ఘట్‌కేసర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘట్‌కేసర్ మండలంలో అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని కన్నతండ్రిని కూతురు తన ప్రియుడు, తల్లితో కలిసి చంపేసింది. సెకండ్ షో సినిమాకు వెళ్లి వచ్చిన తరువాత మృతదేహాన్ని చెరువులో పడేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్‌లోని కవాడిగూడ ప్రాంతం ముగ్గుల బస్తీకి చెందిన వడ్లూరి లింగం(45), భార శారద తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉంటున్నాడు. లింగం పాతబస్తీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. పెద్ద కుమార్తె మనీషాకు(25) వివాహం చేశాడు. మహ్మద్ జావీద్(24) అనే వ్యక్తితో మనీషా అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆమెను భర్త వదిలేశాడు. దీంతో తన ప్రియుడు జావీద్‌తో కలిసి మౌలాలీలో ఉంటుంది. ఈ విషయం తండ్రికి నచ్చకపోవడంతో పలుమార్లు కూతురును బెదిరించాడు. దీంతో అక్రమ సంబంధానికి తండ్రి అడ్డుగా ఉండడంతో చంపేయాలని నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 5న నిద్ర మాత్రలు తల్లికి కూతురు ఇచ్చింది. నిద్ర మాత్రలను కల్లులో కలిసి భర్తకు ఇవ్వడంతో నిద్రలోకి జారుకున్నారు. మనీషా, జావీద్, శారద కలిసి లింగం ముఖంపై దిండు పెట్టి చంపేశారు. అనంతరం ప్రియుడితో కలిసి ప్రియురాలు సెకండ్ షో సినిమాకు వెళ్లారు. ఇంటికి వచ్చిన తరువాత కారు బుక్ చేసుకొని మృతదేహాన్ని అందులోకి ఎక్కించారు. కారు డ్రైవర్ కి అనుమానం రావడంతో ప్రశ్నించాడు. కల్లు తాగి మత్తులో ఉన్నాడని సమాచారం ఇవ్వడంతో ఎదులాబాద్ వద్ద దిగారు. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎదులాబాద్ చెరువులో 7న మృతదేహం కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఎస్‌ఐలు శేఖర్, సాయి కుమార్ తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒంటిపై గాయాలు కనిపించడంతో హత్య చేశారని అనుమానాస్పదంగా కేసు నమోదు చేశారు. మృతదేహం వడ్లూరి లింగం(45) దిగా గుర్తించారు. వెంటనే మృతుడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు బయటకు వచ్చాయి. పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.