Friday, July 11, 2025

కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు చేయాల్సిందే: పూసల ప్రభావతి రెడ్డి

- Advertisement -
- Advertisement -

లేదంటే ఆందోళనలు తప్పవు
టిఆర్‌ఎస్ మహిళా నాయకురాలు పూసల ప్రభావతి రెడ్డి
మన తెలంగాణ/ హుజురాబాద్ రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారంటీలను అమలు చేసి చూపించాలని, తదనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని టిఆర్‌ఎస్ మహిళా నాయకురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం హుజూరాబాద్‌లో విలేకరులతో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేక పోయిందని విమర్శించారు. నాడు ఎన్నికల సందర్భంగా పంటల బీమా అమలు చేస్తాం, అందులో రైతుల వాటా కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని ఊదరగొట్టి, నేడు రెండు సీజన్లు గడిచిన పంటల బీమా ఊసే కాంగ్రెస్ సర్కార్ ఎత్తడం లేదన్నారు. అటు అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వక, ఇటు పంటల బీమా పైసలు రాక రైతన్నను హరిగోస పెడుతున్న రైతు ద్రోహి రేవంత్! అని ఆమె ఆరోపించారు.

కెసిఆర్ పదేళ్ల పాలనలో సాగునీటికి, తాగునీటికి, విద్యుత్కు ఇబ్బంది లేకుండా చేశారని, నిరుపేద, మధ్యతరగతి జనం కోసం,కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గురుకుల పాఠశాలలు, దళిత బంధు, రైతు బంధు, రైతు బీమా, కెసిఆర్ కిట్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ఎన్నో పథకాలను అమలుచేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు అర్థం కావడంలేదని, సంక్షేమ పథకాల అమలు నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రం దివాలా తీసింది అని, అప్పు పుట్టడం లేదని, తాము ఏమి చేయలేమని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారని, రాష్ట్ర ప్రజల మానసిక స్తైర్యాన్ని, రాష్ట్ర విశ్వసనీయతను కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తుందని ఆమె ఆరోపించారు. దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధోగతి పాలు చేస్తోందని, ఇలాంటి ప్రభుత్వాన్ని తాము ఎన్నడూ చూడలేదని ప్రజలు చెప్తున్నారని ప్రభావతి రెడ్డి వెల్లడించారు.

ఏడాది కాలం కాకముందే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ నేతలను ప్రతినిత్యం విమర్శించడం మానుకొని ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని ఆమె సవాల్ చేశారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ హామీ అమలు చేయాలని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేసి కార్పోరేషన్ పదవులను మహిళలకు కట్టబెట్టల్లాన్నారు. ఇప్పటికైనా మహిళలకు మంత్రిమండలిలో, కార్పోరేట్ పదవులలో తగిన ప్రాధాన్యత కల్పించి కాంగ్రెస్ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రభావతి రెడ్డి సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News