Monday, July 7, 2025

నేటి నుంచి వన మహోత్సవం.. ప్రారంభించనున్న సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

 వనమహోత్సవంలో రాష్ట్ర వ్యాప్తంగా 18.02 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం
 రాష్ట్ర వ్యాప్తంగా 9 కోట్ల మొక్కలు నాటేందుకు నర్సరీల్లో సిద్ధం
 ప్రతి మొక్కను బతికించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముందస్తు ప్రణాళికలు

మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న వనమహోత్సవం సోమవారం నుంచి మొదలు కానుంది. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటవీశాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో అధికారికంగా ప్రారంభించనున్నారు. వన మహోత్సవానికి అటవీశాఖ అధికారులు నెల రోజుల నుంచి తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇతర శాఖల ఉన్నతాధికారుల సమన్వయంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయ వంతంగా పూర్తిచేయాలని ప్రణాళికలు రూపొందించారు. వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో మొక్కలు నాటే నాటేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాదిలో వనమహోత్సవంలో రాష్ట్ర వ్యాప్తంగా 18.02 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో మాదిరిగా కాకుండా నాటిన ప్రతి మొక్కను బతికించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముందస్తు ప్రణాళికలు తయారు చేశారు. ముఖ్యంగా నాటిన మొక్కలకు నీటి సదుపాయం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని భావిస్తున్నారు. గతంలో నాటిన మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన వన మహోత్సవం కార్యక్రమం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. యూనివర్సిటీ క్యాంపస్ ప్రస్తుతం లంటానా, పార్థీనియం, ప్రోసోఫిస్ జూలిఫ్లోరా వంటి కలుపు మొక్కలతో నిండిపోయి, పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తోంది.

అదనంగా యూకలిప్టస్, సుబాబుల్ వంటి విదేశీ జాతుల మొక్కలు విపరీతంగా పెరిగిపోయి విలువైన స్థానిక తెలంగాణ వృక్ష జాతులకు చోటు లేకుండా చేశాయి. ఈ కలుపు మొక్కలు, విదేశీ జాతులను తొలగించి, కొత్త, విలువైన మొక్కలను నాటడానికి స్థలం కేటాయిస్తున్నారు. తెలంగాణలోని సాంప్రదాయ స్థానిక మొక్కలను పునరుద్ధరించడానికి, గత పదిహేను సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేయబడిన క్యాంపస్‌లోని బొటానికల్ గార్డెన్‌లో భారీ మొక్కల పెంపకం కార్యక్రమం జరుగుతోంది. బొటానికల్ గార్డెన్‌ను పునరుద్ధరించడానికి, పునరుజ్జీవింపజేయడానికి దాదాపు 30 స్థానిక కలప, అటవీ పండ్లు, అటవీ పూల జాతులు, వివిధ రకాల వెదురు జాతులను నాటాలని ప్రణాళిక రూపొందించారు. భవిష్యత్తులో, ప్రస్తుతం యూకలిప్టస్, సుబాబుల్ తో నిండి ఉన్న సుమారు 150 ఎకరాలను వన మహోత్సవంలో భాగంగా విలువైన కలపను ఇచ్చే రకాలను నాటడానికి ఖాళీ చేయనున్నారు. ముఖ్యంగా గత నెలలో, 150 ఎకరాల పాత స్థలాల నుండి యూకలిప్టస్, సుబాబుల్‌ను తొలగించడానికి పీజేటీఏయూ ఐటిసి కంపెనీకి టెండర్లు మంజూరు చేసింది. రాబోయే కొత్త సాంప్రదాయ తెలంగాణ స్థానిక జాతుల పెంపకం కోసం స్థలాన్ని సృష్టించడానికి చెట్లను తొలగించే ప్రక్రియ కొనసాగుతోందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఏ.జానయ్య వెల్లడించారు.

