Monday, July 7, 2025

నా పద్యంలో నేను దొరుకుతాను

- Advertisement -
- Advertisement -

కందం రాయలేని వాడు కవి కాదనేది ఓ సాహిత్యోక్తి. శ్రీశ్రీ తదితరులు ప్రారంభంలో కవులే, తరువాత కాలంలో స్వంత అజెండాతో వచన కవిత్వంలో అద్భుతమైన శిల్పాలను సృజించారు. కీర్తిమంతులైనారు. తిలక్ సహితం అదే దారిలో ప్రయాణించారు. తిలక్ కవిత్వం ఎంతటి రసరమ్య మాధుర్యమో ఆయన పద్యం కూడా అంతటి మాధుర్య, మార్దవ ప్రధానమే. గోరువంకలుగా ఈయన పద్య కవిత్వం ఒక చోటుకు చేర్చారు. పాఠకుడి అనుభూతికి ఆకారం ఇచ్చిన కవితా చమత్కారం తిలక్ స్వంతం. ఆయన పద్యం కొత్త అనుభవాల సాహితీ ప్రక్రియ. ప్రాచీన కావ్యాలకు ప్రసిద్ధి కలగటానికి కారణం పద్యం అనేవారున్నారు. జాషువా, తిరుపతి వెంకటకవులు, చిలకమర్తి, గబ్బిట వెంకట్రావు తదితరుల పద్య నాటకాలు నేటి సజీవంగా ఉన్నాయంటే కారణం రస ప్రధానం, సమాజంలోని ఓ సజీవతను పద్య రూపంలో ఆవిష్కరించిన తీరు పండిత పామరులను రంజింపజేసింది.

హరిశ్చంద్ర, పాండవోద్యగ విజయాలు, చింతామణి, రా మాంజనేయ యుద్ధం వంటి పద్య నాటకాలు నేటి జనపదాల జనాల గొంతుల్లో తమదైన అస్తిత్వాన్ని నిలుపుకోవటానికి కారణం పద్యం. ప్రబంధ యుగంలో వెలువడిన కావ్యాల్లోని ప్రకృతి రమణీయతను ఆయా కాలాలకనుగుణంగా ఎంతో రసస్ఫూర్తితో వర్ణించిన కవుల కావ్యాలు నేటికి స్మరణీయమే.
శ్రీనాథుడు, పెద్దన, కృష్ణదేవరాయలు, తెనాలి రామలింగ కవి, ముద్ద పళని, మొల్ల వంటివారు శృంగార, భక్తి, రస ప్రధానమైన కావ్యాలకు ప్రాణం – పద్యం. తిలక్ తొలి రోజుల్లో ఎక్కువగా పద్య ఛందస్సులోనే కవిత్వం రాసేవాడు. ‘కొన్ని వందల ఏళ్ళ నుండి పద్యం ఉంది కదా! ఛందస్సులున్నాయి కదా వీటిని వొదిలి వేస్తున్నావేం’ అని ఆయన ఓ అసంపూర్ణ కావ్యం లో రాసుకున్నాడు. తిలక్ పద్య కవిగా ఎంత మందికి తెలుసో మరి! తిలక్ పద్యం ఒక్కసారి చదివితే.. ఒక జీవితకాలం పాఠకుడిని వెంటాడుతుంది. ప్రకృతి, స్త్రీలలోని ప్రతీ అంశాన్ని ఎంతో రసాత్మకంగా వర్ణించిన తీరు అద్భుత ఓ అక్షర విన్యాసం.
ప్రతీ దినమేగు భాష్ప కణ భార నిరోధిది శాంత నేత్రమై
ప్రతివకుళమ్మురాలు శశిరాత్రి దశాంతగ భోచ్చనాదమై
ప్రతి తెలివేకువ న్తొలగిరాలెను తారలు గాజు పూసలై
అతివ! కదల్పకీవయి సుటద్దపు మేడపు నాది గోడలన్

పై పద్యంలో పదగుంఫనంరసజ్ఞులను రసప్లావిత లోకానికి పయనింపజేస్తుందనటం అతిశయోక్తి కాదు. అలంకార, ఛందస్సుల మేల్బంతి వంటి వాక్య నిర్మాణం పాఠకుని మనసును అక్షరాల్లోసం చేస్తుంది. మరో లోకంలోకి తీసుకుపోతుంది. స్వయంవర అనే తొలినాళ్ళ ఖండికలో సీతారాముని మొదటిసారి చూసినప్పటి అనుభూతిని తిలక్ కవిత్వీకరించిన వైనం..
అదిగో సాగిను స్వామి విల్లుకయి ఆమందమ్ము ప్రాతస్వర
స్పదనోద్దీపిత రాజహంస వలె అశాంతమ్ము శోభించున్
స్తుదలన్చూడవె లౌకికా వదలనాందోళించు క్రొవ్వేలుసం
పదలో కమున్చెలి అతడే అతడునా ప్రాణేశుడా జన్మమున్

సీతలో రాముని చూసిన ఆనందం ఓ ఆకృతి దాల్చిన అనుభూతి ఆమెకు ఓ తోడును కనుగొనిన పారవశ్యపు అంశా లు, ఎంతో మృదువయిన పదాలతో తిలక్ రచించిన తీరు చదువరలకు పద్యం పట్ల వ్యామోహం కలిగిస్తాయి. 1960ల ప్రాంతంలో రాసిన అద్వైత మన్మథము పరిణత రచన, సీతారామునితో అంటుంది.
నేను నీలో నన్ను సృజించుకొనగ
నీవు నాలోలయింత వెండేని వింత
ఇదియ పూర్వక్రమము సృష్టి మొదలు తుదలు
కలసి కొన్న విమనలోన కాలమాగి

