ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌కు శ్వేతసౌధంలో విందు ఇవ్వడం, అనంతరం పాకిస్తాన్ ప్రభుత్వం నుండి అధికారికంగా ట్రంప్‌కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని సిఫార్సు చేయడం. ఇది జరిగి ఇరవై నాలుగు గంటలు గడవకముందే చంచల మనస్తత్వం, దూకుడు స్వభావం కలిగిన ట్రంప్ ఇరాన్ లోని మూడు అణ్వస్త్ర స్థావరాలపై (నతాంజ్, ఫోర్డో, ఇస్పహాన్) గత నెల (22-జూన్, -2025) మొదటిసారిగా తయారుచేసి పెట్టుకున్న బంకర్ బ్లస్టర్ బాంబులను ప్రయోగించి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలోకి తన ప్రమేయం లేకున్నా సినిమాలలో తళుక్కున మెరిసే అతిథి పాత్రవలే వచ్చి ఇరాన్లో విధ్యంస రచన చేసి ప్రపంచ రాజకీయాలలో ఓ చెడు ముద్రను వేసుకున్నాడు. దీని ఫలితం బహుశా ఇజ్రాయెల్ పాలకులు గాని, దానికి వంతపాడే అమెరికా అధికార గణం కూడా ఇరాన్‌ను తక్కువ అంచనా వేయడమే.
గత ఇరవై ఒక్క నెలలుగా ఇజ్రాయెల్ గాజాలో ఎంతటి నరమేధం సృష్టిస్తుందో ప్రపంచం మొత్తం రెండు కళ్ళు వెడల్పు చేసుకోని చూస్తూనే ఉంది. పాలస్తీనలో ఇప్పటి వరకు (18 జూన్, – 2025 నాటికి) 57,800 మంది చనిపోయారని నివేదికలు తెలియజేస్తున్నాయి. (Reports indicate) వీరిలో అత్యధికంగా చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు వీరెవరు ఇజ్రాయెల్ పైకి యుద్ధానికి నేరుగా వెళ్ళినవారు కాదు. అలా అని ఈ ఇరవై ఒక్క నెలల యుద్ధకాలంలో హమాస్ పూర్తిగా తుడిచిపెట్టుకనిపోయిందా అంటే సమాధానం లేని ప్రశ్న. అంటే ఇజ్రాయెల్ హమాస్‌పై యుద్ధం ప్రకటించి ఏం సాధించింది? గాజా ప్రాంతం మొత్తాన్ని నేలమట్టం చేసింది. అక్కడి ప్రజల జీవితాల్ని ఛిన్నాభిన్నం చేసింది. ఇది చాలదన్నట్లుగా ఇరాన్‌పైకి ఆలోచన వచ్చిందే తడువుగా (13 జూన్, 2025 న) దాడికి ఆదేశాలివ్వడం నేతన్యాహు చేసిన రెండో అవివేకపు ఆలోచన.
ఇరాన్‌తో యుద్ధం ప్రారంభిస్తే త్వరగా లొంగిపోతుంది. అక్కడి పాలకులతో కాళ్ళబేరానికి రప్పించి అణ్వస్త వ్యాస్తి నిరోధక చట్టం (ఎన్‌పిటి) మీద సంతకం చేయించుకోవాలని చూశారు. కానీ వారు అనుకున్నట్లుగా జరుగలేదు. ఫలితంగా రెండు వైపుల పది రోజుల పాటు (23 -జూన్, -2025 వరకు) జరిగిన యుద్ధంలో ఇరాన్ వైపు సుమారు ఎనిమిది వందల మంది, ఇజ్రాయెల్ వైపు వందమంది పౌరులు మరణించినట్లు సమాచారం. ఇక భౌతికంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడం చాలా కష్టమైన అంశం. గతంలో ఇజ్రాయెల్ అరబ్ దేశాలతో జరిగిన యుద్ధంలో (1967) కేవలం వారం రోజుల్లోనే గెలిచింది. మళ్ళీ ఇరాన్‌పై అలాగే గెలుస్తామని అనుకోవడం ఇజ్రాయెల్ చేసిన అతి పెద్ద పొరపాటు. ఈ పది రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ రక్షణ కవచం (ఐరన్ డోమ్) ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ మిసైళ్ళ ముందు తలొంచాల్సి వచ్చింది.
ఫలితంగా ఈ 77 సంవత్సరాల కాలంలో ఇజ్రాయెల్‌కు జరిగిన నష్టం ఇరాన్‌తో ఈ పది రోజుల యుద్ధంలో జరిగింది. ఇజ్రాయిల్ ప్రధాని నేతన్యాహు అమెరికాను ముగ్గులోకి దించి ఇరాన్‌లోని అణ్వస్త్ర స్థావరాలను ధ్వంసంచేసి సంతృప్తి పడొచ్చు. కానీ దాడికి ముందే (22- జూన్, 2025) ఆయా అణ్వస్త్ర స్థావరాలనునుండి శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్ తరలించిందన్నది ఓ వార్త కథనం. వెరసి అదే జరిగినా ఇరాన్ అంతర్జాతీయంగా ఈ యుద్ధం ద్వారా ప్రపంచానికి ఓ గట్టి హెచ్చరికను ఇవ్వగల్గింది. ఇరాన్ జోలికి ఎవరు వచ్చినా అంత తేలిగ్గా వదిలి పెట్టం అనేది ఆ హెచ్చరిక సారాంశం. ఈ అంశంలో ట్రంప్ మళ్ళీ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కురుర్చింది తానేనని చెప్పి అంతర్జాతీయ మీడియాకు ఓ వార్త సాధనంగా మారగలరు కూడా. ఆపరేషన్ సిందూర్ విషయంలో కూడా అనవసరంగా తలదూర్చి తానే రెండు అణ్వస్త్ర దేశాల మధ్య కాల్పుల విరమణ కుదిర్చానని పదేపదే లీకులు ఇచ్చి మన నాయకత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేసే ప్రయత్నం చేయడం గమనార్హం.
