బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ కెరీర్ పరంగా తనని తాను నిరూపించుకుంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా డి గ్లామర్ రోల్స్ చేయడానికి కూడా అలియా ఎప్పుడు వెనకాడదు. ఎప్పటికప్పుడు తన ప్రతి చిత్రంలో వైవిధ్యతను కనబరుస్తూ స్టార్ హీరోలకు ధీటుగా బాలీవుడ్‌లో ఆమె రాణిస్తోంది. 2012లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అలియా భట్ తన కెరీర్ కోసం బరువు తగ్గాల్సి వచ్చింది. సినీ ఇండస్ట్రీలోకి రాకముందు తన శరీరాకృతి గురించి పెద్దగా పట్టించుకోని ఈ భామ అనంతరం ఎంతో డైటింగ్ చేసి కష్టపడి తగ్గింది. ఆమె పట్టుదల చూసి ఆమె స్నేహితుడు కూడా ఇక డైటింగ్ చేసింది చాలు నీకు నచ్చిన ఫుడ్ తీసుకో అని అనేవారట.
కానీ అలియా భట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డైటింగ్ ఆపలేదు. స్వతహాగా కాస్త బొద్దుగా ఉన్న ఈ బ్యూటీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాక తనని తాను ఎంతో మార్చుకుంది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన అలియా శరీరాకృతి విషయంలో తను ఎదుర్కొన్న సమస్యలను పేర్కొంది. అయితే ఇదంతా తల్లి కాక ముందట.. తల్లిగా తన ప్రయాణం తన శరీరాన్ని గౌరవించడం నేర్పించిందని.. కేవలం సన్నగా ఉండడం మాత్రమే జీవిత గమ్యం కాదు అన్న విషయాన్ని తెలుసుకున్నానని ఆమె పేర్కొంది. గర్భవతిగా ఉన్న సమయంలో శరీరాకృతి విషయంలో తన ఆలోచన పూర్తిగా మారిపోయిందని అలియా భట్ చెప్పింది. అంతేకాదు ఐశ్వర్యరాయ్ బచ్చన్, రేఖ తన జీవితంలో ఎంతో స్ఫూర్తి నింపారు అని ఈ భామ తెలిపింది. ఏదైనా సినిమా కోసం డాన్స్ చేయాలి అంటే ఆలియా ముందుగా యూట్యూబ్లో ఐశ్వర్యరాయ్ డాన్స్ వీడియోస్ చూస్తుందట. ఆమెకు ఉన్న గ్రేస్ డాన్స్‌లో మరి ఎవరికి లేదు అనేది అలియా భట్ అభిప్రాయం.