భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అవుతారు అనే ఉత్కంఠకు తెరపడింది. మాజీ ఎంఎల్‌సి బిజెపి సీనియర్ నేత రామచందర్ రావు పార్టీ నూతన అధ్యక్షునిగా నియమించబడ్డారు. ఈ నిర్ణయం కొంత మందికి నిరాశ కలిగించగా, మరి కొంత మందికి సంతోషాన్ని మిగిలించింది. కాంగ్రెస్ ప్రభుత్వం తో బలంగా కొట్లాడి రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అని బలంగా నిర్ణయించుకున్న వారికి ఈ నిర్ణయం చేదు గుళికలాగా మారింది. రామచందర్ రావు నిబద్ధతకు పార్టీలో సంవత్సరాలుగా వారు చేసిన సేవలకు ప్రతి ఒక్కరూ సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ బలమైన నాయకత్వాన్ని బిజెపికి అందించి ఇప్పటికైనా తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనే చాలా మందికి వారి సౌమ్యమైన వ్యవహార శైలి పట్ల మరో భావన కలిగి ఉంది. ఈ విషయం పట్ల ప్రమాణ స్వీకారం చేసిన రోజే నేరుగా స్పందించిన రామచంద్ర రావు నన్ను ఎవరైనా డమ్మీ అధ్యక్షుడు అని పిలిస్తే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, నేను నక్సలైట్లతో కొట్లాడాను సంవత్సరాలుగా పార్టీకి సేవ చేశాను.
దూకుడు అంటే మాటలతో కాదు సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం అని వారు వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన తీరు వారిపై ఇప్పటికే ఉన్న ఒత్తిడికి సాక్ష్యంగా నిలిచింది. తెలంగాణలో బిజెపి అధ్యక్షుల నియామకం ఎప్పుడు అయోమయానికి, అభద్రత భావానికి దారితీస్తూనే ఉంది. కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడిన బండి సంజయ్ లాంటి నాయకుడిని ఎన్నికల ముందు తొలగించడం, ఇప్పుడు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ లాంటి దూకుడు స్వభావం గల బలమైన నాయకత్వాన్ని ముందుకు (Forward leadership) తీసుకురాకుండా సిద్ధాంతానికి కట్టుబడిన సౌమ్యమైన రామచందర్ రావుని అధ్యక్షునిగా నియమించడం బిజెపి అధిష్ఠానానికి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అనే భావన ఉందో లేదో అని చాలామంది విశ్లేషకులు బిజెపి సానుభూతిపరులు కూడా భావిస్తున్నారు.
క్రమశిక్షణకు, సిద్ధాంతానికి కట్టుబడి ఉండే భారతీయ జనతా పార్టీలో ఈ మధ్య కాలంలో పరోక్షంగా అసమ్మతి రాగం వినబడుతున్నది. నూతన అధ్యక్షుని నియమాకం తర్వాత కొంతమంది నాయకులు కార్యక్రమానికి హాజరు కాకుండా వ్యవహరించిన తీరు సందేహాలను కలిగిస్తుంది. రాజాసింగ్ లాంటి నాయకులు బహిరంగంగానే చేసిన ప్రకటనలు పార్టీకి రాజీనామా చేసిన తీరు బిజెపిలో ఉన్న అయోమయాన్ని తెలియజేసింది. దేశంలోనే బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ విషయంలో నిర్ణయాలు తీసుకోవడంలో అనేక తప్పటడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. నిర్ణయాల్లో ఆలస్యం, లక్ష్యానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోకపోవడం, తెలంగాణ రాష్ట్రానికి ప్రకటించే ఇంచార్జీలు కూడా తరచుగా విఫలం అవుతుండడం, నాయకుల్లో పార్టీ కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత పెరగడం, ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు సరైన గుర్తింపు లేకపోవడం, ఉపన్యాసాల్లో మాత్రమే కార్యకర్తలకు దొరికే ప్రోత్సాహం, కమిటీల్లో ఇతర విషయాల్లో పూర్తిగా నిర్లక్ష్యానికి గురికావడం, కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు తెలంగాణలో బిజెపి విఫలానికి అనేక కారణాలు రోజుకొకటి బయటపడుతున్నాయి.