సీతారాములు నాటి నుంచి నేటి వరకు ఒక్కరే వారు ఆదర్శదంపతులు, కష్టాలు కన్నీళ్ళు ఎంతో సహజంగా భావించి కాలపరీక్షకు నిలబడి.. మానవులకు ఓ ధర్మయుత సాంసారిక జీవిత సూత్రాలను నేర్పించారు. కనుకనే భారతీయుల హృదయాల్లో సీతారాములకు గుడికట్టి నిలుపుకున్నారు, రాముని జీవితం సీతా సహనం భారతీయ తాత్వికతకు ఓ పునాది. తిలక్ భారతీయుల గుండెల్లో సీతమ్మ తల్లికున్న స్థానాన్ని ఈ పద్యంలో ఎంతో హృద్యంగా చిత్రించారు.
పాండవ పత్ని జీవితపు బాట యగమ్మము నిత్య యాతనా
చండిమమున్, తదన్య గుణశాలి నులున్నను, తల్లీ నీవుమా
గుండెల రక్తనాళముల కోసిన జాలివి, నిర్మలత్వమే
నిండుగ వెల్లు నీ కనులు నిల్చును జాతికి వెల్గుమిస్సులై

కేవలం కొన్ని అద్భుత పదాలతో భారతీయ ఆత్మలో సీత మమైకతను తిలక్ కవిత్వీకరిస్తారు. స్వామి వివేకానంద శత జయం తి నివాళిగా రాసిన ఖండిక గీతాంజలిలోని భావాన్ని స్ఫురింజేస్తుంది. ఇది అయిన అక్షర రమ్యతకు నిదర్శనం.
దేవుడెచట మనసు తేటతేదిన చోట
దేవుడెచట యిరులు తెగినచోట
దేవుదెచట సకల దీనుల కన్నీట
దేదుడెచట స్వామి నీవునచట!

స్వామి వివేకానంద అంతరంగాన్ని ఇంతకన్నా అందం గా అక్షరాల్లో ఆవిష్కరించడం బహుశా ఎవరికీ సాధ్యం కాదేమో అనిపిస్తుంది. అంతరార్థంలోని అర్ధం అక్షరాల్లోని విషయాన్ని ధ్వని మాత్రంగా పాఠకునికి అందిస్తుందీ పద్యం. ప్రకృతి కవిత్వం కృష్ణశాస్త్రితో ప్రారంభమయిందనే వారు ఉన్నారు. వారి అభిమానం అటువంటిది. కృష్ణశాస్త్రి, ప్రభావం కూడా అంతటిదే. తిలక్ ప్రారంభ దశలో పరమైన కవిత్వం ముమ్మరంగా రాసారు.
ఆటవెలదులు ఇందుకు ఉదాహరణ
తోట ఆకుపచ్చ పైట తొలగి జార
పూల రొమ్ము నిక్కపొడిచి నిలిచే
కొమ్మ కొమ్మ క్రొత్తకోర్కెల చివురుతో
గాలి కదలి పిలిచే కేలుసాచి

రసజ్ఞులైన భావుకులకు ఈ పద్యం ఓ మృష్టాన్నది భోజనం. ప్రకృతిలోని శృంగార భావనలకు అక్షరాలు అద్ది చక్కని ఫ్రేమ్ కట్టిన ఈ పద్యం కృష్ణశాస్త్రిని గుర్తుచేస్తే తప్పు తిలక్‌ది కాదు. అంతటి ప్రభావిత భావ కవిత్వం సృజించిన శాస్త్రి గారిదే అనుకోవాలి. చిన్న గడ్డిపరక ఎంతో గర్వంగా తలపైకెత్తి చూచుటకు వేదికయిన వర్షంను వర్ణించిన తీరు..
ఇంత చినుకు పడిన ఎంత పొగరుహెచ్చి
పచ్చి గడ్డిపరక పల్లవించే
చిన్ని పువ్వు తొడిగి చిలిపి చిలిపి గాలి
నూగి తూగి నవ్వు సూరినెల్ల!

స్థిర అస్థిత్వం లేని పువ్వు, గడ్డిరెమ్మ, చిన్నచిన్న కొమ్మలు అంత స్వచ్ఛంగా సవ్విన నవ్వును, వ్రేళ్ళ సందున సాంకేతికతను ఇముడ్చుకొని తానెంతో సాధించానని రొమ్ము విరుస్తున్న మనిషి ఎందుకు దూరమవుతున్నాదో ఒక్కసారి ఆలోచించుకొని ఎక్కడికీ ప్రయాణం ఏమి చూసి నేర్చుకోవాలి అనే అంశాలను తిలక్ పద్యం వచనం గుర్తు చేస్తాయి. తనలోని దైవత్వా న్ని గ్రహించగలిగితే.. అదెక్కడుందో అన్వేషించగలిగితే మానవుడు మాధవుడు ఎందుకు కాలేదు? ఈ అన్వేషణకు సమయమేది? అని ప్రశ్నిస్తే అది అజ్ఞానానికి పరాకాష్టా అనుకోవా లా? జ్ఞానానికి చిరునామా అనుకోవాలా? తిలక్ మాత్రం తాను పాము పడగ మీద ఫణిని అందుకున్నానంటారు.
అమృతత్వమమేదో వ్యాపించైనా లోన
సృష్టి మొదటి యూహా స్పష్టమయ్యే
బ్రతుకు బయలు నందు భయము గొలుపు పాము
పడగ మీద మణిని పట్టినాను..
అందుకే, నా పద్యంలో నేను దొరుకుతాను అనేది.
భమిడిపాటి గౌరిశంకర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News