మరి ఇప్పుడు పాకిస్తాన్ అధికార గణం మళ్ళీ ట్రంప్‌ను నెత్తిన పెట్టుకొని నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని మళ్ళీ సిఫార్సు చేస్తుందేమో చూడాలి. ఇది చాలదన్నట్లుగా డోనాల్డ్ ట్రంప్ పేరును తన మిత్ర బృందంతో పాటుగా అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు బడ్డి కార్డర్ నార్వేలోని నోబెల్ కమిటీకి లేఖ పంపించడం గమనార్హం. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో తన హయాం లో ఎలాంటి యుద్ధాలు, యుద్ధ వాతావరణం ఉండదని చెప్పి వ్యూహాత్మకంగానే ఇజ్రాయెల్‌తో పాలస్తీనాలోని హమాస్ తిరుగుబాటుదారుల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటింపచేసి, ఎన్నికలు పూర్తి అయిన మరుక్షణం నుండే తిరిగి గాజాలో ఇజ్రాయెల్ సైన్యం మారణహోమం సృష్టించడం ప్రారంభించింది.అక్కడ 24 గంటల్లో చిన్న పిల్లలకు ఆహారం దొరకకపోతే సుమారు పద్నాలుగు వేలకు పైగా చిన్న పిల్లలు చనిపోతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ, గాజాలో సహాయ చర్యల్లో పాల్గొంటున్న స్వచ్ఛంద సంఘాలు చెప్పినా వినకుండా నేటికి కూడా ప్రతిరోజు సుమరుగా 60 మందికి పైగా సైన్యం జరుపుతున్న దాడిలో చనిపోతూనే ఉన్నారు.
మరి ఇవన్నీ అమెరికా అధ్యక్షుడికి తెలియకుండా జరుగుతున్నట్లేనా? దీనికి తక్షణం పెద్దన్నగా ఇజ్రాయెల్‌ను ఒప్పించి శాశ్వత కాల్పుల విరమణ ప్రకటించి గాజా/ పాలస్తీనా పునర్నిర్మాణం దిశగా అడుగులు వేయాలి. అలాగే ఐక్యరాజ్య సమితి (యుఎన్ఒ) 1948లో చేసిన ఇజ్రాయెల్ ఏర్పాటుతో పాలస్తీనాకు కేటాయించిన భూభాగాన్ని అగ్రరాజ్యం (అమెరికా) ఇజ్రాయెల్, యురోపియన్ యూనియన్ దేశాలు పాలస్తీనా ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చొరవ తీసుకొని ముందడుగు వేయాలి. తద్వారా పశ్చిమాసియాలో నిత్యం రగిలే రాచపుండు మాదిరిగా ఉన్న పాలస్తీనా సమస్యకు శాశ్వతంగా తెరపడుతుంది. ఇక రెండవది ఒక వైపు నాటోసభ్య దేశాలు, అలాగే యురోపియన్ యూనియన్ దేశాలతో ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తూ అగ్రరాజ్యం పరోక్షంగా ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ వుంది.
గత రెండున్నర సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య యుద్ధం జరగడానికి పరోక్ష కారణం అగ్రరాజ్యమే. దీనినంతటినీ ప్రపంచం గమనిస్తూనే ఉంది. ఈ యుద్ధాన్ని కూడా వెంటనే విరమించేలా డొనాల్డ్ ట్రంప్ క్రియాశీలక పాత్ర పోషించాలి. అలాగే తక్షణమే ఉక్రెయిన్ దేశానికి నాటో సభ్యదేశాలతోపాటు అమెరికా కూడా ఆయుధాల సరఫరా నిలిపివేస్తే యుద్ధం నిలిచిపోతుంది. ఈ విషయంలో కూడా అగ్రరాజ్య అధ్యక్షుడిగా ట్రంప్ చొరవ తీసుకొని ఆయుధాల సరఫరా నిలిపివేయాలి. మూడవ అంశం అగ్రరాజ్యానికి (అమెరికా) ఉగ్రవాద నిర్మూలనే పెద్ద ఎజెండా అయినప్పుడు మన దేశంతో స్నేహం, పొరుగుదేశం (పాకిస్తాన్)తో ఒప్పందాలు ఇలాంటి ద్వంద్వ నీతిని అగ్రరాజ్యం అవలంబించడం మొదటి నుండి వస్తున్నదే.
ఇది యావత్ ప్రపంచంలోని మేధావులను తొలుస్తున్న ప్రశ్న. అలాగే ఇజ్రాయెల్ యెమెన్ దేశంతోనూ, సిరియాలోను చేస్తున్న దాడులు వెంటనే ఆపేలా చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ అగ్రరాజ్య అధ్యక్షుడిగా ప్రపంచ పెద్దన్నగా పిలువబడే డొనాల్డ్ ట్రంప్ చేయగలడా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న! ఏదీఏమైనా ట్రంప్‌ను ఏరికోరి తెచ్చుకున్న అమెరికా ప్రజలకు మిగిలిన మూడున్నర సంవత్సరాలు అమెరిక సమాజానికి, ప్రపంచానికి ఎలాంటి సందేశం ఇస్తాడో చూడాలి. మొత్తానికి డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం అనేది ఈ శతాబ్దాపు జోక్ మాత్రమే!
- డా. మహ్మద్ హసన్
99080 59234