42శాతం రిజర్వేషన్ల అమలు తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు
2018 చట్టానికి సవరణ సర్పంచ్, ఎంపిటిసి ఎన్నికలకు మండలం యూనిట్‌గా
రిజర్వేషన్ల ఖరారు జిల్లా యూనిట్‌గా ఎంపిపి, జెడ్‌పిటిసిలు రాష్ట్రం యూనిట్‌గా
జడ్‌పి చైర్మన్లు 17వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ రెడీ అమిటీ, సెంటినరీ
రిహాబిలిటేషన్ విద్యాసంస్థలకు యూనివర్శిటీల హోదా అధునాతన గోశాలల
నిర్మాణానికి సిఎస్ నేతృత్వంలో ముగ్గురు అధికారులతో కమిటీ పెండింగ్ ప్రాజెక్టులకు
భూసేకరణ ప్రక్రియ వేగవంతం రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు ముఖ్యమంత్రి
రేవంత్‌రెడ్డి నేతృత్వంలో నాలుగు గంటలపాటు సుదీర్ఘ భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్: బిసిలకు42% రిజర్వేషన్‌లను అమలు చేయాలని, ఆ తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగం గా రిజర్వేషన్‌లకు సంబంధించి పంచాయతీరాజ్ చట్టం 2018లో తీసుకొచ్చిన చట్టాన్ని త్వరలోనే సవరించాలని, దీంతోపాటు ఆర్డినె న్స్ ద్వారా బిసిలకు 42 శాతం రిజర్వేషన్‌లు అమలు చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో గురువారం సమావేశమైన కేబినెట్ తీ ర్మానించింది. దీంతోపాటు ఆధునిక గోశాలలను నిర్మించాలని, రెండు విద్యాసంస్థలను యూనివర్శిటీలుగా మార్చాలని ప్రభుత్వం ని ర్ణయించింది. వీటితో పాటు పలు అంశాలపై మంత్రివర్గం చర్చించింది. సుమారుగా నాలు గు గంటల పాటు వివిధ అంశాలను మంత్రివర్గం చర్చించడంతో పాటు ఈనెల 25వ తేదీ న మరోసారి కేబినెట్ భేటీని నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది.మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌లు సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రివర్గ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కేబినెట్‌లో తీసుకు న్న నిర్ణయాలకు సంబంధించి ప్రతి మూడు నె లలకు ఒకసారి చర్చించాలని నిర్ణయించినట్టు వారు తెలిపారు. దేశానికి ఆదర్శంగా రాష్ట్ర కేబినెట్ నిలిచిందని వారు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విస్మరించినా రాష్ట్రంలో కులగణన చేస్తామని చెప్పి దానిని విజయవంతంగా చేశామని మంత్రులు తెలిపారు. నాడు కామారెడ్డి బహిరంగ సభలో చెప్పినట్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 42 శాతం బిసిలకు రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చామని దాని ఆధారంగా కులగణన ల సర్వే చేసి 42శాతం రిజర్వేషన్‌ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి ఆమోదం చేసుకొని, గ వర్నర్ ఆమోదానికి పంపించి చిత్తశుద్ది నిరూపించుకున్నామని మంత్రులు తెలిపారు. కేబినెట్ సమావేశంలో అడ్వకేట్ జనరల్ సలహా లు, సూచనలు తీసుకొని భవిష్యత్‌లో చిక్కులు రాకుండా, బిసిలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేసి స్థానిక సంస్థలకు పోవాలని కేబినెట్‌లో నిర్ణయించినట్టు వారు తెలిపారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చిత్తశుద్దితో న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని, ఇచ్చిన మాట ప్రకారం 42శాతం బిసి సోదరులకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా మన్నారు. అందుబాటులో ఉన్న ఎంపిరికల్ డేటా ఆధారంగా, జనాభా ప్రకారం బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు తదుపరి చర్యలు చేపట్టాలని కేబినెట్ తీర్మానించిందన్నారు.
