Saturday, July 5, 2025

నెలాఖరులోగా పదవుల భర్తీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి : నెలాఖరులోగా రాష్ట్ర, జిల్లా స్థాయి నామినెటెడ్ పదవులన్నీ భర్తీ చేయాలని ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఆదేశించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకునేలా ప్రతి ఒ క్కరూ కష్టపడి పని చేయాలని మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షు డు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశానికి ఖర్గే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి , ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ మీనాక్షి నటరాజన్,

డిప్యూటీ సిఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, పిసిసి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐసిసి చీఫ్ ఖర్గే ప్రసంగిస్తూ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు. నామినేటెడ్ పోస్టులన్నింటినీ భర్తీ చేసినట్లయితే వారు మరింత ఉత్సాహంగా పని చేస్తారని ఆయన తెలిపారు. పదవులు అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి ఈ దఫా పదవి రాని వారు అసంతృప్తి చెందవద్దని, వారి సేవలను పార్టీ మరో రకంగా వినియోగించుకుంటుందని ఖర్గే తెలిపారు.

స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలి..
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని, మెజారిటీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందన్నారు. పార్టీలో పాత, కొత్త అనే తారతమ్యం లేకుండా నాయకులు, కార్యకర్తలు కలిసి మెలసి పని చేస్తేనే విజయం సాధిస్తామన్నారు. గత ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆయన ముఖ్యమంత్రి వైపు చూస్తూ అన్నారు. పార్టీలో గ్రూపులు కడితే తాము భయపడబోమని ఆయన హెచ్చరించారు.
జూబ్లీహిల్స్‌లోనూ విజయం
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి అత్యధిక మెజారిటీతో విజయం సాధించేందుకు అందరూ కృషి చేయాలని ఖర్గే కోరారు.

రేవంత్‌పై ప్రశంసల జల్లు..
ఇదిలాఉండగా ఖర్గే తన ప్రసంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘మీ ముఖ్యమంత్రి బాగా పని చేస్తున్నారు, పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి పని తీరు పట్ల సంతోషంగా ఉంది..’ అని ఆయన వ్యాఖ్యానించడంతో సభికులు కరతాళధ్వనులు చేశారు. ప్రభుత్వం చేపట్టిన, చేపడతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఆయన సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇన్ని అభివృద్ధి పథకాలు అమలులో లేవన్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, ప్రతి ఇంటికి ఏదో రకమైన లబ్ది చేకూరుతున్నది కాబట్టి వాటి గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని, ఇంటింటికీ వెళ్ళి ప్రజలకు గుర్తు చేయాలని పార్టీ శ్రేణులకు ఖర్గే సూచించారు.

మంత్రులదే ఆలస్యం : రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో తన వైపు నుంచి జాప్యం లేదన్నారు. తాను రెండు, మూడు నెలలుగా అర్హులైన వారి జాబితాలు ఇవ్వాల్సిందిగా జిల్లా ఇన్‌ఛార్జీ మంత్రులను కోరుతూనే ఉన్నానని చెప్పారు. జాబితాలు ఇవ్వడంలో ఎందుకు జాప్యం జరుగుతున్నదో తనకు అర్థం కావడం లేదన్నారు. మంత్రులు, ఇన్‌ఛార్జీ మంత్రులు జాబితా ఇవ్వగానే వాటన్నింటినీ క్లియర్ చేస్తానని ముఖ్యమంత్రి తెలిపారు.

సామాజిక న్యాయం : మహేష్ కుమార్
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగిస్తూ సామాజిక న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంతోనే సాధ్యమని అన్నారు. పిసిసి నూతన కార్యవర్గంలో నియమితులైన వారికి పార్టీ చక్కని అవకాశం కల్పించింది కాబట్టి ఆ పదవి ద్వారా ప్రజలకు మరింత చేరువగా ఉంటూ వారికి సేవలందించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన సూచించారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, ఏఐసిసి నాయకురాలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ మీనాక్షి నటరాజన్, ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఏపి కాంగ్రెస్ నాయకుడు గిడుగు రుద్రరాజు తదితరులు ప్రసంగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News