నథింగ్ ఫోన్ 3 భారత మార్కెట్లో అధికారికంగా విడుదలైంది. కంపెనీ ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన స్పెసిఫికేషన్లు, కొత్త గ్లిఫ్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లేతో ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ పరికరం నథింగ్ కంపెనీ నుంచి వచ్చిన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా నిలిచింది. కంపెనీ అధినేత కార్ల్ పేయి ఈ ఫోన్‌ను విడుదల చేశారు.
ఫీచర్లు
నథింగ్ ఫోన్ 3 లో 6.67 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 4,500 nits పీక్ బ్రైట్‌నెస్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ Snapdragon 8s Gen 4 ప్రాసెసర్‌తో నడుస్తుంది. ఐదు సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, ఏడు సంవత్సరాల భద్రతా ప్యాచ్‌లు లభించనున్నాయి. కాగా, Android 15 ఆధారిత Nothing OS 3.5పై పనిచేస్తుంది.
కెమెరా విషయానికి వస్తే ఇందులో 50MP ప్రైమరీ, 50MP పెరిస్కోప్ టెలిఫోటో (3x జూమ్), 50MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉంది. ఫోన్ 5,500mAh బ్యాటరీతో 65W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. IP68 రేటింగ్, Wi-Fi 7, Bluetooth 6, 360° యాంటెన్నా వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను తొలగించి గ్లిఫ్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లే అందించారు. ఇది ఛార్జింగ్, నోటిఫికేషన్లు, అలర్ట్స్‌ను తెలియజేస్తుంది.
ధర
కంపెనీ 12GB+256GB వేరియంట్ రూ. 79,999గా, 16GB+512GB వేరియంట్ రూ. 89,999గా పేర్కొంది. వైట్, బ్లాక్ కలర్లలో అందుబాటులోకి వస్తుంది. జూలై 15 నుండి ఫ్లిప్‌కార్ట్, క్రోమా, విజయ్ సేల్స్ ద్వారా కొనుగోలు చేయొచ్చు.