Sunday, July 6, 2025

అవినీతి జాడ్యానికి మందేది?

- Advertisement -
- Advertisement -

అక్కడ జరిగింది పండుగ, జాతర ఉత్సవాలు కాదు. ప్రభుత్వాధినేతల, రాజకీయ నాయకుల పర్యటనలు కావవి. ఆనందోత్సవాల కేరింతలు, మిరుమిట్లు కొలిపే పటాకుల హంగామా మధ్య ఊరు ఊరంతా సంబరాల కోలాహలం. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహసిల్దార్ ఎసిబికి పట్టుబడిన వ్యవహారంలో ప్రజలు స్పందించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ లంచగొండి ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి ప్రజలను పీడించిన తీరుతో ప్రజలు ఆ సంఘటన పట్ల ప్రదర్శించిన ఆహాభావాలు వారు ఎంత విసిగిపోయారో స్పష్టం చేస్తొన్నవి. రెవెన్యూ, హోమ్, పురపాలక పట్టణ అభివృద్ధి, నీటిపారుదల, స్టాంపులు రిజిస్ట్రేషన్లు మొదలగు విభాగాలలో రోజురోజుకూ అవినీతి వేళ్లూనుకుపోతోంది. సెటిల్‌మెంట్లకు అడ్డాలుగా పోలీస్ స్టేషన్లు మారుతున్నాయని, సివిల్ పంచాయితీలకు కేంద్రాలుగా వాటిని పోలీసులు మార్చుతున్నారని ఇటీవల హైకోర్టు తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలు చేసింది.

హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లలో జరిగే అవినీతి దందాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. రాష్ట్రంలోని పలు మెడికల్ కాలేజీలు (Medical Colleges) అడ్డదారుల్లో అనుమతులకోసం అనుకూల నివేదికలు ఇవ్వడానికి జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసి) అధికారులకు లంచాలు ఇచ్చిన విషయంలో సిబిఐ కేసు నమోదు కావడం అవినీతి పరాకాష్ఠకు మచ్చుతునక. 2025 తొలి అర్ధ సంవత్సరంలో (జనవరి -జూన్) ఎసిబి కేసుల పురోగతిని ఎసిబి డైరెక్టర్ జనరల్ కార్యాలయం జులై 1న ప్రకటన విడుదల చేసింది. ఎసిబి ప్రకటన వెలువడిన నాడే తలకొండపల్లి ఎంఆర్‌ఒ పట్టుబడి రెండో అర్ధ సంవత్సరంలో మొదటి కేసుగా నమోదు కావటం అక్రమార్కుల బరితెగింపు తనాన్ని సూచిస్తోంది. ఈ ఏడాది ఆరు నెలల కాలంలో ఎసిబి 126 కేసులను నమోదు చేసి 125 మందిని అరెస్టు చేసింది. రూ 24,57,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో రూ. 27,66,60,526 కోట్ల రూపాయల ఆస్తులను వెలికి తీసినట్లు ఎసిబి ప్రకటించింది.

ప్రతి నిత్యం ఏదో ఒక శాఖకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులకు పట్టుబడుతున్నప్పటికీ అవినీతి తిమింగలాల్లో మార్పు రావడం లేదు. ప్రతిరోజు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో అవినీతి సంఘటనలకు సంబంధించి పుంఖాను పుంఖాలుగా కథనాలు వస్తున్నప్పటికీ ఏమాత్రం సిగ్గు, భయం లేకుండా ప్రజల ముందు బిచ్చగాళ్ల లెక్క చేతులు చాపుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులలో ఎసిబి జరిపిన దాడులలో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ఇఎన్‌సి, ఇఇ, హెచ్‌ఎండిఎ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్‌ల వందల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు బహిర్గతం కావడంతో ప్రజలు ఉద్యోగులను ఈసడించుకునే పరిస్థితులు నెలకొన్నాయి. బడా కాంట్రాక్ట్ సంస్థలు చేసే నాసిరకం పనులు గుడ్డిగా ఆమోదించినందులకు, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులను ఇచ్చినందులకు ప్రతిఫలంగా కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను పోగేసుకున్నారు.

రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఇది జరిగే పని కాదు. ఎసిబి లెక్కల ప్రకారం రోజురోజుకు కేసులుపెరుగుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గటం లేదు. 2024లో అవినీతి నిరోధక శాఖ 152 కేసులను నమోదు చేస్తే ఈ ఏడాది తొలి అర్ధ భాగంలోనే 126 కేసులను నమోదు చేసింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో (జనవరి -మార్చి) ఎసిబి 52 కేసులు నమోదు చేస్తే రెండో త్రైమాసికంలో (ఏప్రిల్ – జూన్) 74 కేసులను నమోదు చేసింది. అంటురోగం కంటే వేగంగా అవినీతి సమాజాన్ని, వ్యవస్థలను, ప్రజలను కబలిస్తోంది. ప్రజలు పన్నుల రూపేనా చెల్లిస్తున్న సొమ్ము నుండి వేలాది రూపాయల వేతనం పొందుతూ ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్యోగులు అది చాలదన్నట్లు అధిక సంపాదనకు అడ్డదారులు తొక్కుతున్నారు. అవినీతి అక్రమార్కుల ప్రవర్తన ఫలితంగా ఉద్యోగ వర్గాలు సమాజంలో తలదించుకునే పరిస్థితులను కల్పిస్తున్నారు.

ఉద్యోగ నిర్వహణ, ప్రజాసేవ పక్కన పెట్టి అక్రమార్జనే అసలు పనిగా పెట్టుకుని ఉద్యోగ ధర్మాన్ని విస్మరిస్తున్నారు. అవినీతి అనకొండల దోపిడీకి సామాన్యుడు ఏదో ఒకచోట బలవుతూనే ఉన్నాడు. లంచాలకు రుచి మరిగిన ఉద్యోగులు ఏటా వందల మంది అవినీతి నిరోధక శాఖకు చిక్కుతున్నా పరిస్థితులలో మార్పు రావటం లేదు. వాస్తవానికి అవినీతి అక్రమాలు తెరమాటున నిత్యకృత్యమై పోతున్నా తెరమీదకు వచ్చేవి కొన్ని మాత్రమే. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కొద్దిమంది అక్రమార్కుల పనితీరువల్ల లంచం ఇస్తే గాని ఫైలు ముందుకు కదలదు. లేదంటే ప్రజలను ఓపిక నశించేలా తమచుట్టూ తిప్పుకుంటారు. సహనం నశించిన ప్రజలు సొమ్ములు సమర్పించుకుంటున్నారు. లేనట్లయితే ఎసిబిని ఆశ్రయిస్తున్నారు. అటువంటి పరిస్థితులలోనే ఎసిబి కేసులు నమోదవుతున్నాయి.

తెలంగాణలో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఎసిబికి పూర్తిస్థాయి స్వేచ్ఛనివ్వడంతో లంచగొండుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ పకడ్బందీగా కేసులు పెడుతోంది. గత కొంతకాలంగా అవినీతి నిరోధక శాఖ పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తుండటాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని అవినీతి నిరోధక శాఖ అరెస్టుచేసి అతనిపై పెట్టిన కేసులో న్యాయ విచారణ కొనసాగించాలంటే ఆ ఉద్యోగికి సంబంధించిన శాఖకుచెందిన ఉన్నతాధికారి అనుమతి ఇవ్వాలి.అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిన ఉద్యోగులపై న్యాయ చర్యలకు అనుమతించడంలో ఉన్నతాధికారులు జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎసిబి 2024 వ సంవత్సరంలో 105 అవినీతి కేసులలోనే నిందితులపై అభియోగ పత్రాల దాఖలుకు ప్రభుత్వంనుండి అనుమతి సాధించింది. 16 కేసులలో నిందితులకు శిక్షలు పడేలా చేసింది.