బిసిల రిజర్వేషన్‌లను ఖరారు చేసేందుకు గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచ్ ఎన్నికలకు, ఎంపిటిసి ఎన్నికలకు మండలం యూనిట్ గా, ఎంపిపి, జడ్పీటిసి ఎన్నికలకు జిల్లా యూనిట్ గా, జడ్పీ చైర్మన్లకు రాష్ట్రం యూనిట్ గా పరిగణించనున్నట్టు వారు తెలిపారు. రెండు విద్యాసంస్థలను యూనివర్శిటీలుగా మార్చాలని నిర్ణయించినట్టు మంత్రులు తెలిపారు. దేశవ్యాప్తంగా పేరున్న అమిటీ విద్యాసంస్థ, సెంటినరీ రిహాబిటేషన్ విద్యాసంస్థలను యూనివర్శిటీలుగా మార్చేందుకు కేబినెట్ ఆమోదించిందని వారు పేర్కొన్నారు. ఎయిమిటీ విద్యాసంస్థలో రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు 50శాతం సీట్లు కేటాయించాలన్న నిబంధనను విధించామని మంత్రులు తెలిపారు. రాష్ట్రంలో అధునాతనంగా గోశాలల ఏర్పాటు, నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు.
వచ్చే కేబినేట్ సమావేశంలోపు కమిటీ తమ నివేదికను అందించాలని ఈ కమిటీకి గడువు నిర్ణయించిందని వారు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 306 గోశాలలు ఉన్నాయని, ఆ గోశాలల్లో స్థలం తక్కువగా ఉందని, గోవులు ఎక్కువగా ఉన్నాయని వాటికి సరైన సౌకర్యాలు లేవని ఈ నేపథ్యంలోనే ఆధునిక గోశాలలను నిర్మించాలని నిర్ణయించామని, వాటికోసం స్థల సేకరణ చేయాలని కేబినెట్‌లో నిర్ణయించామని మంత్రులు తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పశుసంవర్థక శాఖ రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను కొత్తగా నిర్మించే గోశాల డిజైన్‌లను మంత్రివర్గ భేటీలో ప్రదర్శించినట్టు మంత్రులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఎన్కేపల్లి, వెటర్నరీ యూనివర్సిటీ, వేములవాడ, యాదగిరిగుట్టలో ఆధునిక గోశాలలు నిర్మించాలని నిర్ణయించినట్టు మంత్రులు తెలిపారు. వీటితో పాటు రాష్ట్రంలో ఉన్న గోశాలల రిజిస్ట్రేషన్లు, వాటి నిర్వహణపై సమగ్ర విధాన పత్రం రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు.
మార్చిలోపు లక్ష ఉద్యోగాలు
మార్చిలోపు లక్ష ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని మంత్రులు తెలిపారు. ఏడాదిన్నర వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, వాటితో పాటు మరో 17,084 ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నాయని, కొత్తగా 22,033 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వాలని మంత్రివర్గం చర్చించిందని వారు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో ఇటీవల రెండు కొత్త మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పడ్డ జిన్నారం, ఇంద్రీశం మున్సిపాలిటీల పరిధిలో చేర్చే 18 గ్రామ పంచాయతీలను డీ లిస్టింగ్ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని వారు తెలిపారు.
ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పనితీరును సమీక్షించేందుకు
వివిధ విభాగాల్లో పని చేస్తున్న ప్రతి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పనితీరును సమీక్షించేందుకు వీలుగా వారి ఆధార్, పూర్తి వివరాలు సేకరించాలని ఆర్థిక శాఖను మంత్రివర్గం ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగుల హాజరుతో పాటు విధి నిర్వహణలో జవాబుదారీతనం పెంచేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని వారు తెలిపారు. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి నియమించిన అధికారుల కమిటీకి ఈ బాధ్యత అప్పగించాలని నిర్ణయించామని, రెండు నెలల్లో పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఈ కమిటీని ఆదేశించినట్టు మంత్రులు తెలిపారు.
కొత్త సంప్రదాయం
ఈసారి రాష్ట్ర మంత్రివర్గం కేబినేట్ భేటీలకు సంబంధించి కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించిందని, ఇప్పటివరకు జరిగిన కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, అమలుపై సమీక్ష జరపాలని కేబినెట్ తీర్మానించిందన్నారు. 2023 డిసెంబర్ 7వ తేదీ నుంచి ఇప్పటివరకు 18 కేబినెట్ సమావేశాలు జరిగాయని ఈరోజు 19వ సమావేశం జరిగిందని వారు తెలిపారు. గతంలో జరిగిన సమావేశాల్లో మొత్తం 327 అంశాలను చర్చించామని వాటిలో 321 అంశాలను కేబినెట్ ఆమోదించిందన్నారు. వాటి అమలు పురోగతిని శాఖలవారీగా అధికారులతో మంత్రివర్గం చర్చించిందన్నారు.