కేంద్రం నుంచి తెలంగాణకు పైసా తీసుకురాని బిజెపి నేతలు సిఎం
రేవంత్‌రెడ్డికి లేఖ రాయడం విడ్డూరం
అన్ని రకాలుగా రాష్ట్రానికి అన్యాయం చేసింది మోడీ ప్రభుత్వమే
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌పై మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్
మన తెలంగాణ / హైదరాబాద్: కేంద్రం నుంచి ఏకాణా తేలేని మీరు కూడా తమకు లేఖలు రాయడం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు లేఖ రాయడంపై మంత్రి పొన్నం మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం రాంచందర్ రావుకు బహిరంగ లేఖ రాశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాల సంగతేంటని మంత్రి ఆ లేఖలో ప్రశ్నించారు. గత 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి దేశ ప్రజలను అడుగడునా వంచిస్తోందని అన్నారు. గత మూడు ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హమీలను విస్మరించారని మండిపడ్డారు. వాగ్దానాలతో ఊదరగొట్టడం, మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం, అబద్ధాలను ఆవిష్కరించడం తప్ప మీరు చేసిందేమి లేదని పేర్కొన్నారు.
రైతులు, యువకులు, మహిళలు, పేదలు, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ వర్గాలను వంచించిన చరిత్ర బిజెపిదని ఆక్షేపించారు. అలాంటి మీరు మా సిఎంకి లేఖలు రాయడం ఏంటని ప్రశ్నించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల మెనిఫెస్టోలో 60 ఏళ్లు దాటిన సన్నకారు రైతులకు పించన్లు ఇస్తామని హామినిచ్చారని, ఆ హామీ ఏమైందని మంత్రి పొన్నం ప్రశ్నించారు. పంట పెట్టుబడి సాయం కోసం రైతులకు ఏడాదికి ఇచ్చే రూ.6 వేల కిసాన్ సమ్మాన్ నిధిని పెంచుతామని ప్రగల్భాలు పలికి ఎందుకు పెంచలేదని నిలదీశారు. తెలంగాణ కోసం వందలాది మంది విద్యార్థులు బలిదానం తీసుకుంటే తెలంగాణ ఇవ్వడాన్ని పార్లమెంట్ లో ప్రధాని మోడీ తప్పు పట్టడం పై వైఖరేంటని మంత్రి రాంచందర్ రావును ప్రశ్నించారు. 11 సంవత్సరాలుగా తెలంగాణకు కేంద్ర నుంచి ఒక్క రూపాయి కూడా రాకపోతే రాష్ట్రంలో నుంచి 8 మంది బిజెపి ఎంపీలు ఏం చేశారో చెప్పాలన్నారు. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఏమైందని ప్రశ్నించారు. పదకొండేండ్లలో దేశంలో ఒక్క రేషన్ కార్డును ఇవ్వని దుస్థితి మీది కాదా? పైగా దేశంలో ఒక కోటి 31 లక్షల మందికి రేషన్ బియ్యం ఎగ్గోట్టిన పాపం మీది కాదా? మీ ఏలుబడిలో నిత్యావసర సరుకుల ధరలు రెట్టింపు అయినా, వికలాంగులు, వృద్దులు, వితంతువులకు ఇచ్చే సామాజిక పించన్లను పదకొండేండ్లుగా పెంచకుండా అన్యాయం చేసింది మీరు కాదా? రైళ్లలో ఈ వర్గాలకు రాయితీలు ఎత్తేసిన అమానవీయులు మీరు కాదా? అంటూ పొన్నం తన లేఖలో ప్రశ్నల వర్షం కురిపించారు.
