హైదరాబాద్: 18 నెలల నుంచి తెలంగాణలో సాగుతున్న కాంగ్రెస్ అరాచక పాలనతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. మంగళవారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్, కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఎరువుల కొరతతో రైతులు సతమతం అవుతున్నారని, ఒక ఆధార్ కార్డు మీద ఇచ్చే ఒక ఎరువుల బస్తా, యూరియా బస్తా కోసం చెప్పులు క్యూలో పెట్టి ఫర్టిలైజర్ దుకాణాల ముందు రైతులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. మళ్లీ ఆనాటి రోజులు తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్ నిజంగానే ఆ పాత దుర్ధినాలను తీసుకొచ్చిందని అన్నారు. కరెంటు కోతలు, ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయే ఆనాటి రోజులు మళ్లీ ఇప్పుడు వచ్చాయన్నారు. ఎరువులు, విత్తనాల కోసం లైన్లో నిలబడే ఆనాటి రోజులను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తీసుకొచ్చిందని విమర్శించారు.
ఇందిరమ్మ రాజ్యం అంటే అక్రమ కేసులు, అణచివేతలు, నిర్భందాలు అని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా ఇందిరమ్మ రాజ్యం ఉందని దుయ్యబట్టారు. సోషల్ మీడియాలో పోస్టు రీట్వీట్ చేస్తే శశిధర్‌గౌడ్‌ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటో ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. దళితులు, గిరిజనులు, పేదల పొట్ట కొడుతున్న ఈ ఇందిరమ్మ రాజ్యానికి ఘోరి కట్టడంతో పాటు రేవంత్‌కు కర్రు కల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో నోటికొచ్చిన హామీలు, వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక కోట్లాది కుటుంబాలను కాంగ్రెస్ దగా చేసిందని విమర్శించారు.