అమరావతి: ఎపి రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని మాజీ సిఎం వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) తెలిపారు. మామిడి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిత్తూరులోని బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చానని అన్నారు. కూటమి పాలనలో రైతులు కన్నీళ్లు పెడుతున్నారని, ప్రభుత్వమే రైతులపై కుట్రలు చేయడం దారుణం అని మండిపడ్డారు. రైతులను రాకుండా చేసేందుకు పోలీసులు మోహరించారని, రైతులను కలవకుండా ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు? కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు.
అయినా వేలమంది రైతులు వచ్చి వారి ఆవేదన చెప్పుకున్నారని అన్నారు. రైతులను రౌడీషీటర్లతో పోలుస్తారా? అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు (crop profitable state) ధర లేదని, కిలో మామిడి 2 రూపాయలా? ఇదేం దారుణం అని ఆశ్చర్యపోయారు. తమ హయాంలో రూ.22 నుంచి రూ. 29కి కొన్నామని, కర్ణాటకలో కిలో మామిడిని రూ.16 కి కేంద్రం కొంటుంటే…రాష్ట్రంలో సిఎం చంద్రబాబు నాయుడు గాడిదలు కాస్తున్నారా? అని లక్షల మెట్రిక్ టన్నుల్లో మామిడి ఉందని బాబుకు తెలియదా? అని ఎద్దేవా చేశారు. మామిడి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని సూచించారు.
వెంటనే 76 వేల మంది రైతుల పంట కొనుగోలు చేయాలని, ప్రతి రైతుకు వైఎస్ఆర్ సిపి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతుల పక్షాన నిలబడి తానే ముందుండి పోరాడతానని తెలియజేశారు. రాష్ట్రంలో ఉంది పోలీసులా? రాక్షసులా? అని రైతుల తలలు పగలకొడతారా? 1200 మందిని జైల్లో పెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రలోభాలు, లంచాలకు పోలీసులు లొంగొద్దు అని రేపు పోలీసులను కూడా చంద్రబాబు మోసం చేస్తారని హితవు పలికారు. వచ్చేది జగన్ ప్రభుత్వమే.. ఇది గుర్తు పెట్టుకోండి అని జగన్ సవాల్ విసిరారు.