త్వరలో అమల్లోకి రానున్న రిజర్వేషన్లు.. 153కు పెరగనున్న అసెంబ్లీ స్థానాలు
33శాతం రిజర్వేషన్ల కింద 51సీట్లు మహిళలకే కేటాయింపు
మరో తొమ్మిది సీట్లు ఇచ్చే బాధ్యత నాదే
మహిళలను కోటీశ్వర్లను చేయడానికే ఇందిరాశక్తి తెచ్చాం
ప్రతి తల్లీ రెండు మొక్కలు నాటాలి
వనమహోత్సవంలో మొక్కలు నాటిన అనంతరం సిఎం
మనతెలంగాణ/హైదరాబాద్: త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు రాబోతున్నాయని, రాష్ట్రంలో 153కు అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయని ఈ సీట్లలో 33 శాతం అంటే 51 సీట్లకు అదనంగా మరో తొమ్మిది సీట్లు కలిపి మొత్తం 60 ఎమ్మెల్యే సీట్లను మహిళలకు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆడబిడ్డలంటే తనకెంతో గౌరవమని గత ప్రభుత్వంలో వారిని ఎవరూ పలకరించలేదని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుతో మహిళలకు రాజకీయంగా రిజర్వేషన్ కల్పిస్తామన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడానికి ఇందిరా మహిళా శక్తి పథకాలు రూపొందించామని సిఎం రేవంత్ తెలిపారు. తెలంగాణలో స్కూళ్ల బాధ్యతతో పాటు వెయ్యి మెగావాట్ల పవర్ ప్లాంట్ల నిర్మాణంతో పాటు ఆర్టీసి బస్సులకు మహిళలనే ఓనర్లు చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ వనమహోత్సవ కార్యక్రమాన్ని సిఎం రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రుద్రాక్ష మొక్కను నాటిన సిఎం రేవంత్ ప్రతిఒక్కరు రెండు మొక్కలను నాటాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 18 వేల మొక్కలను నాటాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.
బొటానికల్ గార్డెన్ సందర్శించిన సిఎం
అమ్మ పేరుతో పిల్లలు మొక్కలు నాటాలని, మొక్కలను మనం రక్షిస్తే అవి మనల్ని కాపాడుతాయని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రతి తల్లి తమ ఇంట్లో రెండు చెట్లను పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. మనం ప్రకృతిని కాపాడుకుంటేనే మనం అభివృద్ధి చెందుతామన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని సిఎం గుర్తుచేశారు. ప్రభుత్వం చేపడుతోన్న వన మహోత్సవంతో తెలంగాణ హరితవనం కావాలని ఆయన ఆక్షాంక్షించారు. మనం చెట్టును కాపాడితే చెట్టు మనల్ని కాపాతుందని ఆయన అన్నారు. ఈ ఏడాది 18.03 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఆడబిడ్డలను అగ్రభాగాన నిలపాలన్నదే తమ ఆకాంక్షగా ఆయన తెలిపారు. తల్లులు మొక్కలు నాటితే పిల్లలను చూసుకున్నట్లే చూసుకుంటారని ఆయన తెలిపారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని బొటానికల్ గార్డెన్‌ను సిఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి తిలకించారు.
మహిళల చేత ఇందిరా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు
రాష్ట్ర మహిళలను కోటీశ్వరులగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టామని, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో మహిళల చేత ఇందిరా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయించామని సిఎం పేర్కొన్నారు. పదేళ్ల కాలంలో మంత్రి వర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు దక్కలేదని ఆయన ఆరోపించారు. మహిళలు ఆర్థికంగా బలపడటానికి, వ్యాపారాలు పెట్టుకునేందుకు ఈ సంవత్సరం రూ.21 వేల కోట్లు మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ఇచ్చామని సిఎం రేవంత్ గుర్తు చేశారు. ఆడబిడ్డలను అగ్రభాగన నిలపాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. ఆ ఘనత ఒక్క ఇందిరమ్మకే దక్కిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు, అసైన్డ్ భూములు, పోడు భూములు పట్టాలు ఇచ్చిన ఘనత ఒక్క ఇందిరాగాంధీకే దక్కిందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావడం వల్లే నేడు గద్వాల విజయలక్ష్మి, శ్రీలతలు మేయర్, డిప్యూటీ మేయర్ అయ్యారని అన్నారు.