రైతులకు పండ్ల మొక్కలు పంపిణీ : రైతులకు వ్యక్తిగత ఆదాయానిచ్చే పండ్ల మొక్కలు పెద్ద ఎత్తున నాటేందుకు పంపిణీ చేయనున్నారు. ఇంటి ఆవరణంలో పెంచే మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రధానంగా పండ్ల మొక్కలను ఎక్కువగా పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ స్థలాల్లో పూల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోనున్నారు. జూలై, ఆగస్టు మాసాల్లో మొక్కలు నాటే లక్ష్యం పూర్తి చేస్తేనే, వర్షాకాలం పూర్తయ్యేనాటికి నాటిన మొక్కలు దాదాపు 90 శాతంకు పైగా బతుకుతాయని అంచన వేస్తున్నారు. 2024 లో డిపార్టుమెంటువారీగా, డిస్టిక్ వారీగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 20.02 కోట్ల మొక్కలు నాటాలని ప్రణాళికలు వేసుకోగా… 19.04 కోట్లు నాటినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ సారి వంద శాతం మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఖర్చులు తగ్గించుకునే కార్యక్రమంలో భాగంగా నాటే మొక్కలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి నాటకుండా అదే గ్రామంలో వన నర్సరీల ద్వారా పెంచిన మొక్కలు అదే గ్రామంలో నాటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి మొక్కలు తీసుకొస్తే రవాణా ఖర్చులు, మొక్క కొనుగోలు ఖర్చులు, నిర్వహణ ఖర్చులు కలిసి మోపెడు అవుతాయని, ప్రభుత్వానికి ఆర్థిక భారం పడుతుందని భావించి స్థానికంగా లభించే మొక్కలు నాటాలని స్థానిక అధికారులకు సూచించారు.

స్థానికుల భాగస్వామ్యం : మొక్కలు నాటే కార్యక్రమం, వాటిని పెంచేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు, ప్రకృతి ప్రేమికులను భాగస్వాములుగా చేయనున్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటే విధంగా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇంటి పేరట్లో గులాబీ, మందార, సీతాఫలం, జామ, ఉసిరి, అల్ల నేరేడు, మునగ, కానుగ, తులసి, ఈత మొక్కలతో పాటు పలు ఔషద మొక్కలు, పూల మొక్కలను పంపిణీ చేయనున్నారు. పూల మొక్కలను ప్రభుత్వ స్థలాలు, రహదారులకు ఇరువైపులా, పొలం, చెరువు గట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు, కమ్యూనిటీ కేంద్రాలు, వైద్య శాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఆవరణల్లో నాటనున్నారు. ఈత, తాటి, వేప, చింత, కుంకుడు మొక్కలు నాటించేందుకు ప్రణాళికలు పూర్తి చేశారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటిన వారిని గుర్తించి ప్రోత్సాహాకాలు ఇవ్వాలని ప్రభుత్వం మొదటి సారిగా నిర్ణయించారు.

7 కోట్ల మొక్కలు లక్ష్యం: మొక్కలు నాటే శాఖల్లో గ్రామీణాభివృద్ధి శాఖ ఇతర శాఖల కంటే ఎక్కువ మొక్కలు నాటనుంది. ఈ శాఖ పరిధిలో 7 కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 2.30 కోట్ల మొక్కలు నాటేందుకు కావాల్సిన గుంతలను సిద్ధం చేసి ఉంచారు. ఇంటింటికి ఆరు మొక్కల చొప్పున మొక్కలు పంపిణీ చేయనున్నారు. ఆగస్టు చివరి నాటికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఈ సారి తాటి, ఈత మొక్కలు నాటేందుకు పెద్దపీట వేశారు. అత్యధికంగా ఈ సంవత్సరం 25 లక్షల మొక్కలు తాటి, ఈత మొక్కలు నాటనున్నారు. అంతే కాకుండా రైతులకు వ్యక్తిగతంగా ఆదాయాన్ని సమకూర్చే పండ్లతోటల మొక్కలు నాటేందుకు తొలి ప్రాధన్యత కల్పించారు. 22 వేల ఎకరాల విస్తీర్ణంలో మొక్కలు పెంచనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 కోట్ల మొక్కలు నాటేందుకు వివిధ నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News