హైదరాబాద్: కెసిఆర్ ఏ తేదీ చెప్పినా ఆ రోజు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. కృష్ణా జలాలపై నిర్వహించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడురు. కెసిఆర్ సభకు వస్తా అంటే.. స్పీకర్ అనుమతితో నిపుణులను కూడా అసెంబ్లీకి ఆహ్వానిస్తామని సిఎం అన్నారు. కెసిఆర్ పాలనలో నిర్ణయాలపై, తమ పాలనలో నిర్ణయాలపై చర్చిద్దాం అని పిలుపునిచ్చారు. ఎలాంటి గందరగోళం లేకుండా సభ నిర్వహిస్తామని సభా నాయకుడిగా తాను హామీ ఇచ్చారు. ప్రశాంత వాతావరణంలో అర్థవంతమైన చర్చ నిర్వహింద్దామని పేర్కొన్నారు. తనను దయచేసి క్లబ్బులు, పబ్బులకు పిలవొద్దని.. తాను రానని సిఎం అన్నారు.
‘‘చంద్రశేఖర్ రావు గారు.. మీరు అసెంబ్లీకి రావాలి’’ అని రేవంత్ (Revanth Reddy) పిలుపునిచ్చారు. కెసిఆర్ ఆరోగ్యం బాగుండాలని.. ఆయన ప్రజా జీవితంలో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కెసిఆర్ ప్రజలకు ఉపయోగపడాలని తాను అనుకుంటున్నానని.. కానీ తన తండ్రితో ఏ ఉపయోగం లేదని కెటిఆర్ అంటున్నారని ఎద్దేవా చేశారు. నేపాల్‌లోనూ ఓ యువరాజు కుటుంబంలో అందరినీ చంపి రాజయ్యాడని తెలిపారు. కెసిఆర్ కుటుంబంలో సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని అన్నారు. కుల పెద్దలతో, పెద్ద మనుషులతో మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని హితవు పలికారు.