Friday, July 11, 2025

హిందీపై ‘మహా’ దుమారం

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలోని మరాఠీ, ఇంగ్లీష్ మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో హిందీ మూడో బోధన భాషగా ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రెండు ఉత్తర్వులను తిరిగి వెనక్కు తీసుకున్నప్పటికీ, భాషా వివాదం తీవ్రంగా కొనసాగుతూనే ఉంది. అయితే రాష్ట్రప్రభుత్వం త్రిభాషా విధానాన్ని అధ్యయనం చేయడానికి ప్రఖ్యాత ఆర్థికవేత్త డాక్టర్ నరేంద్ర జాదవ్ నేతృత్వంలో కమిటీని నియమించింది. ఈ పాఠశాలల్లో మూడో భాషగా హిందీని తప్పనిసరి చేస్తూ ఏప్రిల్ 16న మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ విద్యావిధానం (ఎన్‌ఇపి) 2020 నిబంధనల ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరించింది. ‘ప్రస్తుతం రాష్ట్రంలో ఇంగ్లీష్, మరాఠీ మాధ్యమ పాఠశాలల్లో గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకు రెండు భాషల విద్యావిధానం కొనసాగుతోంది. అయితే రాష్ట్ర విద్యా విధాన 2024 రూపకల్పన ప్రకారం అన్ని పాఠశాలల్లో హిందీని తప్పనిసరి మూడో బోధన భాషగా గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకు అమలు చేస్తున్నాం’ అని ఆ ఉత్తర్వు పేర్కొంది.

ఇప్పటివరకు రాష్ట్రంలో ఇంగ్లీష్, మరాఠీ మీడియం స్టేట్ బోర్డ్ స్కూళ్లలో గ్రేడ్ 5 లోనే మూడో భాష బోధన అమలవుతోంది. ఇతర మీడియం స్కూళ్లలో ప్రాథమిక విద్యలో త్రిభాష (Trilingualism primary education) విద్యావిధానం ఇప్పటికే అమలవుతోంది. ఈ విధమైన ప్రభుత్వ నిర్ణయంలో రెండు కారణాలపై వ్యతిరేకత భారీ స్థాయిలో చెలరేగింది. మొదటిది ప్రాథమిక పాఠశాలల్లో గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5 వరకు మూడో భాషా బోధన రుద్ద కూడదు. రెండోది హిందీని విధింప చేయడం. ప్రాంతీయ భాషా సమాజాలు, విద్యావేత్తలు, పౌరసమాజ సభ్యులు, ప్రఖ్యాత సాహితీ వేత్తలు హిందీని బలవంతంగా రుద్దడంపై తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. ఇది మహారాష్ట్ర సంస్కృతిపై పెత్తనం చెలాయించే ప్రయత్నమే అని ధ్వజమెత్తాయి. తక్షణం దీన్ని రద్దు చేయాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వ స్వంత భాషా కమిటీ ప్రభుత్వానికి లేఖరాసింది.

ప్రాథమిక పాఠశాలల్లో త్రిభాష బోధన విధానాన్ని పిల్లలపై బలవంతంగా ఎందుకు రుద్దుతున్నారని, అలాగే హిందీని ఎందుకు విధిస్తున్నారని విద్యానిపుణులు ప్రశ్నిస్తున్నారు.హిందీ, హిందూ, హిందుస్థాన్ సిద్ధాంతాన్ని బలవంతంగా అమలు చేయడానికి ఆర్‌ఎస్‌ఎస్ ప్రణాళిక అని విమర్శిస్తున్నారు. మహారాష్ట్రలోని మరాఠీలు తమ భాష, సంస్కృతి ఉనికికి ఎక్కడా ఎలాంటి నష్టం రాకూడదని గట్టిగా ఎదిరిస్తున్నారు. భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్నిర్మాణం కోసం ఉద్యమం సాగిన తరువాత ఇప్పుడు మహారాష్ట్రలో జరుగుతున్న ఉద్యమం చారిత్రాత్మకమైనదని చెప్పవచ్చు. హిందీని బలవంతంగా రుద్దడంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా యావత్ రాష్ట్రం నిలబడిందని మరాఠీ అభ్యాస్ కేంద్ర అధినేత దీపక్ పన్వార్ పేర్కొన్నారు. తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ప్రభుత్వ తీర్మానాన్ని సవరిస్తామని, హిందీ తప్పనిసరి కాదని మహారాష్ట్ర విద్యామంత్రి దాదా భూసే ప్రకటించవలసి వచ్చింది. జూన్ 17న ప్రభుత్వం తీర్మానాన్ని సవరించింది. పాఠశాలల్లో హిందీ సాధారణ భాష అని పేర్కొంది.

