నేడు తెరుచుకోనున్న శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు
అధికార యంత్రాంగం సమాయత్తం
881 అడుగులకు చేరిన నీటి మట్టం
ఆలమట్టి, నారాయణపూర్ గేట్లు బార్లా
మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి: కృష్ణా బేసిన్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిండడానికి మరో నాలుగు అడుగుల మేర అవసరం ఉండగా మంగళవారం మధ్యాహ్నానికి మరో రెండు అడుగుల మేర వరద నీరు చేరే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం నీటి మట్టం 881 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం పెరుగుతుండడం, ప్రస్తుతం ప్రాజెక్టులోకి లక్షా 80 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతూ ఉండడంతో ఉదయం వరకు రెండు లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం వరకు గేట్లను ఎత్తడానికి అధికారులు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భారీ నీటి పారుదల శాఖ మంత్రితో పాటు సాగునీటి శాఖ ఉన్నతాధికారులు తెలంగాణకు చెందిన మంత్రులు, ఎంఎల్‌ఎలు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఏపికి చెందిన సాగునీటి శాఖ అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం అందించినట్లు తెలిసింది.
మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో నిరాటంకంగా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. దీంతో పాటు 6 వేల క్యూసెక్కుల నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఆంధ్రప్రదేశ్ పవర్ హౌస్ నుంచి దిగువ నాగార్జున సాగర్‌కు 27 వేల క్యూసెక్కులు, తెలంగాణకు చెందిన పవర్ హౌస్ ద్వారా మరో 35 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కర్ణాటకలోని ఆలమట్టి నుంచి లక్షా 12 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో గేట్లను ఎత్తి లక్షా 15 వేల క్యూసెక్కులను దిగువ నారాయణపూర్‌కు వదులుతున్నారు. నారాయణపూర్ రిజర్వాయర్‌కు లక్షా 15 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా 30 గేట్లు ఎత్తి దిగువ జూరాల వైపునకు లక్షా 12 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో పాటు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో వరద క్రమక్రమంగా పెరుగుతోంది.