మన తెలంగాణ/కూకట్‌పల్లి: కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో కల్తీ కల్లు సేవించిన పలువురు తీవ్ర అస్వస్థతకు గురై కూకట్‌పల్లి రాందేవ్ ఆసుపత్రిలో చేరారు. రాందేవ్ ఆసుపత్రి చుట్టూరా అంబులెన్స్‌ల సైరన్లతో మార్మోగాయి. కల్తీ కల్లు సేవించిన 15 మంది ఆసుపత్రిలో చేరారు. వైద్యం అందించిన డాక్టర్లు 24 గంటలు గడిస్తే గాని వారి పరిస్థితి చెప్పలేమని తెలిపారు. పలువురు బాధితులు వెంటిలేటర్స్‌పై చికిత్స పొందుతున్నారు. సాయంత్రం ఐదు గంటల నుండి జరిగిన ఘటన తెలిసిన స్థానిక ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరెకపూడి గాంధీలు బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందికి తెలిపారు. విషయం తెలుసుకున్న డిఎంహెచ్‌ఓ ఉమా గౌరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కల్తీ కల్లు సేవించడంతో 15 మంది అస్వస్థతకు గురయ్యారని కల్లు కాంపౌండ్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హృదయవిదారకంగా మారిన సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.