరవం దక్కలేదు. కాగా, ఇప్పటి వరకు పనిచేసిన కొందరు ముఖ్యమంత్రుల జన్మదినాలను జయంతిగా రాజకీయ పార్టీలే జరుపుతున్నాయి. మరికొందరి జయంతిని కుటుంబ సభ్యులు లేదా అభిమానులు జరుపుతున్నారు. అలాంటిది రోశయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించటం కచ్చితంగా అరుదైన గౌరవం అవుతుందనడంలో సందేహం లేదు.
- అనంతాత్మకుల కొండబాబు, నేడు కొణిజేటి రోశయ్య జయంతి