కల్వకుర్తి మోటార్లు ఆన్ చేసి నీళ్లు విడుదల చేయడం బిఆర్ఎస్ విజయం
మాజీ మంత్రి హరీష్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎట్టకేలకు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేసి నీళ్లు విడుదల చేయడం బిఆర్ఎస్ విజయం, కెసిఆర్ విజయం అని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ నిలదీస్తే గాని కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలిక రాదా..తాము ప్రశ్నిస్తే తప్ప రైతుల నీటి సమస్యలు గుర్తు రావా..అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. రేవంత్రెడ్డి రైతుల నోరు కొడుతున్నారు.. కడుపు కొడుతున్నరు అంటే గాని ఆలోచన రాదా..లక్షలాదిగా రైతులతో తరలి వచ్చి మోటార్లు ఆన్ చేస్తామంటే గాని చలనం ఉండదా..? అని నిలదీశారు. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరదను ఒడిసిపట్టాల్సింది పోయి, విడిచిపెట్టడం దుర్మార్గం అని మండిపడ్డారు. ఇకనైనా రాజకీయకక్ష సాధింపు చర్యలపై దృష్టి పెట్టడం మానేసి రైతాంగంపై దృష్టి సారించాలని హితవు పలికారు. కల్వకుర్తి వలే, కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి, రిజర్వాయర్లు నింపి పొలాలకు నీళ్లు మళ్లించాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.
ఎపిఒలకు వెంటనే వేతనాలు చెల్లించాలి: హరీష్ రావు
ఉపాధి హమీ ఎపిఒలకు మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం శోచనీయం అని మాజీ మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. చేసిన పనికి వేతనాలు రాక ఉపాధి హమీ సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కుటుంబ పోషణ భారమై సతమతమవుతుంటే ఈ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గం అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి మనోవేదనకు గురై ఉపాధి హామీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం విచారకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పారిశుధ్య కార్మికులకు కూడా వేతనాలు రాక గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని అన్నారు. ఎన్నికల సమయంలో హామీలతో ఊదరగొట్టిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏమని సమాధానం చెబుతారు..? ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉపాధి హామీ ఎపిఒలు, పారిశుధ్య కార్మికుల పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.