రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 13 ఏళ్ల జర్మనీ బాలిక రాసుకున్న డైరీ ‘ది డైరీ ఆఫ్ అన్నే ఫ్రాంక్’ అనే పుస్తకమై పాఠకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. కోయంబత్తూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ చంద్రకుమార్ పోలీసుల చెరలో తాను అనుభవించిన హింసను పుస్తకంలో రాసుకున్నాడు. అది ‘లాకప్’ పేరిట ముద్రణ అయి వేలాది కాపీలు అమ్ముడుపోయింది.
స్వీయ అనుభవాలు, వాస్తవ సంఘటనల కలనేతగా వచ్చిన 944 పేజీల నవల శాంతా రాం కూడా పైవాటి సరసన చేరుతుంది. 2003లో ఇంగ్లీష్‌లో వచ్చిన ఈ పుస్తకాన్ని ఆస్ట్రేలియా వాసి అయి న ‘గ్రెగరీ డేవిడ్ రాబర్ట్స్’ రాశాడు. అంతర్జాతీయంగా బెస్ట్ సెల్లర్‌గా ఈ పుస్తకం నిలిచింది. ‘ఎ లిటరరీ మాస్టర్ పీస్’ అని డైలీ టెలిగ్రాఫ్ పత్రిక కితాబునిచ్చింది. 39 భాషల్లోకి అనువదింపబడి ఈ పుస్తకం, 42 దేశాల్లో 60 లక్షల కాపీలకు పైగా అమ్ముడు పోయింది.
ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ పుస్తక రచయిత జైలు నుండి పారిపోయి, తప్పించుకుని బతికిన ఖైదీ. గ్రెగరీ డేవిడ్‌కు మెల్‌బోర్న్ లో ఉద్యోగం ఉంది. భార్య, కూతురు ఉన్నారు. డ్రగ్స్ అలవాటుతో అన్నింటికీ దూరమయ్యా డు. దొంగతనాలకు అలవాటు పడ్డాడు. చివర కు ఒక బ్యాంకు దోపిడీ యత్నంలో పట్టుబడి జైలుపాలయ్యాడు. 1980లో జైలు నుంచి తప్పించుకొని నకిలీ ధ్రువపత్రాలతో ముంబై చేరుకున్నాడు. అప్పుడు ఆయన వయసు 28 ఏళ్లు. ‘లిన్ బాబా’ పేరుతో అక్కడి ప్రజలకు పరిచయమై ఓ క్లినిక్ తెరిచాడు. అక్కడే పరిచయమైన ప్రభాకర్ అనే మిత్రుడితో ఓసారి ఆయన గ్రామానికి వెళ్లాడు. ప్రభాకర్ తల్లి ఈయన పేరు పలకడం రాక ‘శాంతారాం’ అని పిలిచేది.
పదేళ్ల తర్వాత 1990లో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టగానే ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిపోయిన ఆరేళ్ల కారాగారవాసాన్ని పూర్తి చేసేందుకు తిరిగి జైలుకు పంపారు. ఆ తీరిక సమయంలో తన జీవనానుభవాలను రాయాలనే తలంపు రాబర్ట్స్‌కు వచ్చిం ది. ముంబైలో తన పదేళ్ల జీవితాన్ని లోకానికి తెలియజేయాలని రాయడం ఆరంభించాడు. కొన్ని వందల పేజీలు రాయగానే పోలీసులు వాటిని లాక్కునేవారు. అలా రెండుసార్లు రాతప్రతులు జైలు అధికారులు లాక్కొని కాల్చివేశారు. మూడోసారి కొంత జైలులో, కొంత విడుదల తర్వాత రాసి మొత్తానికి నవలను పూర్తి చేశాడు. ఇంగ్లిష్‌లో రాసిన ఈ పుస్తకానికి ‘శాంతారాం’ అని పేరు పెట్టాడు. ఇతర భాష ల్లోకి తర్జుమా అయినా.. అదే పేరుతో వచ్చింది. ఇందులో సగం కల్పితం, సగం ఆత్మకథ అని రచయిత చెప్పుకున్నాడు.
ప్రస్తుతం శాంతారాం తప్పక చదవాల్సిన ముఖ్యమైన వంద పుస్తకాల జాబితాలో చోటు పొందింది. తెగిన గాలిపటం లా తిరిగే ఓ పారిపోయిన ఖైదీ సాహాసిక జీవితం, జీవన తాత్వికత, జైలు బతుకు నవల గా రావడం సాహిత్యంలో ఓ కొత్త పోకడ. తొలి నవలకు వచ్చిన అపూర్వ స్పందనతో ‘రాబర్ట్స్ ది మౌంటెన్ షాడో’, ‘ది స్పిరిచువల్ పాత్’ అనే మరో రెండు నవలలు రాశాడు.73 ఏళ్ల రాబర్ట్స్ ఇప్పుడు మెల్‌బోర్న్‌లో కాలం గడుపుతున్నాడు. ఇప్పటికీ ఆయనకు ముంబైతో విడదీయరాని అనుబంధముంది. తన రచన ద్వారా వచ్చిన ఆదాయాన్ని కొంత ధారవి అభివృద్ధి కోసం కేటాయిస్తుంటాడు. ధారవిలో విస్తరించిన కుష్టు వ్యాధి నివారణ కోసం కృషి చేస్తున్నాడు. ఒక ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి అక్కడివారి విద్య, వైద్య అవసరాలను తీర్చుతున్నాడు. ఒక వ్యక్తి తానుగా రచయిత కాలేడు. కాలమే సరియైన సమయంలో, సరియైన నిర్ణయం తీసుకొని రచయితను సృష్టిస్తుంది. వారి రచనలను కాలం తన బిడ్డలుగా చిరకాలం కాపాడుకుంటుంది. అలాంటి రచనల్లో శాంతారాం ఒకటి.
- రచయిత గ్రెగరీ డేవిడ్ రాబర్ట్
– బద్రి నర్సన్