ఆత్మవిశ్వాసం పెంచే విజయమిది….
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 336 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో ఇంగ్లండ్‌కు గట్టి పోటీ ఇచ్చినా తృటిలో విజయం చేజారింది. ఈసారి మాత్రం టీమిండియా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చివరి వరకు పట్టును నిలబెట్టుకుంటూ బర్మింగ్‌హామ్‌లో చారిత్రక విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 11తో సమం చేసింది. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత జట్టు అసాధారణ ఆటతో ఆకట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించి ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది.
లీడ్స్‌లో ఓటమి పాలుకావడంతో సిరీస్‌లో భారత్ మళ్లీ పుంజుకోవడం అంత తేలిక కాదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీనికి తోడు సీనియర్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా కూడా దూరం కావడంతో భారత్‌కు ఈసారి కూడా ఓటమి ఖాయమని వారు జోస్యం చెప్పారు. అయితే భారత్ మాత్రం తొలి రోజు నుంచే దూకుడును ప్రదర్శించింది. ఇంగ్లండ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ ముందుకు సాగింది. టాప్ ఆర్డర్‌తో పాటు లోయర్ ఆర్డర్ బ్యాటర్లు నిలకడగా బ్యాటింగ్ చేశారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి కీలక ఇన్నింగ్స్‌తో అలరించాడు. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి, సీనియర్ ఆటగాడు కరుణ్ నాయర్ మరోసారి నిరాశ పరిచారు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు కొట్టిన రిషబ్ పంత్ మొదటి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు.
గిల్ జిగేల్..
అయితే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అసాధారణ బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. సహచరులు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌ల అండతో జట్టును పటిష్టస్థితికి చేర్చాడు. తనకు మాత్రమే సాధ్యమయ్యే బ్యాటింగ్‌తో గిల్ చెలరేగి పోయాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన గిల్ రికార్డు స్థాయిలో 269 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ గిల్ సెంచరీతో అలరించాడు. ఇంగ్లండ్ బౌలర్లను హడలెత్తించిన గిల్ 13 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో 161 పరుగులు సాధించాడు. దీంతో భారత్ తరఫున ఒక మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. అంతకుముందు భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ పేరిట ఈ రికార్డు ఉండేది. జడేజా, పంత్, రాహుల్, యశస్వి తదితరులు కూడా బ్యాట్‌తో సత్తా చాటారు.
సిరాజ్, ఆకాశ్ జోరు..
మరోవైపు బౌలింగ్‌లోనూ టీమిండియా అసాధారణ ప్రతిభను కనబరిచింది. హైదరాబాదీ స్టయిలీష్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌తో పాటు ఆకాశ్‌దీప్ అద్భుతంగా రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఆరు, ఆకాశ్‌దీప్ నాలుగు వికెట్లు పడగొట్టారు. కీలక సమయంలో ఇద్దరు వికెట్లను తీసి భారత్‌ను మళ్లీ పుంజుకునేలా చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆకాశ్‌దీప్ ఏకంగా ఆరు వికెట్లను పడగొట్టి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. పిచ్ నుంచి ఎలాంటి సహకారం లభించక పోయిన ఆకాశ్‌దీప్ అసాధారణ బౌలింగ్‌తో వికెట్ల పంట పండించాడు. దీంతో బర్మింగ్‌హామ్‌లో టీమిండియా చారిత్రక విజయాన్ని అందుకుంది. ఈ గెలుపు భారత్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని చెప్పాలి. రానున్న మ్యాచుల్లో మరింత మెరుగైన ఆటను కనబరిచేందుకు ఈ గెలుపు దోహదం చేయడం ఖాయం.