మన తెలంగాణ/సంగారెడ్డిబ్యూరో:‘సిగాచీ’ ఫా ర్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో గ ల్లంతైన 8 మంది ఆచూకీ లభించడం కష్టమేనని అధికారులు తేల్చారు. ప్రస్తుతానికి ఆ ఎనిమిది మందికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు ల భించలేదని తెలిపారు. సహాయక చర్యలు మా త్రం కొనసాగుతాయని స్పష్టం చేశారు. బాధిత కుటుంబీకులు తమ తమ స్వస్థలాలకు వెళ్లాల్సిందిగా సూచించారు. గత నెల 30వ తేదీన పాశమైలారం సిగాచీ ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో ఈనెల 8వ తేదీ వరకు 44 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో తీవ్ర గాయాలపాలైన 15 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సంఘటన జరిగిన రోజు నుం చి మిగిలిన 8 మంది ఆచూకీ తెలియడం లేదు. పది రోజులుగా సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగించారు…
మట్టిని తవ్వుతున్నారు. యంత్రాలకు మానవ అవశేషాలు ఏమైనా దొరుకుతాయేమోనని సహాయ సిబ్బంది వెతుకుతున్నారు. దొరికిన అవశేషాలతో మ్యాచ్ అయ్యేందుకు, గల్లంతైన వారి కుటుంబీకుల నుంచి 100 వరకు డిఎన్‌ఎ శాంపిళ్లను పంపించారు. అయినప్పటికీ గల్లంతైన వారి ఆచూకీ లభించడం లేదు. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆచూకీ లభించని వారి కుటుంబ సభ్యులను వారి స్వస్థలాలకు పంపించాలని నిర్ణయించారు. ఐలా కార్యాలయం వద్ద ఇన్ని రోజులుగా గల్లంతైన వారి కుటుంబీకులను ఉంచారు. సహాయక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వసతి, భోజనం తదితర సౌకర్యాలు కల్పించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు వారికి వివరించారు.
చివరి వ్యక్తి ఆచూకీ లభించే వరకు సహాయక చర్యలు కొనసాగింపు
చివరి వ్యక్తి ఆచూకీ లభించే వరకు సహాయక చర్యలు కొనసాగుతాయని మరోసారి అధికారులు ప్రకటించారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులను ఇంకా ఎక్కువ కాలం ఇక్కడే ఉంచడం సరికాదన్న ఉద్దేశంతో వారిని ఇళ్లకు వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఐలా కార్యాలయంలో బాధిత కుటుంబాలతో సమావేశమయ్యారు. వారికి పరిస్థితి మొత్తం వివరించారు. రాహుల్, శివాజీ, వెంకటేశ్, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తమ వారి ఆచూకీ గురించి ఈ సందర్భంగా వారు ఏకరువు పెట్టారు. తమకు ఏదో ఒక విషయం చెబితే, ఆధారం ఇస్తే…అంత్యక్రియలు చేసుకుంటామని వారు అన్నారు. సహాయక సిబ్బంది ఎంతగా శ్రమించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని, డిఎన్‌ఎ శాంపిళ్ల ఫలితాలు రావాల్సి ఉందని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యల గురించి, ఇక్కడి పరిస్థితి గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివరిస్తామని అన్నారు. ఇప్పటికిప్పుడు తాము అధికారికంగా 8 మంది మృతిని ప్రకటించే పరిస్థితి లేదని వివరించారు.
చట్టానికి లోబడి, నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సి ఉన్నదని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని తెలిపారు. బాధిత కుటుంబాలు ఈ దశలో ఇక్కడ ఉన్నా… ఉపయోగం లేదని అన్నారు. ఏదైనా సమాచారం తెలిస్తే..ఆయా కుటుంబాలకు తాము తెలియజేస్తామని అన్నారు. ఇదిలావుండగా తమ వారు మృతి చెందినట్టు ఒక సర్టిఫికెట్ అయినా ఇవ్వాలని కొందరు కోరగా, ఈ పరిస్థితిలో సాధ్యం కాదని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఏదైనా పరిణామం ఉంటే, తాము తెలియజేస్తామని, మూడు నెలల తర్వాత మళ్లీ ఇక్కడకు రావాలని పేర్కొన్నారు. ఈలోగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుని తెలియజేస్తామని అన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో కూడా చర్చించేది అవకాశం ఉందని వివరించారు. అనంతరం ప్రతి కుటుంబానికి రూ.15 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. మృతుల్లో ఒక్కో కుటుంబానికి కోటి రూపాయలు ఇస్తామని ఇంతకుముందు యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మిగిలిన 8 మంది మృతి నిర్ధారణ కానందున రూ.15 లక్షలు మాత్రం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.