ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో శుభ్‌మాన్ గిల్ (Shubman Gill) సారథ్యంలోని టీం ఇండియా చరిత్ర సృష్టించింది. తొలిసారిగా ఎడ్జ్‌బాస్టన్‌లో విజయం సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌కి ముందు భారత్‌కు ఎడ్జ్ఞబాస్టన్‌లో గెలిచే సత్తా లేదని.. అది కూడా జస్ప్రీత్ బుమ్రా లేకుండా అసాధ్యమని చాలా మంది ట్రోల్ చేశారు. ఈ విజయంతో భారత్ ట్రోలర్స్‌కు సమాధానం ఇచ్చింది. అయితే మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఓ జర్నలిస్ట్‌ను ట్రోల్ చేశాడు.
ఈ మ్యాచ్‌కి ముందు జరిగిన మీడియా సమావేశంలో ఓ ఇంగ్లీష్ జర్నలిస్ట్ ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ రికార్డును గుర్తు చేస్తూ ప్రశ్నలు వేశాడు. బుమ్రా లేకుండా ఎలా నెట్టుకొస్తారు అని అడిగాడు. అయితే రెండో టెస్ట్‌లో విజయం తర్వాత ఆ జర్నలిస్ట్‌పై గిల్ (Shubman Gill) వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘‘నా ఫేవరేట్ జర్నలిస్ట్ ఎక్కడ..? కనిపించడం లేదు. అతడిని చూడాలని ఉంది’’ అని అన్నాడు. దీంతో మీడియా సమావేశంలో ఉన్న అందరూ నవ్వేశారు. అనంతరం గిల్ మాట్లాడుతూ.. ‘‘20 వికెట్లు తీయగలమనే నమ్మకం మాకు ఉంది. ఈ సిరీస్‌కి ముందే ఆ విషయం చెప్పాను. గతంలో ఎలా ఆడాము, ఆ రికార్డులు ఏంటని నేను పట్టించుకోను. అప్పుడు, ఇప్పుడు ఉన్న జట్లు పూర్తి భిన్నమైనవి. ఈ మ్యాచ్‌లో రెండో కొత్త బంతి తీసుకోవడంతో మ్యాచ్ మారిపోయింది. అది మేం పైచేయి సాధించడానికి దోహదపడింది’’ అని అన్నాడు.