కొన్ని దేశాల పెడధోరణులను బ్రిక్స్ వేదికగా దునుమాడటంలో భారత్ ఎప్పుడూ ముందువరుసలో ఉంటుంది. ఈసారీ అదే సాంప్రదాయం కొనసాగింది. బ్రెజిల్ రాజధాని రియోడీ జనిరోలో జరిగిన సదస్సులో దక్షిణార్ధ గోళానికి (గ్లోబల్ సౌత్) జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడంలోనూ, ఉగ్రవాదంపై గోడమీది పిల్లివాటం ప్రదర్శిస్తున్న పలుదేశాల వైఖరిని తూర్పారబట్టడంలోనూ భారత ప్రధాని ఏమాత్రం వెనుకాడలేదు సరికదా, ఈసారి అంతర్జాతీయ సంస్థలు అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను సైతం కడిగి పారేశారు. రెండు అగ్రదేశాల ప్రతినిధులు.. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గైర్హాజరైన ఈ సదస్సును ముందుకు నడిపించడంలో ఆతిథ్య దేశం బ్రెజిల్‌తో కలిసి భారత్ కీలకపాత్ర పోషించింది.
భద్రతామండలి, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) వంటి అంతర్జాతీయ సంస్థలు తమను తాము సంస్కరించుకోవలసిన ఆవశ్యకతను ప్రధాని చాటిచెబుతూ,( Prime Minister stressed need) 21వ శతాబ్దపు సాఫ్ట్‌వేర్‌ను 20వ శతాబ్దపు టైప్ రైటర్లతో నడపలేమని చురకలంటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన భారత్‌కు భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఇప్పటికీ అందని ద్రాక్షగా ఉందన్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ, ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులమందికి ఆయా సంస్థల్లో ప్రాతినిధ్యం లభించడం లేదని మండిపడ్డారు. దక్షిణార్ధ గోళానికి తగిన ప్రాముఖ్యం ఇవ్వలేని సంస్థలు సిమ్ కార్డు ఉండీ నెట్‌వర్క్ లేని మొబైల్ ఫోన్లవంటివేనని ఎద్దేవా చేశారు. ఇదే సదస్సులో భాగంగా శాంతిభద్రతలపై జరిగిన సమావేశంలో ప్రధాని పహల్గాం ఉగ్రదాడిని నేరుగా ప్రస్తావిస్తూ, ఉగ్రవాదానికి ఊతమిచ్చేవారిని, దానివల్ల నష్టపోయేవారినీ ఒకే గాటన కట్టకూడదని హెచ్చరించారు.
ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడిని బ్రిక్స్ సభ్యత్వ దేశాలు ముక్తకంఠంతో ఖండించడం ఆహ్వానించదగిన పరిణామం. రియో డీ జనీరో వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరుగుతుండగానే అగ్రరాజ్యాధినేత అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతు ఇచ్చే బ్రిక్స్ దేశాలపై అదనంగా 10 శాతం పన్నులు విధిస్తామంటూ బెదిరింపులకు దిగడం ఆయన తెంపరితనానికి అద్దం పడుతోంది. బ్రిక్స్ దేశాలపై అమెరికాకు ఏనాటినుంచో కడుపుమంట ఉంది. సుమారు పాతికేళ్ల క్రితం బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలతో ‘బ్రిక్’గా ఏర్పడిన ఈ కూటమి ఇంతై, వటుడింతై అన్న రీతిలో అంతకంతకూ విస్తరిస్తోంది. 2010లో దక్షిణాఫ్రికా చేరికతో ‘బ్రిక్స్’గా పేరుమార్చుకున్న ఈ కూటమి ఇటీవలే ఈజిప్టు, ఇథియోపియా, ఇండోనేసియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకూ చోటు కల్పించింది. బ్రిక్స్ ప్రాధాన్యాన్ని గమనించిన మరో 20కి పైగా దేశాలు ఈ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.
బ్రిక్స్‌ను పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి తెరదించేందుకు ఏర్పడిన కూటమిగా అమెరికా, ఇతర ఐరోపా దేశాలూ భావిస్తున్నాయి. ముఖ్యంగా కూటమిలో చైనా, భారత్ ప్రాబల్యం పెరగడాన్ని అగ్రరాజ్యం జీర్ణించుకోలేకపోతోంది. డాలర్ పై ఆధారపడకుండా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న బ్రిక్స్ దేశాల అభిమతాన్ని తప్పుపడుతోంది. బ్రిక్స్ దేశాలు డాలర్‌తో ఆటలు ఆడాలనుకుంటే తాము వాణిజ్యంతో వారికి చెక్ పెడతామంటూ ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలు ఈ కోణంలోంచి అర్థం చేసుకోవాలి. ప్రపంచ జనాభాలో 46 శాతానికి బ్రిక్స్ దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ప్రపంచ జిడిపిలో 35 శాతం వాటాను, చమురు ఉత్పత్తిలో 40 శాతం వాటాను కలిగి ఉన్న బ్రిక్స్ కూటమిపై పాశ్చాత్య దేశాలు ఎంతోకాలంగా తృణీకార ధోరణి కనబరుస్తున్నాయి. జి7 దేశాలు అమెరికాకు సానుకూలంగా ఉంటే, బ్రిక్స్ మాత్రం ఎటువైపూ ఒరగకుండా, తనదైన రీతిలో స్వతంత్ర ప్రతిపత్తితో ముందుకు సాగుతుండటం అగ్రరాజ్యానికి సైతం మింగుడుపటడం లేదు.
బ్రిక్స్ కూటమిలో ఉన్నంతమాత్రాన అమెరికాకు తాను వ్యతిరేకం కాదని తెలియజెప్పేందుకు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలసి భారత్ క్వాడ్ కూటమిగా ఏర్పడిందన్నది గమనార్హం. బ్రిక్స్ కూటమి పాశ్చాత్య దేశాలకు అసూయ పుట్టించేదిగా ఉన్నా, ఈ కూటమి మేడిపండును తలపిస్తోందన్న సంగతిని విస్మరించకూడదు. కూటమిలోని సభ్యత్వ దేశాల మధ్య ఎన్నో రాజకీయ, సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా చైనా భారత్ మధ్య నెలకొని ఉన్న సరిహద్దు వివాదాల వంటివి కూటమి ఐక్యతకు తూట్లు పొడుస్తున్నాయి. బ్రిక్స్ దేశాలు తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకుని, ఆర్థిక, వ్యాపార బంధాలను బలపరచుకుంటే వర్ధమాన దేశాలకు చేయూతనిచ్చేందుకు ఆస్కారం కలుగుతుంది.