దేశంలో జరిగే ఏ ఎన్నికల్లో బిజెపి గెలిచినా ఇక తెలంగాణలో గెలవడమే తరువాయి అని మీడియా సమావేశాల్లో ప్రగల్భాలు పలికే నాయకులు కనీసం వారి స్థానం కాకుండా వేరే ఏ ఒక్క స్థానాన్ని కూడా గెలిపించుకోలేకపోవడం, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం కంటే పార్లమెంట్ ఎన్నికల్లోనే పోటీ చేయడానికి ఆసక్తి చూపించడం రాష్ట్రంలో ఆ పార్టీ స్థితిగతులకు ఉదాహరణగా నిలుస్తుంది. తెలంగాణ ప్రజలు కెసిఆర్‌కు ప్రత్యామ్నాయంగా ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో తప్పటడుగులు చేస్తున్నప్పటికీ బిజెపి క్షేత్రస్థాయిలో చేస్తున్న పోరాటాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఎన్నికల ముందు హడావిడి చేసే బిజెపి నాయకులు ప్రజా సమస్యలపై కొట్లాడే విషయంలో మాత్రం మీడియా పులుల్లాగా మారిపోతున్నారు.
రాష్ట్రంలో ప్రజలు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ అగ్ర నాయకుల మౌనం తెలంగాణ ప్రజలకు అనేక అనుమానాలను కలిగిస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే ఇప్పుడు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన సీట్లు సగం కూడా రాబోయే ఎన్నికల్లో గెలుస్తారా అనే అనుమానం సొంత కార్యకర్తల్లోనే మిగిలి ఉంది. ఇలాంటి క్లిష్ట తరుణంలో అధ్యక్ష బాధ్యతల స్వీకరించిన రామచంద్రరావు సంస్థాగత విషయాల పట్ల వారికి ఉన్న అవగాహనతో పార్టీని పటిష్టం చేస్తారా లేదా పెద్ద పెద్ద నాయకుల సూచనల మేరకు పనిచేసి సొంత ముద్ర వేయడంలో విఫలం అవుతారో కాలమే సమాధానం చెప్పాలి. బిజెపిలో ఉన్న సీనియర్ నాయకులు గతంలో అధ్యక్షులుగా పని చేసిన నాయకులు కూడా రామచందర్ రావుకు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఇవ్వాలి.
అలా కాకుండా వారి నిర్ణయాల మీదకే నూతన అధ్యక్షుడు పని చేయాలని కోరుకుంటే మాత్రం బిజెపి నావ పూర్తిగా మునిగే అవకాశం ఉంది. విద్యార్థి దశ నుంచి సమస్యలపై పోరాటం, ఆర్‌ఎస్‌ఎస్ వివిధ క్షేత్రాల సంఘటన పట్ల, క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతుల పట్ల పూర్తి అవగాహన గల విద్యావంతుడైన రామచందర్ రావు ఎంత సామర్థ్యం గల నాయకుడు అయినప్పటికీ మారిన రాజకీయ పరిస్థితులు, రాజకీయాల్లో వాడుతున్న భాష, వ్యవహార శైలి వారి సౌమ్యమైన రాజకీయ విధానాలకు సరితూగుతాయో లేదా అనేది పెద్ద ప్రశ్నగా మిగులుతుంది. విషయ పరిజ్ఞానం విషయానికి కట్టుబడి మాట్లాడడం కంటే ప్రతిపక్షాలను తూలనాడడం, బూతులతో విరుచుకుపడడం ప్రస్తుత రాజకీయ స్టైల్. ఈ తరహా రాజకీయాలకు రామచందర్ రావు సరితూగి సత్తాను చాటుతారో లేదో కాలమే సమాధానం చెప్పాలి.
- మాచనపల్లి శ్రీధర్
90527 89666