మనతెలంగాణ/హైదరాబాద్: పిఆర్‌సి అమలు గడువు దాటి రెండు సంవత్సరాలు గడిచినందున వెంటనే పిఆర్‌సి నివేదికను తెప్పించుకుని 2023 జులై 1 నుండి అమలు చేయాలని టిఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేసింది. 2024 మార్చి నుండి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పదవీవిరమణ అనంతర ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని పేర్కొంది. ఆదివారం సంఘం రాష్ట్ర కార్యాలయంలో చావ రవి అధ్యక్షతన రాష్ట్ర ఆఫీసు బేరర్ల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా చావ రవి మాట్లాడుతూ, ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు నిర్వహించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. లేకుంటే పోరాటాలకు ఉపాధ్యాయ, ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం ఉపాధ్యక్షులు సిహెచ్ దుర్గా భవాని, కోశాధికారి టి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు రాములు, రాజశేఖరరెడ్డి, శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.