ప్రభుత్వం లంచగొండులపై అభియోగ పత్రాల దాఖలు విషయంలో జాప్యాన్ని నివారించి పలు శాఖాధిపతులకు దిశానిర్దేశం చేసి న్యాయ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. అవినీతి నిరోధక శాఖకు చిక్కి అరెస్టు కాబడిన లంచగొండులకు బెయిల్ మంజూరీ తర్వాత వారిపై సస్పెన్షన్ ఎత్తివేయడం తదనంతరం ఉద్యోగంలో చేరిపోవటం సాధారణంగా జరిగే ప్రక్రియ. సస్పెన్షన్ తొలగి న్యాయ విచారణకు అనుమతి, న్యాయ విచారణ జరుగుతున్న క్రమంలో నిందితులు తమ శాఖలోని ప్రధాన పోస్టులలోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం శాఖాపరమైన కఠిన చర్యలకు ఉపక్రమించడం చాలా అవసరం. అక్రమ మార్గంలో సంపాదించిన డబ్బు, పలుకుబడితో లంచావతారులు మంచి పోస్టులలోకి ప్రవేశించిన ఉదాహరణలు గతంలో కోకొల్లలు.

అవినీతి నిరోధక శాఖకు చిక్కి న్యాయ విచారణ ఎదుర్కొంటూ మరల ఉద్యోగంలోకి ప్రవేశించే వారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని పెట్టాలి. అటువంటి వారిని సుదూర ప్రాంతాలకు బదిలీచేసి, అప్రధాన పోస్టులను కేటాయించాలి. ఎసిబికి పట్టుబడిన లంచగొండులపై న్యాయ విచారణ పూర్తయి శిక్షలు పడినప్పుడు మాత్రమే ఉద్యోగాల నుంచి తొలగిస్తారు. ఉద్యోగిపై న్యాయ విచారణకు అనుమతి ఇవ్వడంలో, విచారణ ప్రక్రియలో విపరీతమైన జాప్యం వలన పదవీవిరమణ చేసేవరకు కూడా తుది తీర్పులు రావడంలేదు. అవినీతి కేసుల్లో సత్వర విచారణలు జరిపి న్యాయస్థానాలు నిందితులకు కఠిన శిక్షలు విధించాలి. కేసుల విచారణలో ఏండ్ల తరబడి జాప్యం, శిక్షల విషయంలో సందిగ్ధత వలన అవినీతిపరులు మరింత విచ్చలవిడతనానికి పాల్పడే అవకాశం ఉంది. పెండింగ్ కేసుల విచారణకోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు వేగంగా శిక్షలు విధించాలి.

అవినీతి నిరోధక శాఖ తాను నమోదు చేస్తున్న కేసులలో చివరి వరకు సాక్షులు, బాధితులు నిందితులచే ప్రభావితం కాకుండా పకడ్బందీగా వ్యవహరించి కఠినశిక్షలు పడేలా పనిచేయాలి. ప్రభుత్వం ప్రతి ఉద్యోగి ఉద్యోగంలో చేరే సమయంలో ఉన్న ఆస్తిపాస్తులను బహిర్గతపరిచి, తరువాత కొంత నిర్ణీత కాలానుగుణంగా ఎప్పటికప్పుడు శాస్త్రీయబద్ధంగా ఆస్తులను మదింపు చేయించినట్లయితే అవినీతికి అడ్డుకట్టపడే అవకాశం ఉంది. ముఖ్యంగా అవినీతి నిరోధక చట్టంలో సమూలమైన మార్పులు తెచ్చి కఠినమైన నిబంధనలతో లంచగొండుల ఆట కట్టించాలి. సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తే అవినీతికి అది విరుగుడుగా పనిచేస్తుంది. ఎసిబి కేసులలో నిందితులకు శిక్షలు పడ్డ సమాచారాన్ని సామాజిక, ప్రసార మాధ్యమాలలో విరివిగా ప్రచారం చేయాలి. అన్నింటికీ మించి లంచగొండుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  • బిల్లిపెల్లి లక్ష్మారెడ్డి 94409 66416
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News