విద్యార్థులు తమ మూడో భాషగా దేశంలోని ఏ భాషనైనా నేర్చుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే కనీసం 20 మంది విద్యార్థులైనా కలిసి డిమాండ్ చేయడం తప్పనిసరి నిబంధనగా సూచించింది. హిందీ కాకుండా దేశంలో మరే భాషనైనా నేర్చుకుంటామని కనీసం 20 మంది విద్యార్థులైనా కలిసివస్తే వారికి ఆ భాషా ఉపాధ్యాయుడ్ని ప్రభుత్వం అందుబాటులో ఉంచుతుందని లేదా ఆన్‌లైన్ ద్వారా నేర్చుకునే నిబంధన అమలు చేస్తుందని సవరించిన ప్రభుత్వ తీర్మానం పేర్కొంది. ఈ హిందీ భాషా వివాదం రాజ్ థాకరే మహారాష్ట్ర నవనిర్మాణ సేనకు రాజకీయంగా ఒక ఊపునిచ్చింది. ఇది ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతపరమైన భాషా దురభిమానంగా విమర్శించింది. ‘మనమంతా హిందువులం. హిందీలం కాం’ అని రాజ్ థాకరే వ్యాఖ్యానించారు. అంతేకాకుండా గత ఇరవై ఏళ్లుగా ఎడమొగం పెడమొగంగా దూరంగా ఉంటున్న థాకరే సోదరులు ఏకం కావడానికి దారిచూపించింది.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఆందోళన చేపట్టడానికి సోదరులిద్దరూ చేతులు కలిపారు. ఉమ్మడిగా ర్యాలీలు నిర్వహించారు.ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా ప్రభుత్వ నిర్ణయానికి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో గ్రేడ్ 4 వరకు హిందీని రుద్దకూడదని స్పష్టం చేశారు. ఇది మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటున్న మహాయుతి వర్గం ఏక్‌నాథ్ షిండేను ఇరకాటంలో పడేసింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేయడం షిండేకు ఇష్టపడడం లేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న సమయంలో ఈ భాషా వివాదం రాజకీయ పరిణామాల్లో మార్పు తీసుకురావచ్చు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 16, జూన్ 17న జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

డాక్టర్ నరేంద్ర జాదవ్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ త్రిభాషా విధానాన్ని పరిశీలిస్తుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. ఆ కమిటీ సమర్పించిన నివేదికను ప్రభుత్వ ఆమోదిస్తుందని తెలిపారు. అయితే పాఠశాల విద్యపై డాక్టర్ జాదవ్ నైపుణ్యం ఏమాత్రం? అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. భాగస్వామ్య పార్టీలతో కూడా ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఈ నిర్ణయాలు ఏవిధంగా ప్రభుత్వం తీసుకుంటుందని ఆయా పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. స్టీరింగ్ కమిటీ సమావేశం కూడా రహస్యంగానే జరిగిందని ఆరోపిస్తున్నారు. నరేంద్ర జాదవ్ కమిటీని, అలాగే ప్రాథమిక పాఠశాలల్లో బలవంతంగా హిందీని రుద్దే త్రిభాషా విధానాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. త్రిభాషా బోధనా విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని విపక్ష నేత శివసేన యుబిటి నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News