లీటర్ పెట్రోల్ ధరను రూ.70 నుంచి రూ. 110కి పెంచింది మీరు కాదా అని రాంచందర్ రావును ఉద్దేశించి మంత్రి పొన్న ప్రభాకర్ నిలదీశారు. . గ్యాస్ సిలిండర్ ధరను రూ.400 నుంచి రూ.1,100 చేసి నిరుపేదల నడ్డి విరిచారని ధ్వజమెత్తారు. డాలరు 60 రూపాయలున్నప్పుడు గుండేలు బాదుకున్న మోడీ ఇప్పుడు డాలరు 84 రూపాయలయ్యింది. ఎందుకో మాట్లాడరు, కాజీపేట కు రావాల్సిన రూ. 20 వేల కోట్ల కోచ్ ఫ్యాక్టరిని గుజరాత్ కు తరలించి తెలంగాణ పొట్ట గొట్టింది మీరు కాదా? ఐటీఐఆర్ ను రద్దు చేసి యువతకు అన్యాయం చేసింది మీరు కాదా? లమూరు -రంగా రెడ్డి ఎత్తిపోతల కి జాతీయ హోదా ఇవ్వకుండా మీనవేషాలు లెక్కిస్తుంది మీరు కాదా? పోలవరం ముంపు తో సంబంధం లేని అయిదు పంచాయతీలను ఎపిలో విలీనం చేసి భద్రాద్రి రామయ్య భూములును ఎపికి అప్పనంగా అప్పగించింది మీరు కదా? కోట్ల రూపాయల ఖర్చుతో రైల్వే స్టేషన్లను ఆధునికరిస్తున్నాం అని గొప్పలు చెప్పే మీకు భద్రాద్రి రాముడికి 17 కిలోమీటర్ల దూరంలోని పాండురంగాపురం స్టేషన్ కనపడదా? మూసి ప్రక్షాళన కోసం మోడి సర్కార్ ఇప్పటి వరకు ఒక్క రూపాయి మంజూరు చేయకున్నా మూతి మూసుకుంది మీరు కాదా? గంగా ప్రక్షాళన కోసం మోడి ప్రభుత్వం గత ఎనిమిదేల్లలో 10,792 కోట్లు మంజూరు చేసింది. మరో 36 నదుల ప్రక్షాళన కోసం ఆరు వేల కోట్ల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
కాని ఆ జాబితాలో మూసి లేకపోవడం మీ అసమర్దత కాదాహైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్- వరంగల్, హైదరాబాద్- విజయవాడ, హైదరాబాద్- నాగ్పూర్ రూట్లలో ఇండ్రస్టియల్ కారిడార్, ఢిఫెన్స్ కారిడార్ ఏర్పాటు అన్నారు, అయ్యిందా? కృష్ణా జలాల్లో నీటి వాట తెల్చకుండా నాన్చుతుంది మీరు కాదా? సిరిసిల్లలో మెగా పవర్లూం క్లస్టర్ ఏర్పాటును పట్టించుకోనిది మీ కేంద్ర ప్రభుత్వం కాదా?. తెలంగాణకు ఐఐఎం ఇవ్వకుండా మోసం చేసింది మీరు కాదా? వెనకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన బిఆర్‌జిఎఫ్ నిధులు తెలంగాణకు ఎగ్గోటింది మీరు కాదా?. సెస్ ల పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రతి రోజు వేయి కోట్లు సంపాదిస్తూ ప్రజల నడ్డి విరుస్తుంది మీ ప్రభుత్వం కాదా?. రైల్ల టికెట్ల ధరలు పెంచిది మీరు కాదా?. యూపిలో 26 వేలు, ఎంపిలో 22 వేలు, ఇలా దేశంలో లక్ష ప్రభుత్వ పాఠశాలలను మూసేసింది మీ ప్రభుత్వం కాదా?. పిఎం ఫసల్ బీమా పథకంలో కేంద్ర వాటా తగ్గించి రైతులకు భారంగా మార్చింది మీరు కాదా?. 2022 లోపు అందరికి ఇండ్లు, టాయిలెట్లు, నల్లా కనెక్షన్లు ఇస్తామని హమీ ఇచ్చింది మీరు కారా?. తప్పుడు జిఎస్‌ట్టి, తప్పుడు ఆర్దిక విధానాలతో రాష్ట్రలకు నష్టం చేస్తున్నది మీరు కాదా?.. రూ.130 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రతి ఏటా వడ్డీలకే రూ. 12 లక్షల కోట్లు చెల్లిస్తూ దేశాన్ని అధోగతి పాలు చేస్తుంది మీరు కాదా? అంటూ మంత్రి పొన్నం బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
విద్వేశ ప్రచారం, విధ్వంస చర్యలు, రాజకీయ నియంతృత్వం, ఆర్థిక వ్యవస్థలో కార్పోరేట్ల పెత్తనం, మత ఆధిపత్యం, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న మోడీ హాయంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వకుండా మోసం చేశారని, కృష్ణా జలాల్లో నీటి వాట తెల్చకుండా నాన్చుతుంది మీరు కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను వంచించి ఒట్టి లేఖలు రాస్తే ప్రయోజనం లేదన్నారు. చేతనైతే ప్రధాని మోడీకి లేఖ రాసి ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అంతే గాని ఏడాదిన్నర క్రితం ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం అప్పుడే అన్ని చేసేయాలని ఇలా లేఖలు రాయడం మీ గుడ్డి ద్వేషానికి అద్దం పడుతోందని పొన్నం ప్రభాకర్ అన్నారు.