పాట్నా: బిహార్ రాష్ట్రం పాట్నాలో ప్రముఖ వ్యాపారవేత్త, బిజెపి నేత గోపాల్ ఖేమ్కాను ఇంటికి సమీపంలో తుపాకీతో కాల్చి చంపారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి నేతను కాల్చి చంపడంతో రాజకీయంగా పెనుదుమారం రేపింది. గోపాల్ ఖేమ్కా అనే వ్యక్తి మగధ ఆస్పత్రికి యజమానిగా ఉన్నాడు. గోపాల్ తన ఇంటికి సమీపంలో ఉన్న హోటల్ వెళ్లి తిరిగి వస్తుండగా ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గోపాల్ ఖేమ్కా కుమారుడు గుంజన్ ను కూడా ఆరు సంవత్సరా ల క్రితం ఇదే విధంగా హత్య చేశారు. 2018లో తన ఫ్యాక్టరీ నుంచి గుంజన్ బయటకు వస్తుండగా దుండగులు అతడిని గన్తో కాల్చి చంపారు. గోపాల్ హత్య నేపథ్యంలో ప్రతి పక్ష కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. ప్రముఖ వ్యాపార వేత్తను ఇంటికి దగ్గరలో హత్య చేశారని, పాట్నాలో ఇలా ఉంటే మిగితా ప్రాంతాల పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడియు ప్రభుత్వ వైపల్యంతో ఈ హత్య జరిగిందని స్వతంత్ర ఎంపి పప్పు యాదవ్ ఆరోపణలు చేశారు. ప్రస్తుతం బిహార్లో ఎవరు సురక్షితంగా లేరని ధ్వజమెత్తారు.