రెండేళ్లలో భారీగా దుర్వినియోగం
జరిగినట్లు గుర్తించిన సిఐడి
హెచ్‌సిఎ అధ్యక్ష ఎన్నికలకు
జగన్మోహన్‌రావు ఫోర్జరీ పత్రాలు
సమర్పించినట్లు నిర్ధారణ
కాంప్లిమెంటరీ పాసులు బ్లాక్‌లో
అమ్ముకొని సొమ్ము చేసుకున్న
నిందితులు జగన్మోహన్‌రావు
సహా ఐదుగురికి జ్యుడిషియల్
కస్టడీ విధించిన మల్కాజిగిరి కోర్టు
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో (హెచ్‌సిఎ) రెండేళ్లలో రూ.170 కోట్ల రూపాయల గోల్‌మాల్ జరిగినట్లు సిఐడి గుర్తించింది. దీనికి బాధ్యులైన ఐదుగురిని అరెస్టు చేసి గురువారం కోర్టులో హాజరుపరచగా, మల్కాజిగిరి కోర్టు వారికి జ్యుడిషియల్ కస్టడి విధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో టికెట్ల వివాదం నేపథ్యంలో సిఐడి దర్యాప్తు జరుపుతున్న క్రమంలో భారీగా ఆర్థిక అక్రమా లు వెలుగుచూసాయి. ఈ కేసులో హెచ్‌సిఎ అధ్యక్షుడు జగన్మోహన్‌రావుతోపాటు హెచ్‌సిఎ కోశాధికారి శ్రీనివాస్‌రావు, హెచ్‌సిఎ సిఇఒ సునీల్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాద వ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు రాజేందర్ యా దవ్ భార్య కవితలను సిఐడి అరెస్ట్ చేసి, విచారించగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. హెచ్‌సిఎ అధ్యక్ష ఎన్నికల్లో జగన్మోహన్‌రావు నకిలీ పత్రాలు సమర్పించినట్లు పోలీసులు నిర్దారించారు. జగన్మోహన్‌రావు శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించడంతో పాటు గౌలీపురా క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ సి కృష్ణ యాదవ్ సంతకం ఫోర్జరీ చేసినట్టు దర్యాప్తులో తేలింది. అలాగే కృష్ణ యాదవ్ సంతకాన్ని శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు.
ఈ ఫోర్జరీ పత్రాలతోనే జగన్మోహన్‌రావు హెచ్‌సిఎ అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు కూడా చెబుతున్నారు. అలాగే హె చ్‌సిఎకు చెందిన నిధుల దుర్వినియోగం పై కూడా జగన్మోహన్‌రావుపై అభియోగం నమోదయింది. నిధులు దుర్వినియోగంపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టిసిఎ ) అధ్యక్షుడు గురువారెడ్డి సిఐడికి ఫిర్యాదు చేశారు. జగన్మోహన్‌రావుకు హెచ్‌సిఎ కోశాధికారి శ్రీనివాసరావు, సిఇఒ సునీల్ సహకరించినట్లు దర్యాప్తులో ఆధారాలు లభించాయని తెలిసింది. అదే విధంగా ప్లేయర్స్ ఎంపికలో అవినీతి చేసినట్లు విచారణలో వెల్లడైంది. హెచ్‌సిఎ సభ్యులు క్రీడాకారుల తల్లిదండ్రులు నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. హెచ్‌సిఎలో చెక్ పవర్‌ను దుర్వినియోగం చేసి నిధులను కాజేసినట్లు బయటపడింది. బిసిసిఐ నుంచి హెచ్‌సిఎ కు వచ్చిన నిధులను కూడా వీరు గోల్‌మాల్ చేసినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్ హెచ్) నుంచి కాంప్లిమెంటరీ పాస్‌లను సైతం తీసుకొని బ్లాక్‌లో అమ్ముకొని నిందితులు సొమ్ము చేసుకున్నట్టు గుర్తించింది. క్రీడాకారుల ఇవ్వాల్సిన కాంప్లిమెంటరీ పాస్‌లను కూడా బ్లాక్‌లో విక్రయించి అవినీతికి పాల్పడినట్టు గుర్తించారు. ఎస్‌ఆర్‌హెచ్, హెచ్‌సిఎ మధ్య టికెట్ల వివాదం నెలకొనడంతో సిఎం రేవంత్ రెడ్డి మొదట విచారణకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి అప్పగించారు. వారి నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయాలని సిఐడికి అప్పగించిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టిసిఎ) ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సిఐడి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. ఆర్థిక అక్రమాలు, పత్రాల ఫోర్జరీ, బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపులు, నిధుల మల్లింపు తదితర అభయోగాలపై ప్రాథమిక ఆధారాలు సేకరించి వీరిని అరెస్టు చేసినట్టు సిఐడి ఎడిజి చార్‌సిన్హా విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.