ఆసుపత్రుల నిర్మాణాలకు శంకుస్థాపనలు
రోడ్లకు భూమి పూజలు
నాగర్‌కర్నూల్ మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవం
ఆసుపత్రికి శంకుస్థాపన
తూడుకుర్తిలో పిహెచ్‌సికి శంకుస్థాపన
మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్ జిల్లాలో శుక్రవారం పలు శంకుస్థాపనలు, భూమి పూజ కార్యక్రమాలకు మంత్రులు పాల్గొననున్నారు. కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర రాజ నర్సింహా, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్కెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, డాక్టర్ రాజేష్ రెడ్డిలతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు.
ఉదయం 9.30 గంటలకు మాడ్గుల మండల కేంద్రంలో 12.70 కోట్ల రూపాయలతో నిర్మించబోయే 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన, ఉదయం 10.15 గంటలకు మాడ్గుల వద్ద కోనాపూర్ నుండి మాడ్గుల వరకు, మాడ్గుల నుండి దేవరకొండ రోడ్డు వరకు 70 కోట్ల రూపాయలతో నిర్మించే డబుల్‌లైన్ బిటి రోడ్డుకు శంకుస్థాపన ఉదయం 10.30 గంటలకు మాడ్గుల మండలంలోని 220 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ, ఉదయం 11.45 గంటలకు వెల్దండ నుండి సిరసనగండ్ల వరకు 40 కోట్లతో నిర్మించే బిటి డబుల్ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కల్వకుర్తి వద్ద కల్వకుర్తి నుంచి కొట్రా గేట్, కొట్రా గేట్ నుండి తలకొండపల్లి వరకు సుమారు 22 కిలోమీటర్ల వరకు 65 కోట్లతో నిర్మించే బిటి డబుల్ రోడ్డుకు శంకుస్థాపన, మధ్యాహ్నం 2 గంటలకు కల్వకుర్తి పట్టణంలో 45.50 కోట్లతో నిర్మించే వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన, అనంతరం పబ్లిక్ మీటింగ్‌లో మంత్రులు పాల్గొననున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో
మధ్యాహ్నం 3 గంటల నుంచి నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నాగర్‌కర్నూల్‌లో నూతనంగా నిర్మించే మెడికల కాలేజ్ ప్రారంభోత్సవం, నూతన ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన, నూతనంగా నిర్మించే ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు శంకుస్థాపన కార్యక్రమాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.